ఒంగోలు ట్రిపుల్‌ ఐటీ పాయే! | Orders issued to cancel Rao and Naidu campus | Sakshi
Sakshi News home page

ఒంగోలు ట్రిపుల్‌ ఐటీ పాయే!

May 16 2025 4:38 AM | Updated on May 16 2025 4:53 PM

Orders issued to cancel Rao and Naidu campus

రావ్‌ అండ్‌ నాయుడు క్యాంపస్‌ ఎత్తివేస్తూ ఉత్తర్వులు

పట్టించుకోని జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ

ఆందోళన చెందుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు

వైఎస్సార్‌సీపీ హయాంలో ట్రిపుల్‌ ఐటీ కాలేజీ ఏర్పాటు 

స్థానిక విద్యార్థులకు అందుబాటులో ఉండడంతో మేలు

ఇప్పుడు తరలింపుతో 1,300 మందికి కష్టాలు

ఓవైపు కనిగిరి పరిసర ప్రాంతాల్లో ట్రిపుల్‌ ఐటీ కాలేజీని నిర్మిస్తామంటూ ఊదరగొడుతూనే.. మరోవైపు ఒంగోలులోని కళాశాలను గుట్టుచప్పుడు కాకుండా ఎత్తివేసింది కూటమి ప్రభుత్వం. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ జిల్లాలో ఉన్న సమయంలోనే వీటిని వెలువరించింది. దీంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఒంగోలు ట్రిపుల్‌ ఐటీ ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఇడుపులపాయలో కొనసాగనున్నారు. ఈ నిర్ణయంతో తమ పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.    – సాక్షి ప్రతినిధి, ఒంగోలు

» గతంలో ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ క్యాంపస్‌లో ఒంగోలు ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌ను నిర్వహించేవారు. అక్కడ స్థానిక విద్యార్థులు, ఒంగోలు క్యాంపస్‌ విద్యార్థుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఎంత ప్రయతి్నంచినా వారి మధ్య సయోధ్య కుదరకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఒంగోలులోని రావ్‌ అండ్‌ నాయుడు క్యాంపస్‌కు తరలించింది. నాటి విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ 2019 అక్టోబరు 2న దీనిని ప్రారంభించారు. 

» దాదాపు ఐదేళ్లుగా ఒంగోలులోని ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌ సజావుగా సాగుతోంది. ప్రస్తుతం 1,360 మంది విద్యార్థులున్నారు. పీయూసీ 1, పీయూసీ 2 వారు ఇడుపులపాయలోని ఒంగోలు క్యాంపస్‌లోనే చదువుతారు. పీయూసీ 2  పూర్తి చేసుకున్నవారు ఒంగోలుకు వస్తుంటారు. ఇప్పుడు దీనిని ఎత్తివేయడంతో ఇడుపులపాయలోనే ఒంగోలు క్యాంపస్‌ కొనసాగాల్సి ఉంటుంది.

»తాజా ఉత్తర్వుల ప్రకారం ఒంగోలు విద్యార్థుల్లో 1,100 మందిని నూజివీడుకు, వెయ్యి మందికిపైగా విద్యార్థులను ఇడుపులపాయ క్యాంపస్‌కు పంపుతారు. దీంతో ఘర్షణల సమస్య మళ్లీ మొదటికొస్తుందేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 

» ప్రభుత్వ నిర్ణయం పట్ల తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో  సంఘటనలను వారు గుర్తుచేస్తున్నారు. సర్కారు తీరు విద్యార్థుల మధ్య ఘర్షణలను ప్రోత్సహించినట్లుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రశాంతంగా చదవుకుంటున్నవారి భవిష్యత్తును దెబ్బతీయడం దుర్మార్గమని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం సమర్థనీయం కాదని, తక్షణమే తరలింపు ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

పట్టించుకోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు
» ఈ కాలేజీలో ప్రకాశం జిల్లా విద్యార్థులే ఎక్కువగా చదువుతున్నారు. జిల్లా కేంద్రం లోనే ఉండడంతో విద్యార్థులు, తల్లిదండ్రులకు ఎంతో సౌకర్యంగా ఉంటోంది. రవాణాకు అనుకూలంగా ఉన్న ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌ను ఎత్తివేస్తున్నా  జిల్లా మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలకు చీమకుట్టినట్లైనా లేదన్న విమర్శలు వస్తున్నాయి.  

» కేవలం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేశారన్న కారణంతోనే ఎమ్మెల్యేలు నిర్లక్ష్యధోరణి  ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా ఒంగోలు ట్రిపుల్‌ ఐటీ కాలేజీ ఎత్తివేయకుండా సీఎం మీద ప్రజాప్రతినిధులు ఒత్తిడి తేవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement