ఉల్లి పంట చిది‘మేత’ | Onion Farmers Protest At Kurnool Market | Sakshi
Sakshi News home page

ఉల్లి పంట చిది‘మేత’

Aug 27 2025 5:24 AM | Updated on Aug 27 2025 5:24 AM

Onion Farmers Protest At Kurnool Market

ఆదిలోనే ధర లేక దిగాలు.. రికార్డు స్థాయిలో మార్కెట్‌కు వస్తున్న పంట

క్వింటా రూ.500కు మించి కొనని వ్యాపారులు.. కర్నూలు మార్కెట్‌లో ఉల్లి రైతులు గగ్గోలు 

గతేడాది మాదిరిగానే ఈ ఏడాదీ ధర లేని దుస్థితి.. గత్యంతరం లేక గొర్రెలకు మేతగా వేస్తున్న రైతులు  

వైఎస్‌ జగన్‌ హయాంలో రూ.3,500కు పైగా పలికిన ధర

ఈయన పేరు హకీన్‌ బాషా. ఉల్లి రైతు. ఊరు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం రాళ్లదొడ్డి. ఉన్న రెండున్నర ఎకరాల్లో ఆరుగాలం అష్టకష్టాలు పడి అప్పులు చేసి ఉల్లి సాగు చేశాడు. నూటికి రూ.2, 3 వడ్డీకి రూ.2.50లక్షలు అప్పు చేసి పెట్టుబడి పెట్టాడు. సీజన్‌ ప్రారంభంలో వర్షాభావానికి ఎదరొడ్డాడు. తీరా పంట చేతికొచ్చే సమయానికి అధిక వర్షాలు దిగుబడిని తీవ్రంగా దెబ్బతీశాయి. గడ్డకుళ్లు తెగులు ప్రభావంతో 60 నుంచి 70 క్వింటాళ్లకు మించి దిగుబడి రాని దుస్థితి. వచ్చిన పంటనైనా అమ్ముదామనుకుంటే కొనే నాథుడు కనిపించడం లేదు. నాణ్యమైన ఉల్లినే క్వింటా రూ.400 నుంచి 500కు మించి వ్యాపారులు కొనడం లేదు. దీంతో గత్యంతరం లేని స్థితిలో ఉల్లి పంటను కోయకుండానే ఇలా గొర్రెలకు మేతగా పెట్టి కన్నీటిపర్యంతమయ్యాడు.  

సాక్షి, అమరావతి/తాడేపల్లిగూడెం/ఎమ్మిగనూరు టౌన్‌/కర్నూలు(అగ్రికల్చర్‌): కూటమి ప్రభుత్వ పాలనలో ఉల్లి రైతులకు ఆదిలోనే  కష్టాలు మొదలయ్యాయి. వర్షాభావ పరిస్థితులకు తోడు అధిక వర్షాలు తీవ్రంగా దెబ్బతీయడంతోపాటు ధర లేక కర్షకులు విలవిల్లాడుతున్నారు. అయినా కూటమి సర్కారు పట్టించుకోవడం లేదు. క్వింటా కనీసం రూ.400–500కు మించి పలకకపోవడంతో ఏం చేయాలో పాలుపోక పంటను కోయకుండానే గొర్రెలకు మేతగా వదిలేస్తున్నారు.  

ఉల్లి విస్తీర్ణం లక్ష ఎకరాలు 
రాష్ట్రంలో ఉల్లి సాధారణ విస్తీర్ణం లక్ష ఎకరాలు. అత్యధికంగా కర్నూలు, వైఎస్సార్, అనంతపురం, విజయ నగరం జిల్లాల్లో సాగవుతుండగా, కర్నూలు జిల్లా ఉల్లికి జాతీయ స్థాయిలో మంచి డిమాండ్‌ ఉంది. కర్నూలు తర్వాత మైదుకూరులో సాగయ్యే కేపీ ఉల్లికి గిరాకీ ఎక్కువ. మూడు నెలల్లో చేతికొచ్చే పంటకు ఎకరాకు రూ.80వేల నుంచి రూ.లక్ష  వరకు పెట్టుబడి అవుతుంది. ఖరీఫ్‌లో 8 నుంచి 10 టన్నులు, రబీలో 10 నుంచి 20 టన్నుల వరకు దిగుబడులొస్తాయి.

కనీసం 3 నుంచి 6 నెలలు నిల్వ చేసే అవకాశం ఉన్నప్పటికీ నిల్వ చేసుకునే సదుపాయాల్లేక పంట చేతికిరాగానే రైతులు అయినకాడకి అమ్ముకోవల్సి వస్తోంది.  ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో మే నెలలో వేసిన పంట చేతికొచ్చే సమయంలో అధిక వర్షాలు తీవ్రంగా దెబ్బతీశాయి. గడ్డకుళ్లు తెగులు సోకడంతో దిగుబడులు పడిపోయాయి. దీంతో ఎకరాకు 50 నుంచి 70 క్వింటాళ్ల దిగుబడి రావడం గగనంగా మారింది. దీనికితోడు పంట నాణ్యత కూడా దెబ్బతింది. 

తేమ సాకుతో కొనని వ్యాపారులు  
కోతకొచి్చన పంట కర్నూలులోని ప్రధాన ఉల్లి మార్కెట్‌కు రావడం మొదలైంది. మార్కెట్‌కు వస్తున్న ఉల్లిని తేమ ఎక్కువగా ఉందని, నాణ్యత లేదనే సాకులతో కొనేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. దీంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. కర్నూలు మార్కెట్‌కు సోమవారం 12,,903 క్వింటాళ్ల పంట రాగా, మంగళవారం 8,391 క్వింటాళ్ల ఉల్లి వచ్చింది. సోమవారం 5 వేల క్వింటాళ్లు కొనుగోలు చేయగా, మంగళవారం కేవలం 1,500 క్వింటాళ్లు మాత్రమే వ్యాపారులు కొన్నారు.  కొనుగోలు చేసిన ఉల్లిలో సైతం 90 శాతానికిపైగా క్వింటా రూ.400–500కు మించి ధర  లభించలేదు.

సీజన్‌ ఆరంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే పంట పూర్తిగా మార్కెట్‌కు వచ్చే సెపె్టంబర్‌లో పరిస్థితి మరింత దిగజారిపోతుందేమోననే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. అధిక వర్షాలతో నాణ్యత దెబ్బతినడంతో పాటు మహారాష్ట్రలో పండిన పంట పెద్దఎత్తున ఉల్లి మార్కెట్‌కు రావడంతోపాటు కోల్‌కతాతో పాటు బంగ్లాదేశ్‌కు ఎగుమతులు లేక పోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

స్థానికంగా పండిన పంట దండిగా ఉండగా మహారాష్ట్ర ఉల్లి దిగుమతికి అధికారులు అనుమతివ్వడం వల్ల ఇక్కడి రైతులు దెబ్బతింటున్నారనే ఆవేదన వ్యక్తమవుతోంది. ప్రతికూల పరిస్థితులను చక్కదిద్ది ఉల్లికి మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అసలే పట్టించుకోవడం లేదు.  

తాడేపల్లిగూడెం మార్కెట్లోనూ అదే దుస్థితి  
తాడేపల్లి గూడెం మార్కెట్లోనూ కర్నూలు ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదు.  మంగళవారం కర్నూలు నుంచి కేవలం 15 లారీల సరుకు మాత్రమే మార్కెట్‌కు వచ్చింది.  మహారాష్ట్ర నుంచి దిగుమతైన ఉల్లి ముందు కర్నూలులో  పండించిన పంట నిలబడలేకపోతోందని వ్యాపారులు చెబుతున్నారు. ఇక్కడ అధిక వర్షాలకు గడ్డ కుళ్లు తెగులు వల్ల పంట నాణ్యత లేదని వ్యాపారులు చెబుతున్నారు.  

గతంలో ఉల్లి రైతుకు అండగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం
వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో ఉల్లి రైతులకు ఐదేళ్లూ అండగా నిలిచారు. 2019–24 మధ్య గరిష్టంగా క్వింటా రూ.3500 నుంచి రూ.4వేల మధ్య ధర లభించింది. దేశంలో మరెక్కడా లేని విధంగా క్వింటాకు రూ.770 కనీస మద్దతు ధరను గత ప్రభుత్వం ప్రకటించింది. ధర తగ్గిన సందర్భాల్లో మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ స్కీమ్‌ కింద జోక్యం చేసుకొని రైతులకు మద్దతు ధర దక్కేలా కృషి చేసింది.

ఈ విధంగా ఐదేళ్లలో రూ.64 కోట్ల విలువైన 9,025 టన్నుల ఉల్లిని రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొని రైతు బజార్ల ద్వారా వినియోగదారులకు విక్రయించింది. మరొక వైపు ధరలు పెరిగిన సందర్భాల్లో షోలాపూర్‌ మార్కెట్‌ నుంచి ఉల్లి కొనుగోలు చేసి సబ్సిడీపై రూ.50లకే సరఫరా చేసి వినియోగదారులపై భారం పడకుండా చూసింది.  

రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి
ఖరీఫ్‌లో మార్కెట్‌కు వచ్చే తొలి పంట ఉల్లి. అత్యధికంగా సాగ­య్యే కర్నూలు జిల్లాలో ఉల్లికి ధర లేకపోవడం ఆందోళనకరం. ఉల్లి­సాగు చేసేది చిన్న, సన్నకారు రైతులే. సాధారణంగా ఉల్లి మార్కెట్‌కు వచ్చే తొలినాళ్లలో మంచి ధర లభిస్తుంది. కానీ ఈసారి ఆ పరిస్థితి కని్పంచడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే ఎక్కువగా ఉల్లి మార్కెట్‌కు వచ్చేసెపె్టంబర్‌లో పరిస్థితి మరీ అధ్వానంగా మారుతుంది. మార్కెటింగ్‌ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్‌లో జోక్యం చేసుకొని ధర తగ్గకుండా చర్యలు తీసుకోవాలి – ఎంవీఎస్‌ నాగిరెడ్డి, మాజీ వైస్‌ చైర్మన్, ఏపీ వ్యవసాయ మిషన్‌ 

రూ.3.60 లక్షల నష్టం 
నేను 6 ఎకరాల్లో ఎకరాకు రూ.90­వేల పెట్టుబడితో ఉల్లి సాగు చేశా­ను. కోతకొచ్చే సమయంలో కురిసిన అధిక వర్షాలతో పంట భారీ­గా దెబ్బతింది. ఎకరాకు 50 క్వింటాళ్లకు మించి రాలేదు. నాణ్యత లేదనే సాకుతో ట్రేడర్స్‌ కొనేందుకు ముందుకు రావడం లేదు. కొద్దిగా నాణ్యత బాగున్న ఉల్లిగడ్డలను క్వింటా రూ.600కు అమ్ముకున్న. ఎకరాకు రూ.30వేల చొప్పున 6 ఎకరాలకు రూ.1.80 లక్షలు ఆదాయం వచ్చింది. కనీసం పెట్టుబడి కూడా దక్కకపోగా, రూ.3.60 లక్షల వరకు నష్టం వచ్చింది. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదు. – ముల్లా మొహిద్దీన్ , పేలకుర్తి, కర్నూలు జిల్లా 

కొనేవారు లేరు 
రెండున్నర ఎకరాలు.. ఎకరాకు రూ.లక్ష పె­ట్టు­బడి అయ్యింది. ఎక­రాకు 50 క్వింటాళ్ల అయ్యింది. క్వింటా రూ.500కు ఇద్దామ­న్నా ట్రేడర్స్‌ కొనేందుకు ముందుకు రావడం లేదు. 2023–24 సీజన్‌లో ఎకరాకు 70–100 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటా 3వేలకు పైగా ధర లభించింది. ఎకరాకు రూ.50వేలు మిగిలింది. కానీ ఈసారి 1.50 లక్షల వరకు నష్టపోతున్నాం. కోత కోసిన పంటను ఏం చేయాలో అర్ధం కావడం లేదు. మేకలు, గొర్రెలకు మేతకు వదిలేయడం తప్ప మరొక మార్గం కన్పించడం లేదు. – నారప్పగారి కృష్ణ, వల్లూకూరు, కర్నూలు జిల్లా 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement