అమ్మా భయపడొద్దు.. వచ్చేస్తున్నాం.

Nandyal Student phoned his parents and told them to be brave - Sakshi

నంద్యాల/వెల్దుర్తి: ‘ఉక్రెయిన్‌ నుంచి సరిహద్దు దేశమైన రొమేనియాకు బుధవారం చేరుకున్నాను. మీరేమీ భయపడొద్దు’ అంటూ కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన విద్యార్థి జైన్‌ తేజ తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి ధైర్యం చెప్పాడు. ‘యుద్ధం మొదలవుతుందని తెలిసిన వెంటనే ఫ్లైట్‌ బుక్‌ చేసుకున్నా. కానీ ఫ్లైట్‌లు బంద్‌ అయ్యాయి. దీంతో చాలా ఇబ్బందులు పడ్డాను. బాంబుల శబ్దాల మధ్య నాలుగు రోజులు బిక్కుబిక్కుమంటూ గడిపాం.

ఉక్రెయిన్‌ నుంచి రొమేనియాకు రావడానికి మన అధికారులు బాగా సహకరించారు. ప్రస్తుతానికి నేను క్షేమంగా ఉన్నాను. త్వరలో ఇంటికి వస్తాను’ అని తెలిపాడు. కాగా, కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోటకు చెందిన మనోహర్‌ నాయుడు మంగళవారం రాత్రి ఉక్రెయిన్‌ బోర్డర్‌ దాటి పోలండ్‌లో అడుగుపెట్టినట్లు అతని తల్లిదండ్రులు ఎల్లమ్మ, మాధవస్వామి నాయుడు తెలిపారు. సోలోమియాన్స్‌కీ జిల్లా నుంచి 800 కి.మీ రైలు ప్రయాణం అనంతరం పోలండ్‌ దేశానికి చేరుకున్నానని ఫోన్‌ ద్వారా తెలిపాడన్నారు. విద్యార్థులను క్షేమంగా ఇండియాకు రప్పిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top