ఏపీలో తగ్గుతున్న పొగరాయుళ్లు

National Family Health Survey Smoking Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్‌.. అని అన్నాడొకరు. సరదా.. సరదా.. సిగరెట్టు అంటూ ఓ సినిమాలో కేరక్టర్‌ చిందులేసింది. ఈ మాటలన్నీ వద్దులే.. ఆరోగ్యమే మహాభాగ్యం అంటున్నారు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు. ఆరోగ్యంపై అవగాహన పెంచుకుంటున్నారు. పొగ తాగితే వచ్చే రోగాల గురించి ఆలోచన పెరిగింది. దీంతో పొగ తాగే వారి సంఖ్య రాష్ట్రంలో క్రమంగా తగ్గిపోతోంది. 2019–21 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది.

చదవండి: (గంజి ప్రసాద్ హత్య కేసులో కీలక పరిణామం)

రాష్ట్రం మొత్తం మీద 2016–17తో పోల్చితే 2019–21లో పొగ తాగేవారి సంఖ్య 4.2 శాతం తగ్గినట్లు సర్వే తెలిపింది. పట్టణాల్లో 3.9 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 4.9 శాతం పొగరాయుళ్ల  సంఖ్య తగ్గినట్లు పేర్కొంది. ఇక రోజూ ఇంటి దగ్గర పొగతాగే వారు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో  2016–17లో 28.5 శాతం ఉండగా 2019–21లో 22.1 శాతానికి తగ్గారు. అసలు పొగతాగని వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. 2016–17లో అసలు పొగతాగని వారు 65.4 శాతం ఉండగా 2019–21లో 71.9 శాతానికి పెరిగింది.

పొగతాగే వారిలో 15 సంవత్సరాల నుంచి 49 సంవత్సరాల వయసు వారు ఎక్కువగా ఉన్నారు.  పొగాకు వినియోగమూ తగ్గుతోంది. పొగతాగే వారిలో ఎక్కువ మంది 24 గంటల్లో ఐదు సిగరెట్లు కాల్చుతున్నట్లు సర్వేలో తేలింది. బీడీ తాగే వారిలో 24 గంటల్లో 10 నుంచి 14 బీడీలు తాగుతున్నట్లు వెల్లడైంది. రాష్ట్రం మొత్తం మీద పొగతాగే వారి సంఖ్య క్రమంగా తగ్గడానికి ఆరోగ్యం పట్ల అవగాహనతో పాటు పెళ్లి అయిన తరువాత పిల్లలు పుట్టాక స్మోకింగ్‌కు దూరం అవుతున్నట్లు తేలింది. ఇటీవలి కాలంలో యువత కూడా పొగాకు వినియోగానికి దూరంగా ఉంటోందని అధికారవర్గాలు తెలిపాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top