
తెలుగు సంవత్సరాది ఉగాది నాడే దగాకు చంద్రబాబు శ్రీకారం
పరిపాలనలోనే కాదు.. సంక్షేమ పథకాల్లోనూ డైవర్షన్ పాలిటిక్స్
సూపర్ 6 నుంచి దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు పీ4 పథకం
వలంటీర్ల వేతనం రూ.10 వేలకు పెంచుతామని గత ఉగాది నాడు ప్రకటన
ఈ ఉగాదికి రాష్ట్ర ప్రజలందరి చెవిలో పువ్వులు పెడుతూ పేదరిక నిర్మూలన కార్యక్రమం
అందరూ ఏప్రిల్ 1న ఫూల్స్ చేస్తే.. ఉగాదిని ఎంచుకున్న చంద్రబాబు
ఒకవైపు సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చకుండా మరోవైపు జగన్ పథకాలన్నీ నిలిపివేసి బాబు పీ 4 పేరుతో కొత్త డ్రామాలు
రాష్ట్రానికి సొంత ఉపగ్రహం, అమరావతికి హైపర్ లూప్, ఒలింపిక్స్ ఆతిథ్యం తరహాలోనే ఇది కూడా..
మాట ఇస్తే నిలబెట్టుకోవాలని ఆరాటపడిన వైఎస్ జగన్.. గత సర్కారు చేసిన మంచిపై సర్వత్రా చర్చ
సాక్షి, అమరావతి: నాటి ఉగాది హామీ.. వలంటీర్లను కొనసాగించి వేతనం రూ.పది వేలు చేస్తాం! నేటి ఉగాది హామీ.. రాష్ట్రంలో పేదరికాన్ని సమూలంగా రూపుమాపుతా..!! సాధారణంగా అందరూ ఏప్రిల్ 1న ఫూల్స్ డే చేసుకుంటుంటారు..! సీఎం చంద్రబాబు మాత్రం అడ్వాన్స్‌గా తెలుగు సంవత్సరాది ఉగాది రోజు ఫూల్స్ చేశారు! సరిగ్గా ఏడాది క్రితం 2.66 లక్షల మంది వలంటీర్లను వంచించిన సీఎం చంద్రబాబు ఇప్పుడు ప్రజలందరినీ మభ్యపుచ్చేందుకు సిద్ధమయ్యారు! రాజకీయాల్లో తన డైవర్షన్ పాలిటిక్స్‌ను సంక్షేమ కార్యక్రమాలకూ వర్తింపజేస్తున్నారు.
నిజంగానే పేదరికాన్ని రూపుమాపాలంటే తాను హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను చంద్రబాబు అమలు చేయాలి. ఇప్పటికే ఉన్న సంక్షేమ పథకాలను యథాతథంగా కొనసాగించాలి. కానీ అవేమీ చేయకుండా బాధ్యత మరచి వ్యవహరిస్తున్నారు. పేదల జీవన ప్రమాణాలను పెంపొందిస్తూ గత ఐదేళ్లూ వైఎస్ జగన్ అమలు చేసిన పథకాలు, విప్లవాత్మక విధానాలను కక్షపూరితంగా నిలిపివేశారు. మరోపక్క విద్య, వైద్యం, వ్యవసాయం లాంటి మౌలిక రంగాలను నిర్విర్యం చేశారు. పేదలకు కూడు, గూడు, దుస్తులు సమకూర్చడం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత.
దీన్ని పూర్తిగా విస్మరించిన చంద్రబాబు హామీల అమలు బాధ్యత నుంచి తప్పుకుని పీ 4 పథకం పేరుతో మరో కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చారు. చంద్రబాబు ఎన్నడూ మాటపై నిలబడిన దాఖలాలు లేవని.. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నైజం ఉన్న ఆయన్ను ఎలా నమ్మాలనే చర్చ సర్వత్రా జరుగుతోంది. దీనికి భిన్నంగా వైఎస్ జగన్ అధికారంలో ఉండగా ప్రతి మాట నెరవేర్చారని.. హామీల అమలుకు మొదటి రోజు నుంచే ఆరాట పడ్డారని.. డీబీటీ ద్వారా నేరుగా రూ.2.73 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో పారదర్శకంగా జమ చేశారని గుర్తు చేసుకుంటున్నారు.
బాధ్యతల నుంచి పరార్...
ఎన్నికల ముందు జనసేన–బీజేపీతో కూటమి కట్టిన చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తామని నమ్మబలికారు. ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, ఉచిత బస్సు అంటూ మహిళలను, అన్నదాతా సుఖీభవ పేరిట రైతులను, నిరుద్యోగ భృతి ఇస్తామని యువతకు మోసపూరిత వాగ్దానాలు చేశారు. అధికారంలోకి వచ్చాక హామీలను అమలు చేయకుండా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు పీ–4 పేరుతో మరో నాటకానికి తెరతీశారు.
అన్నీ తెలిసే మోసపూరిత వాగ్దానాలు
గతంలో మూడుసార్లు సీఎంగా, ఉమ్మడి రాష్ట్రంలో ఆరి్థక మంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాలుగోసారి అధికారంలోకి వచ్చేందుకు నోటికొచ్చిన వాగ్దానాలు ఇచ్చేశారు. తీరా ప్రభుత్వం ఏర్పాటయ్యాక తానిచ్చిన హామీలను చూస్తుంటే భయం వేస్తోందని, సంపద సృష్టికి మార్గాలుంటే తన చెవిలో చెప్పాలంటూ నిజ స్వరూపాన్ని చాటుకుంటున్నారు. ఎన్నికల ముందు హామీలివ్వడం.. గెలిచాక తిలోదకాలు ఇవ్వడం చంద్రబాబుకు మొదటినుంచి వెన్నతో పెట్టిన విద్య. గతంలో రైతు రుణ మాఫీ వ్యవహారమే దీనికి మచ్చు తునక. వీటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు తెరపైకి కొత్త కార్యక్రమాలు తేవడం ఆయనకు ఆలవాటే.
ఇచ్చిన ప్రతి మాటా నెరవేర్చిన జగన్..
చంద్రబాబు ప్రభుత్వం పది నెలల పాలన పూర్తి చేసుకుంది. ఈ సర్కారుకు మరో నాలుగేళ్ల సమయమే మిగిలి ఉంది. అలాంటప్పుడు పీ–4తో 2029 నాటికి పేదరిక నిర్మూలన చేస్తానంటూ చంద్రబాబు ప్రకటించడం విడ్డూరంగా ఉందని సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు చంద్రబాబు తాను ఇస్తానని చెప్పినవి ఇవ్వకపోగా.. గతంలో వైఎస్ జగన్ ఇచ్చినవీ ఎగ్గొడుతున్నారని మండిపడుతున్నారు. వైఎస్ జగన్ అధికారంలో ఉండగా ప్రతి మాట నెరవేర్చారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. డీబీటీ ద్వారా నేరుగా రూ.2.73 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో పారదర్శకంగా జమ చేశారని గుర్తు చేస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్ మాదిరిగా భావించి హామీల అమలుకు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే నడుం బిగించారని పేర్కొంటున్నారు.

రాష్ట్రానికి సొంత ఉపగ్రహం.. అమరావతిలో ఒలింపిక్స్..
రాజధానికి హైపర్ లూప్.. ఎండలు 2 డిగ్రీలు తగ్గింపు
‘‘సాధ్యాసాధ్యాలతో పనిలేదు..! నమ్మశక్యం కాని విషయాలను నమ్మించేలా చెప్పడం..! వినేవాడుంటే చాలు.. చెప్పేవాడు చంద్రబాబు...!’’ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్ట్ ఇదీ!! పీ–4 అంటూ ముఖ్యమంత్రి తెరపైకి తెచ్చిన కార్యక్రమం నేపథ్యంలో ఇలా ఎద్దేవా చేస్తున్నారు. ఏపీకి సొంతంగా ఉపగ్రహం..! అవసరమైతే రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాలకు ఉపగ్రహాలు..! అని ఇటీవల కలెక్టర్ల సదస్సులో ప్రకటించడాన్ని గుర్తు చేస్తున్నారు. వేల కిలోమీటర్ల దూరాన్ని నిమిషాల వ్యవధిలో ప్రయాణించే హైపర్ లూప్‌ను అమరావతికి తెస్తానంటూ గతంలో చంద్రబాబు ప్రకటించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.
దాదాపు 10,500 మందికిపైగా క్రీడాకారులు, రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చయ్యే ఒలింపిక్స్‌ను అమరావతిలో నిర్వహిస్తామని ప్రకటనలు చేయడం.. అమరావతిలో ఎండలు రెండు డిగ్రీలు తగ్గించాలి.. నోబెల్ బహుమతి సాధించేందుకు సులభమైన మార్గం చెప్పాలనడం.. ఎవరైనా దాన్ని సాధిస్తే రూ.వంద కోట్లు ఇస్తానని జపాన్‌కు చెందిన నోబెల్ బహుమతి గ్రహీత సమక్షంలోనే చంద్రబాబు వ్యాఖ్యలు చేయటంపై చర్చ జరుగుతోంది.
హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దింది తానేనని, సత్య నాదెళ్ల తనవల్లే మైక్రోసాఫ్ట్ సీఈవో అయ్యారని చంద్రబాబు తరచూ గొప్పలకు పోవడాన్ని ఎద్దేవా చేస్తున్నారు. ట్రాఫిక్ నుంచి శాంతి భద్రతల పరిరక్షణ వరకు నిరంతరం ప్రజలతో గడిపే పోలీస్‌లు ఇంటి నుంచి విధులు నిర్వహించేలా (వర్క్ ఫ్రం హోం) చర్యలు తీసుకుంటానని చెప్పటాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
నిబద్ధతతో నవరత్నాలు..
సంక్షోభంలోనూ సజావుగా పథకాలు..
పేదరిక నిర్మూలనే ధ్యేయంగా నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం నవరత్నాలను అమలు చేసింది. తొలి కేబినెట్ (10–6–2019) సమావేశంలోనే వైఎస్ జగన్ నవరత్నాలకు ఆమోదం తెలిపి నిబద్ధత చాటుకున్నారు. ఏటా సంక్షేమ క్యాలెండర్‌ను ముందుగానే ప్రకటించడమే కాకుండా కులం, మతం, ప్రాంతం, రాజకీయ పార్టీ అని తేడా చూపకుండా ప్రతి ఇంటికీ వలంటీర్లను పంపి సంక్షేమ పథకాలను అందజేసిన ఘనత వైఎస్ జగన్‌దే. క్యాలెండర్‌లో ప్రకటించిన తేదీల ప్రకారం నేరుగా నగదును బదిలీ చేశారు.
⇒ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి ఖజానాలో కేవలం రూ.100 కోట్లే ఉన్నాయని, నవరత్నాలు ఎలా అమలు చేస్తారంటూ నాడు ఎల్లో మీడియా కథనాలను అచ్చు వేసింది. అయితే కోవిడ్ సంక్షోభంలో కూడా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాలను ఆపలేదు. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చి 10 నెలలైనా సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా కాలక్షేప సమీక్షలు నిర్వహిస్తున్నారు. పైగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టే నాటికి ఖజానాలో రూ.6 వేల కోట్లు ఉన్నాయి.
అయినప్పటికీ హామీలను నెరవేర్చకుండా పబ్లిక్–ప్రైవేట్–పీపుల్ భాగస్వామ్యం కింద పీ–4 పేరుతో పేదరిక నిర్మూలన కార్యక్రమాలను అమలు చేస్తానంటూ సంక్షేమ బాధ్యతల నుంచి పూర్తిగా తప్పించుకుంటున్నారు.