Navy Day 2021: దేశం గర్వించతగ్గ ఘటన.. ఆ చిరస్మరణీయ విజయానికి విశాఖ వేదికైంది..

Navy Day 2021: History And Interesting Facts In Telugu Visakhapatnam - Sakshi

పాకిస్తాన్‌.. దాయాది దేశం పేరు వింటనే పౌరుషం పొంగుకొస్తుంది. అలాంటి శత్రుదేశంతో యుద్ధం జరిగితే.. ఆ యుద్ధంలో మన త్రివర్ణపతాకం రెపరెపలాడితే.. ఆ చిరస్మరణీయ విజయానికి మన విశాఖే వేదికైతే.. ఇంకెంత గర్వంగా ఉంటుందో కదా. ఈ విజయానికి గుర్తుగా ఏటా డిసెంబర్‌ నాలుగో తేదీన భారత నౌకాదళ దినోత్సవం  నిర్వహిస్తారు. జాతి గర్వించదగిన గెలుపునకు గుర్తుగా బీచ్‌రోడ్‌లో ‘విక్టరీ ఆఫ్‌ సీ’ స్థూపం నిర్మించారు. భారత నౌకాదళం ప్రపంచంలోనే అతి పెద్ద దళాల్లో ఒకటిగా సమర్థమైన నౌకాదళ  శక్తిగా మారగా.. దేశంలోనే ప్రధాన కేంద్రంగా తూర్పు నౌకాదళం అభివృద్ధి చెందింది. నౌకాదళ దినోత్సవం నిర్వహించుకోడానికీ కేంద్ర బిందువు కూడా విశాఖపట్నం కావడం మరో విశేషం. 

సాక్షి, విశాఖపట్నం: దేశానికి తూర్పు తీరం వ్యూహాత్మక రక్షణ ప్రాంతం. సహజ సిద్ధమైన భౌగోళిక రక్షణతో పాటు శత్రుదేశాలకు సుదూరంగా ఉండటం తూర్పు నౌకాదళం ప్రత్యేకత. అందుకే రక్షణఅవసరాల దృష్ట్యా బ్రిటిష్‌ పాలకులు ఈ ప్రాంతాన్ని కీలకంగా భావించారు. ఇందులో భాగంగానే తూర్పు నావికా దళం ఏర్పాటైంది. 1923 డిసెంబర్‌లో విశాఖను తూర్పు తీరంలో వ్యూహాత్మక కేంద్రంగా గుర్తించారు. రెండో ప్రపంచ యుద్ధ కాలమైన 1942–45 మధ్య కాలంలో విశాఖ తీరాన్ని ప్రధానంగా వినియోగించుకున్నారు. ఇక్కడి నుంచే బర్మాకు ఆయుధాలను రవాణా చేశారు.

స్వాతంత్య్రానంతరం 1954లో విశాఖ నేవీ పోస్ట్‌ను కమాండర్‌ హోదాకు పెంచుతూ, బేస్‌ రిపేర్‌ ఆర్గనైజేషన్‌ కార్యకలాపాలను ప్రారంభించారు. 1962లో ఇండియన్‌ నేవీ హాస్పిటల్‌ సర్వీసెస్‌ (ఐఎన్‌హెచ్‌ఎస్‌) కల్యాణి ప్రారంభమైంది. అనంతరం 1967 జూలై 24న కమాండర్‌ హోదాను రియర్‌ అడ్మిరల్‌ హోదాకు అప్‌గ్రేడ్‌ చేయడంతో పాటు తూర్పు తీరంలో ఫ్లాగ్‌ ఆఫీసర్స్‌ పోస్టులను కూడా మంజూరు చేశారు. చివరిగా 1968 మార్చి 1న విశాఖ ప్రధాన కేంద్రంగా తూర్పు నౌకాదళం( ఈఎన్‌సీ ) కార్యకలాపాలు ప్రారంభమై చరిత్రకు శ్రీకారం చుట్టింది. 1971 మార్చి1న ఈఎన్‌సీ చీఫ్‌గా వైస్‌ అడ్మిరల్‌ నియామక శకం మొదలైంది. క్రమక్రమంగా ఈఎన్‌సీ విస్తరించింది.1971 నవంబర్‌ 1 నుంచి ఈఎన్‌సీ ఫ్లీట్‌ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. తొలి ఈఎన్‌సీ చీఫ్‌గా రియర్‌ అడ్మిరల్‌ కేఆర్‌ నాయర్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం 29వ చీఫ్‌గా వైస్‌ అడ్మిరల్‌ బిస్వజిత్‌దాస్‌ గుప్తా ఇటీవల బాధ్యతలు స్వీకరించారు.  

రక్షణలో వెన్నెముక 
మయన్మార్‌లోని కొండ ప్రాంతం మినహా దక్షిణ హిందూ మహా సముద్రం వరకూ ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌ పరిధిలో సురక్షితంగా ఉంది. ఉత్తరాన సుందర్‌బన్‌ నుంచి దక్షిణాన గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ వరకూ విస్తరించి ఉంది.  2,600 కి.మీ నిడివి కలిగిన తూర్పు తీరంలో 30 శాతం అంటే 6 లక్షల చ.కిమీ పరిధిలో ఎక్స్‌క్లూజివ్‌ ఎకనమిక్‌ జోన్‌ విస్తరించి ఉంది. ఈ తీరంలో 13 మేజర్‌ పోర్టులున్నాయి. భారత సర్కారు లుక్‌ ఈస్ట్‌ పాలసీ ప్రవేశపెట్టిన తర్వాత సముద్ర వాణిజ్యానికి తూర్పు తీరం ప్రధాన కేంద్రంగా మారడంతో వాణిజ్య నౌకల రక్షణ బాధ్యత కూడా తూర్పు నౌకాదళమే నిర్వర్తిస్తోంది. దీంతో పాటు డీఆర్‌డీవో కార్యకలాపాలకు కూడా తూర్పు తీరమే వేదికగా మారింది. పలు క్షిపణులు తయారు చేసే నేవల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజికల్‌ లేబొరేటరీస్‌ (ఎన్‌ఎస్‌టీఎల్‌) కూడా విశాఖలోనే ఏర్పాటైంది.  

డిసెంబర్‌ 4 విజయానికి నాంది  
ఘాజీ కాలగర్భంలో కలిసిపోవడంతో బంగాళఖాతంలోని జలప్రాంతాలన్నీ ఇండియన్‌ నేవీ.. తన ఆధీనంలోకి తెచ్చుకుంది. భారత్‌ ముప్పేట దాడితో పాకిస్తాన్‌ తలవంచక తప్పలేదు. డిసెంబర్‌ 16న పాకిస్తాన్‌ లొంగిపోతున్నట్లు ప్రకటించడంతో భారత్‌ కాల్పుల విరమణ ప్రకటించింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అతి పెద్ద సైనిక లొంగుబాటు జరిగిన యుద్ధమిదే.ఈ యుద్ధం తర్వాత బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం లభించింది. డిసెంబర్‌ 16న యుద్ధం ముగిసినా దానికి కారణం డిసెంబర్‌ 4న అతిపెద్ద పాకిస్తానీ నౌకాశ్రయం కరాచీపై చేసిన మెరుపుదాడేనని చెప్పుకోవచ్చు. అందుకే 1971 యుద్ధంలో మన నౌకాదళం ప్రదర్శించిన సాంకేతిక ప్రతిభా పాటవాలు, వ్యూహాలు, ధైర్య సాహసాలకు గుర్తుగా డిసెంబర్‌ నాలుగో తేదీన భారత నౌకాదళ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.  

తీర ప్రాంత రక్షణలో వెన్నెముకగా ఉన్న ఈఎన్‌సీ స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన నౌకలతో పాటు విదేశాల నుంచి కొనుగోలు చేసిన యుద్ధ నౌకలతో ఇండియన్‌ నేవీ ఎప్పటికప్పుడు నౌకా సంపత్తిని పెంచుకుంటూ శత్రుదుర్భేద్యంగా మారుతోంది. తూర్పు నౌకాదళం పరిధిలో 52 వరకు యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్‌లు, హెలికాఫ్టర్లు, యుద్ధ విమానాలున్నాయి. యుద్ధ నౌకల పనితీరు, పరిజ్ఞానం బట్టి వాటిని వివిధ తరగతులుగా విభజించారు. అదే విధంగా సబ్‌మెరైన్లను కూడా వాటి సామర్థ్యం, పనితీరు బట్టి వివిధ తరగతులుగా విభజించారు.

భారత నౌకాదళంలో ఉన్న షిప్స్‌ పేర్లన్నీ ఐఎన్‌ఎస్‌తో మొదలవుతాయి. ఐఎన్‌ఎస్‌ అంటే ఇండియన్‌ నేవల్‌ షిప్‌. యుద్ధ నౌకల్లో ఐఎన్‌ఎస్‌ ఢిల్లీ క్లాస్, రాజ్‌పుత్, గోదావరి, తల్వార్, కోల్‌కతా, శివాలిక్, బ్రహ్మపుత్ర, ఆస్టిన్, శార్దూల్, దీపక్, మగర్, కుంభీర్, కమోర్తా, కోరా, ఖుక్రీ, అభ్య, వీర్, పాండిచ్ఛేరి, అస్త్రధరణి, సరయు, సుకన్య, కార్‌ నికోబార్, బంగారం, త్రికర్ట్‌.. ఇలా విభిన్న తరగతుల యుద్ధ నౌకలున్నాయి. సబ్‌మెరైన్‌ల విషయానికొస్తే.. న్యూక్లియర్‌ పవర్డ్‌ సబ్‌మెరైన్‌లను అరిహంత్, చక్ర(అకుళ–2) క్లాస్‌లుగా, కన్వెన్షనల్లీ పవర్డ్‌ సబ్‌మెరైన్‌లను సింధుఘోష్, శిశుమార్‌ క్లాస్‌ సబ్‌మెరైన్లుగా విభజించారు. ఇటీవల ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం యుద్ధ నౌకతో పాటు పలు హెలికాఫ్టర్లు, అడ్వాన్స్‌డ్‌ యుద్ధ విమానాల రాకతో ఈఎన్‌సీ బలం మరింత పెరిగింది. 

సాయుధ సంపత్తికి కీలకం.. రజాలీ 
ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌కు అత్యంత వ్యూహాత్మక, కీలకమైన ఎయిర్‌స్టేషన్‌ రజాలీ. ఇది తమిళనాడులోని అరక్కోణం జిల్లాలో ఉంది. ఇది ఈఎన్‌సీకే కాదు.. భారత నౌకాదళానికీ కీలకమైన ఎయిర్‌స్టేషన్‌. 2,320 ఎకరాల విస్తీర్ణంలో అతి పొడవైన, వెడల్పైన రన్‌వే కలిగిన రజాలీ.. ఆసియాలోనే అతి పెద్ద ఎయిర్‌స్టేషన్‌గా గుర్తింపు పొందింది. తూర్పు, దక్షిణ తీరాల మధ్యలో భూ ఉపరితల, సముద్ర మార్గాల ద్వారా దాడి చేసేందుకు వచ్చే శత్రుదేశాల తుదిముట్టేంచేందుకు కావల్సిన ఆయుధ సంపత్తి అంతా రజాలీలోనే నిక్షిప్తమై ఉంది. 1985లో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఆధీనంలోకి ఈ ఎయిర్‌స్టేషన్‌ వచ్చింది. ఆ తర్వాత భారత నౌకాదళం రజాలీని వ్యూహాత్మక ఎయిర్‌స్టేషన్‌గా తీర్చిదిద్దింది. 1992 మార్చి 11న అప్పటి రాష్ట్రపతి వెంకటరామన్‌ ఈ ఎయిర్‌ స్టేషన్‌ను జాతికి అంకితం చేశారు. ఈఎన్‌సీకి చెందిన స్థావరాలు మొత్తం 15 ఉండగా.. ఇందులో ఏడు నేవల్‌ బేస్‌లు విశాఖలోనే ఉన్నాయి. నేవల్‌ బేస్‌ ఐఎన్‌ఎస్‌ వర్ష రాంబిల్లిలో నిర్మితమవుతోంది. 

నౌకాదళానికి, ప్రజలకు వారధి.. నేవీడే 
తూర్పు నౌకాదళం అత్యంత ప్రధానమైన కమాండ్‌. దేశ రక్షణలో అశువులు బాసిన నావికులు చేసిన సేవలు శ్లాఘనీయం. లుక్‌ ఈస్ట్, టేక్‌ ఈస్ట్‌ విధానాలతో తూర్పు నౌకాదళానికి ప్రాధాన్యం పెరిగింది. మిషన్‌ డిప్లాయ్స్‌ ఆపరేషన్స్‌ అనే విధానాన్ని ప్రస్తుతం నేవీ అనుసరిస్తోంది. ఈ విధానం వల్ల అనుకున్న సమయానికి అనుకున్న ప్రదేశంలో అందుబాటులో సిబ్బంది ఉండగలుగుతున్నారు. హెలికాఫ్టర్లు, యుద్ధ నౌకల ద్వారా దాయాదిదేశాలకు చెందిన వాటిని గుర్తించి ఎదుర్కొనేందుకు నిత్యం పహారా కాస్తున్నాం. ఒకవేళ అలాంటివి ఎదురైనా.. వాటిని తిప్పికొట్టేందుకు సమర్థంగా ఉన్నాం. కోవిడ్‌ కారణంగా ఈ ఏడాది కూడా విన్యాసాలు చేపట్టలేకపోతున్నాం. 
– వైస్‌ అడ్మిరల్‌ బిస్వజిత్‌దాస్‌ గుప్తా, తూర్పు నౌకా దళాధిపతి 

చదవండి: మిలాన్‌ మెరుపులు..46 దేశాలకు ఆహ్వానం!

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top