క్రికెట్ బుకీలకు అడ్డాగా మారిన నరసరావుపేట
ఇతర రాష్ట్రాలలో సైతం 30 మంది కార్యకలాపాలు
ఇటీవల గోల్డ్ శేఖర్ అనే బుకీని అరెస్ట్ చేసిన ప్రకాశం పోలీసులు
గోవా, శ్రీలంకలకు మకాం మార్చిన ఇతర బుకీలు
ఇంత జరుగుతున్నా పట్టించుకోని పోలీసులు
ఖాకీల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జిల్లా వాసులు
సాక్షి, నరసరావుపేట: దాదాపు 30 మందికిపైగా క్రికెట్ బుకీలు నరసరావుపేట పట్టణంలోనే ఉన్నారని సమాచారం. పల్నాడు జిల్లాతో పాటు మూడు, నాలుగు రాష్ట్రాలలో నరసరావుపేటకు చెందిన బుకీలు క్రికెట్ పందేలు నిర్వహిస్తుంటారు. ఇంత జరుగుతున్నా పల్నాడు పోలీసులు వారిపై గట్టిగా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇప్పటికే కొందరు బుకీలపై రౌడీషీట్లు తెరిచారు. అయినా వారిలో మార్పు రాకపోగా మరింతగా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. పోలీసులు మాత్రం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. వీరి వలలో పడి బెట్టింగ్ ఆడుతున్న యువత అర్ధంతరంగా జీవితాలనే ముగిస్తున్నారు.
అరెస్ట్ చేసినా పరార్
నరసరావుపేటకు చెందిన క్రికెట్ బుకీ గోల్డ్ శేఖర్‌ను ప్రకాశం జిల్లా దర్శి పోలీసులు గత వారం అరెస్ట్ చేశారు. గోల్డ్ శేఖర్ కమ్యూనికేషన్ టెక్నాలజీతో బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. మూడు కమ్యూనికేటర్ బాక్సులు, రెండు ల్యాప్‌టాప్‌లు, 21 మొబైల్ ఫోన్లు, రూ.24 లక్షల నగదు స్వా«దీనం చేసుకున్నారు. గోల్డ్ శేఖర్ ఇచ్చిన సమాచారంతో నరసరావుపేట ఇస్లాంపేటకు చెందిన మరో బుకీని ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.
వారి లిస్ట్‌లో మరో పది మంది వరకు ఉన్నట్టు తెలియడంతో సదరు బుకీలు మొబైల్ ఫోన్లు స్విచ్‌ఆఫ్ చేసుకొని గోవా, శ్రీలంకలకు పారిపోయినట్టు సమాచారం. ఓవైపు ప్రకాశం పోలీసులు నరసరావుపేటకు చెందిన క్రికెట్ బుకీల విషయంలో ఇంత చేస్తూంటే పల్నాడు జిల్లా పోలీసులు మాత్రం ఎందుకు మౌనంగా ఉంటున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నరసరావుపేట అడ్డాగా క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నా ఎందుకు స్థానిక పోలీసులు అరెస్ట్ చేయలేకపోయారని విమర్శలొస్తున్నాయి. బుకీలు ఇస్తున్న మామూళ్లతో కొందరు పోలీసులు బెట్టింగ్ దందాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న వాదనలు చాలా బలంగా వినిపిస్తున్నాయి.
రానున్న ఐపీఎల్ సీజన్‌తో ...
బెట్టింగ్ జడలు విప్పి కుటుంబాలను రోడ్డుపాలు చేస్తున్నా దీనిని అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారు. నరసరావుపేటతో పాటు మారుమూల గ్రామాల్లో సైతం బెట్టింగ్ చాపకింద నీరులా విస్తరించింది. ఇటీవల జరిగిన వరల్డ్ టీ20 ప్రపంచకప్‌లో ప్రతి మ్యాచ్‌కు జిల్లా వ్యాప్తంగా రూ.కోట్ల చేతులు మారాయి.
ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ విధానంలో ఈ బెట్టింగ్ జరుగుతోంది. అవగాహన సదస్సులు పెట్టి, ప్రెస్‌నోట్లు ఇచ్చి పోలీసులు చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలున్నాయి. ఈ నెల 28వ తేదీ నుంచి ఐపీఎల్ మొదలు కానున్న నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం క్రికెట్ బెట్టింగ్ నిర్మూలనపై క్షేత్రస్థాయిలో మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
నిండు ప్రాణాలు బలి
» క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని గతేడాది ఏప్రిల్ 21న అచ్చంపేట మండలానికి చెందిన 19 ఏళ్ల యువకుడు ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వారం రోజుల పాటు గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొంది మరణించాడు. వృద్ధాప్యం వెంబడిస్తున్నా జీవనం కోసం తనకు అబ్బిన టైలర్ వృత్తిని చేసుకుంటున్న ఆ యువకుడి తండ్రికి బెట్టింగ్ భూతం రూపంలో కోలుకోలేని దెబ్బ తగిలింది.
» బాపట్ల జిల్లా బల్లికురవ మండలానికి చెందిన ఓ యువకుడు నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద లాడ్జిలో గతేడాది ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసిన ఆ యువకుడు తొలుత పని ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని వచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులకు అసలు విషయం బహిర్గతమైంది.
క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు నష్టపోయానని, సమయం ఇస్తే డబ్బులు తిరిగి చెల్లిస్తానని ప్రాథేయపడుతూ కొంతమందికి అతడు సందేశాలు పంపినట్లు గుర్తించారు. ఆర్థికంగా నష్టపోయి బలవన్మరణానికి పాల్పడినట్టు తేలింది. ‡ఇలా ఎందరో బెట్టింగ్ భూతానికి బలైపోతున్నారు. వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.


