పక్షి ప్రేమికుల ప్రోత్సాహం, నీటి కుక్కల విహారం

Otters is a Rare mammals - Sakshi

ఉప్పలపాడు పక్షి కేంద్రంలో ప్రత్యక్షం 

దేశంలోని మూడు రకాల్లో ఇదొకటి 

ఈ కేంద్రానికి ఐబీఏ సైట్‌గా బాంబే నేచురల్‌ సొసైటీ గుర్తింపు 

అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఆట్టర్‌లు 

తెనాలి: సహజ సిద్ధంగా ఏర్పడే పక్షుల ఆవాసాలకు భిన్నమైనది ఉప్పలపాడు పక్షి కేంద్రం. ఇది ఇప్పుడో అరుదైన క్షీరద జాతికి ఆవాసమైంది. గుంటూరు జిల్లాలోని తెనాలి–గుంటూరు వయా నందివెలుగు రహదారి మార్గంలోని ఈ పక్షి కేంద్రంలో ఆట్టర్‌ (నీటి కుక్క)లు ఇప్పుడు విహరిస్తున్నాయి. పక్షి ప్రేమికుల ప్రోత్సాహం, గ్రామస్తుల సహకారం, ప్రభుత్వ తోడ్పాటుతో ఇక్కడి చెరువులో మూడు దశాబ్దాలుగా అభివృద్ధి చెందిన పక్షి కేంద్రమిది. ఇందులో నల్లతుమ్మ, ఇంగ్లిష్‌ తుమ్మ చెట్లు అరుదైన పక్షులకు ఆవాసం. కిక్కిరిసినట్టుండే ఈ పక్షి కేంద్రానికి సీజన్ల వారీగా 15–20 వేల పక్షులు వస్తుంటాయి. 

ఇతర చోట్లకు భిన్నంగా ఇక్కడ ఏడాది పొడవునా ఇవి కొనసాగుతుండటం మరో ప్రత్యేకత. వర్షాకాలం ఆరంభంలో నత్తగొట్టు కొంగలు (ఓపెన్‌ బిల్డ్‌ స్టార్క్‌), తెల్ల కొంకణాలు (వైట్‌ ఐబీస్‌) రాకతో సీజను మొదలు, గూడబాతు (స్పాట్‌ బిల్డ్‌ పెలికాన్‌), కలికి పిట్ట (డార్టర్‌), ఎర్రకాళ్ల కొంగ (పెయింటెడ్‌ స్టార్క్‌), శాంతి కొంగ (కాటిల్‌ ఇగ్రెంట్‌), చిన్న తెల్లకొంగ (లిటిల్‌ ఇగ్రెంట్‌), చింత వొక్కు (నైట్‌ హెరాన్‌), తట కంకణం (గ్లోజీ ఐబిస్‌) వంటి పక్షులు సహా 25 రకాలు వస్తుంటాయి. తెల్ల పెలికాన్‌ పక్షులు, శీతాకాలంలో కొన్ని విదేశీ వలస పక్షులూ వస్తుంటాయి. అటవీ శాఖ వీటికోసం కృత్రిమ గూళ్లను నిరి్మంచింది. సందర్శకులకూ తగిన ఏర్పాట్లుచేసింది. ఈ పక్షి కేంద్రాన్ని ఐబీఏ సైట్‌ (ఇంపార్టెంట్‌ బర్డ్‌ ఏరియా సైట్‌)గా బాంబే నేచురల్‌ సొసైటీ గుర్తించింది. కాగా, ఈ ఆట్టర్‌ల విహారం తమ దృష్టికి రావడంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వీటిని రికార్డు చేసినట్లు జిల్లా అటవీ అధికారి శివప్రసాద్‌ ‘సాక్షి’తో చెప్పారు.  

దేశంలో మూడు జాతులు 
ఆట్టర్‌ అనేది మాంసాహార క్షీరదం. ప్రపంచంలో 13 జాతుల ఆట్టర్‌లు ఉంటే, మనదేశంలో మూడు జాతులున్నాయి. ఉప్పలపాడు చెరువులో కనిపించిన స్మూత్‌ కోటెడ్‌ ఆట్టర్‌ వీటిలో ఒకటి. శరీరం మృదువుగా ఉంటుంది. హిమాలయాల దక్షిణ భాగం నుంచి దేశంలోకి విస్తరించినట్లు చెబుతారు. దీని శాస్త్రీయ నామం లూట్రజేల్‌ పెర్సిపిసిల్లేట్‌. ఒక మగ ఆట్టర్, నాలుగైదు ఆడ ఆట్టర్‌లు, వాటి పిల్లలతో సహా కుటుంబంగా జీవిస్తుంటాయి. పొలుసు చేపల (చేపల్ని తినే చేపలు)ను ఇవి ఎక్కువగా తింటాయి.

పక్షి గూళ్లలోంచి పడిపోయిన పిల్ల పక్షులు, మరికొన్ని జీవులు వీటి ఆహారం. ఆట్టర్‌లు చెరువును ప్రక్షాళన చేస్తాయని వైల్డ్‌లైఫ్, జీవవైవిధ్య పరిశోధనలో పలు జాతీయ అవార్డులు అందుకున్న డాక్టర్‌ తులసీరావ్‌ చెప్పారు. అటవీ భూములు తగ్గిపోవటం, కాలుష్యం, వేటగాళ్ల కారణంగా అంతరించిపోతున్న జంతు జాతుల్లో ఆట్టర్‌ కూడా ఒకటి. ఐక్యరాజ్య సమితి తరఫున ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ అండ్‌ నేచురల్‌ రిసోర్సెస్‌ (ఐయూసీఎన్‌) సంస్థ ప్రకటించిన రెడ్‌లిస్ట్‌లో దీనిని చేర్చారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top