క్యాన్సర్‌ వైద్య కిరణాలు.. రాష్ట్రంలోనే తొలిసారిగా

Palliative Care Centre inaugurated at Guntur Government Hospital - Sakshi

చివరి దశలోనూ ఉపశమన చికిత్సతో ప్రయోజనం   

గుంటూరు జీజీహెచ్‌లో ప్యాలేటివ్‌ సెంటర్‌   

రాష్ట్రంలోనే తొలిసారిగా ఇక్కడ ఏర్పాటు   

రోగుల సహాయకులకూ ఉచితంగా అత్యాధునిక పరీక్షలు

సాక్షి, గుంటూరు: క్యాన్సర్‌ సోకితే ప్రాణాలు పోవటమే అనే అపోహ చాలా మందిలో ఉంది. ఇది ఏ మాత్రం నిజం కాదని,  ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స చేస్తే పూర్తిగా నయం చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. వైద్య రంగంలో వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఙానంతో వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చని పేర్కొంటున్నారు.  

ప్యాలెటివ్‌ కేర్‌ ప్రత్యేక వార్డు  
ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే అన్నిరకాల క్యాన్సర్లను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ప్రత్యేక క్యాన్సర్‌ సెంటర్లను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. క్యాన్సర్‌ చివరి దశలో ఉన్నవారికీ  ఉపశమన చికిత్స అందించేందుకు రాష్ట్రంలోనే తొలిసారిగా గుంటూరు జీజీహెచ్‌లో ప్యాలేటివ్‌ కేర్‌ ట్రీట్‌మెంట్‌ ప్రత్యేక వార్డును ఇటీవలే అందుబాటులోకి తీసుకొచ్చారు.

చదవండి: (రాజ్‌నాథ్‌సింగ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు: మేకపాటి)
 
ఉచితంగా శస్త్రచికిత్సలు  
గుంటూరు జీజీహెచ్‌లోని నాట్కో క్యాన్సర్‌ సెంటర్‌లో అన్నిరకాల క్యాన్సర్లకు ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు. సర్జికల్, మెడికల్, రేడియేషన్‌ ఆంకాలజీ వైద్య సేవలు ప్రస్తుతం ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నాయి. ఇక్కడి సేవలను  రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ క్యాన్సర్‌ వైద్యనిపుణులు డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడూ ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం, నాట్కో ట్రస్ట్‌ సంయుక్త భాగస్వామ్యంతో సుమారు రూ.50 కోట్లతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశాయి. ఇక్కడ సుమారు రూ.70 లక్షలతో మాడ్యులర్‌ ఆపరేషన్‌ థియేటర్‌ను నిర్మించి ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తున్నారు.  

చివరి దశపైనా ప్రత్యేక దృష్టి 
క్యాన్సర్‌ను చివరి దశలో గుర్తిస్తే చికిత్స అందించటం కష్టంతో కూడిన పని. ఇలాంటి రోగులకు ఉపశమన చికిత్స అందిస్తే ప్రయోజనం ఉంటుంది. అందుకే రాష్ట్రంలోనే తొలిసారిగా గుంటూరు నాట్కోసెంటర్‌లో ప్యాలేటివ్‌ కేర్‌(ఉపశమన చికిత్స) వార్డు ఏర్పాటు చేశారు. దీనికోసం గుంటూరు బొంగరాలబీడులోని రెండు ఎకరాల స్థలంలో శాశ్వత భవనం నిర్మించేందుకూ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రాష్ట్ర  వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్‌ కుమార్‌ ఈ విషయాన్ని గతనెలలో వెల్లడించారు. తాత్కాలికంగా నాట్కో సెంటర్‌లో ఉపశమన చికిత్స అందుతోంది.  క్యాన్సర్‌ రోగులకు సహాయకులుగా వచ్చే వారికీ ఉచితంగా అత్యాధునిక పరీక్షలు చేస్తున్నారు.

కార్పొరేట్‌ వైద్యసేవలు  
క్యాన్సర్‌ సెంటర్‌లో కార్పొరేట్‌ వైద్యసేవలు అందిస్తున్నాం. ఇక్కడ పీజీ సీట్లు మంజూరు చేయడంతోపాటు స్పెషాలిటీ క్యాన్సర్‌ వైద్యులను ప్రభుత్వం నియమించింది. క్యాన్సర్‌ చివరి దశలో ఉన్నవారికి ఉపశమన చికిత్స కోసం ప్రత్యేక వార్డును అందుబాటులోకి తీసుకొచ్చాం. శస్త్రచికిత్సలు ఉచితంగా చేస్తున్నాం. మందులూ ఉచితంగా ఇస్తున్నాం.   
– నన్నపనేని సదాశివరావు, నాట్కో ట్రస్ట్‌ వైస్‌ చైర్మన్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top