
గౌతమికి వినతిపత్రం అందిస్తున్న లక్ష్మీనాయక్, మల్లిఖార్జున నాయక్
వారం తర్వాతే భవిష్యత్ కార్యాచరణ
సాక్షి, అమరావతి: వారం రోజులు సమయమిస్తే... ఏదో రకంగా సర్దుబాటు చేస్తామంటూ గిరిజన ఔట్‌సోర్సింగ్ టీచర్లను గిరిజన సంక్షేమ శాఖ అధికారులు సముదాయించారు. రాష్ట్రంలోని 191 గిరిజన గురుకులాల్లో డీఎస్సీ ద్వారా రెగ్యులర్ ఉపాధ్యాయులు సోమవారం విధుల్లోకి చేరడంతో ఆ పోస్టుల్లో ఇప్పటి వరకు పనిచేస్తున్న 1,143 మంది ఔట్‌సోర్సింగ్ టీచర్లు రోడ్డున పడ్డ విషయం తెలిసిందే. ఉద్యోగాలు లేకుండా తమ కుటుంబాలను రోడ్డున పడేయొద్దని ఇప్పటికే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి మొరపెట్టుకున్న టీచర్లు, మంగళవారం ఉన్నతాధికారులను కలిశారు.
గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎం నాయక్, గురుకులాల సంస్థ కార్యదర్శి గౌతమితో వేర్వేరుగా చర్చలు జరిపారు. గిరిజన ఔట్‌సోర్సింగ్ టీచర్ల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనాయక్, ప్రధాన కార్యదర్శి మల్లిఖార్జున నాయక్ నేతృత్వంలో 26 జిల్లాల ప్రతినిధి బృందం అధికారులతో గోడు వెళ్లబోసుకున్నారు. మంజూరైన పోస్టుల్లో రెగ్యులర్ ఉపాధ్యాయులు విధుల్లో చేరినందున ఔట్‌సోర్సింగ్ టీచర్లను ఎలా సర్దుబాటు చేయాలనేది ఆలోచిస్తున్నామని ఎంఎం నాయక్ తెలిపారు.
ఔట్‌సోర్సింగ్ పోస్టుల విషయంలో ఆర్థిక శాఖ అనుమతి తీసుకుంటామని, జీతాల పెంపు లేదు కాబట్టి అనుమతి సమస్య ఉండదంటూ వారిని సముదాయించారు. ఈ విషయంలో ప్రభుత్వానికి వారం వెసులుబాటు ఇస్తే సర్దుబాటుకు చర్యలు తీసుకుంటామని నాయక్ చెప్పినట్లు సమాచారం. దీనికి అంగీకరించిన ఔట్‌సోర్సింగ్ టీచర్లు బుధవారం తలపెట్టిన ఆందోళన కార్యాచరణ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు మంగళవారం ప్రకటించారు.