
అనంతపురం కలెక్టరేట్ వద్ద వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి, నాయకులు
వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం హెచ్చరిక
రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద నిరసనలు
సాక్షి, అమరావతి: పంచాయతీరాజ్ వ్యవస్థను బలహీన పరిస్తే సహించేది లేదని, కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం హెచ్చరించింది. వ్యవస్థలో సమస్యల పరిష్కారానికి, డిమాండ్ల సాధనకు వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. ఆందోళన కార్యక్రమాల అనంతరం జిల్లా కలెక్టర్లకు వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, దేశంలోనే పంచాయతీరాజ్ వ్యవస్థను ఇంత బలహీన పరచిన ప్రభుత్వాలు లేవని ఆందోళన వ్యక్తం చేశారు.
కూలీలకు చెందాల్సిన ఉపాధి హామీ నిధులను సైతం టీడీపీ నేతలు దోచుకుంటున్నారని విమర్శించారు. కేంద్రం విడుదల చేసిన 15వ ఫైనాన్స్ నిధులను కూడా దారి మళ్లించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. సర్పంచ్‌లను ప్రభుత్వ ఉద్యోగులుగా చూపి వారి పిల్లలకు చెందాల్సిన తల్లికి వందనం పథకంలో కోత విధించడం దారుణమన్నారు.
పంచాయతీ కార్యదర్శులకు తక్షణమే పోస్టింగ్‌లు ఇచ్చి జీతాలు జమ చేయాలని వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం డిమాండ్ చేసింది. అనంతపురం జిల్లా కేంద్రంలో జరిగిన ఆందోళనలో వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి, ఎన్టీఆర్ జిల్లా కేంద్రంలో జరిగిన ఆందోళనలో ఎంపీపీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాం«దీ, తిరుపతి జిల్లా కేంద్రంలో జరిగిన ఆందోళనలో ఎమ్మెల్సీ మేరుగ మురళీ నాయకత్వం వహించారు.