ఎర్రకాలువ జలాశయానికి మహర్దశ

Order for Modernization of Red Canal Project - Sakshi

ప్రాజెక్టు ఆధునికీకరణకు ఆదేశం 

రూ.75.80 కోట్లతో ప్రతిపాదనలు

జంగారెడ్డిగూడెం: సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటూ వారికి పెద్ద పీట వేస్తోంది. రైతుకు కావాల్సిన అన్ని రకాల సాగునీటి ప్రాజెక్టులను ఏర్పాటు చేయడమే కాకుండా పాత ప్రాజెక్టులకు మరమ్మతులు చేపట్టింది. ఇందులో భాగంగా జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం కేకేఎం ఎర్రకాలువ జలాశయం ఆధునికీకరణ పనులకు సంబంధించి ప్రతిపాదనలు చేయాలని ప్రభుత్వం ఉన్నతాధికారులను ఆదేశించింది.

గత టీడీపీ ప్రభుత్వంలో ఆధునికీకరణ పనులు అటుంచి కనీసం అవసరమైన మరమ్మతులు కూడా చేపట్టలేదు. ఎర్రకాలువ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 4.28 టీఎంసీలుగా నిర్ధేశించారు. ప్రాజెక్టు ఆక్రమణలకు గురికావడంతో 3.5 టీఎంసీలకు మించి నిల్వ చేయలేకపోతున్నారు. ఆధునికీకరణ పనుల మరమ్మతులకు తాజాగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే పనులు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

రూ. 75.80 కోట్లతో ప్రతిపాదనలు 
కేకేఎం ఎర్రకాలువ ప్రాజెక్టు ఆధునికీకరణ, మరమ్మతులకు జలవనరుల శాఖాధికారులు రూ.75.80 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. వీటిలో 2018లో తుఫాన్‌ వల్ల కొట్టుకుపోయిన ప్రధాన కాలువ రిటైనింగ్‌ వాల్, జనరేటర్లు, ఎర్త్‌డ్యామ్‌ పటిష్టం, నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ఎర్త్‌ డ్యామ్‌ రోడ్‌ ఏర్పాటు, భవనాల ఆధునికీకరణకు ప్రతిపాదించారు.  

ప్రతిపాదనలు  
ఎర్త్‌డ్యామ్, స్పిల్‌వే బలోపేతం చేయడానికి రూ.60 కోట్లతో ప్రతిపాదించారు.  
♦ ప్రాజెక్టు గేట్లు, సాంకేతిక పరికరాలు, మరమ్మతు పనులు, పునరుద్ధరణకు రూ. 43.20 లక్షలు 
♦ 2018లో వరద తాకిడికి కొట్టుకుపోయిన ప్రధాన కాలువ రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణానికి  రూ. 4.50 కోట్లు  
♦ ప్రాజెక్టు ఎర్త్‌డ్యామ్‌కు లోపలి భాగంలో కాంక్రీట్‌ వేసేందుకు రూ. 4.21 కోట్లు  
♦ ఎర్త్‌ డ్యామ్‌ మరమ్మతులకు రూ.1.39 కోట్లు 
 ♦ప్రాజెక్టుకు వరదల సమయంలో వరద ఉధృతిని ఎప్పటికప్పుడు తెలిపేందుకు రిమోట్‌ వాటర్‌ లెవల్‌ సెన్సార్‌లు అమర్చేందుకు రూ.50 లక్షలతో ప్రతిపాదించారు.  
♦ డ్యామ్‌ చుట్టూ జంగిల్‌ క్లియరెన్స్, గ్రావెల్‌ ఫిల్లింగ్‌ తదితర పనులకు రూ. 27లక్షలు, డ్యామ్‌కు యాక్సిస్‌ రోడ్డు నిర్మాణంలో భాగంగా సీసీ రోడ్డు నిరి్మంచేందుకు రూ.3 కోట్లు 
♦ ప్రస్తుతం ప్రాజెక్టు వద్ద ఉన్న భవనాల మరమ్మతులు, ఆధునీకరణకు      రూ.5 లక్షలతో ప్రతిపాదనలు  
 ♦ప్రాజెక్టు వద్ద కంట్రోల్‌రూమ్‌ నిర్మాణానికి రూ.20 లక్షలు, ఫెన్సింగ్‌ ఏర్పాటుకు రూ.30 లక్షలు డ్యామ్‌ పరిసర ప్రాంతంలో విద్యుదీకరణకు రూ.5 లక్షలు  
ప్రస్తుతం ఉన్న జనరేటర్‌కు అదనంగా స్టాండ్‌బైగా మరో 70 కేవీఏ జనరేటర్‌ ఏర్పాటుకు రూ.20 లక్షలు కేటాయించారు. అలాగే ఎర్రకాలువ ప్రాజెక్టు ఫోర్‌షోర్‌ ఏరియా ఆక్రమణలకు గురికావడంతో రీసర్వే చేసి ఆక్రమణలు తొలగించేందుకు రూ. 20 లక్షలతో అంచనా వేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top