
నెల్లూరులో బిహార్ సంస్కృతికి తెర లేపిన టీడీపీ పాలకులు
ప్రసన్న ఇంట్లో టీడీపీ మూకలు దాడి వెనుక వేమిరెడ్డి దంపతుల పాత్ర
ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ నిజం ఒప్పుకున్న ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి
రాజకీయంగా విమర్శలు చేస్తే రౌడీయిజం చేస్తారా?
విధ్వంసం వెనుక ముసుగు తొలగించిన ఎమ్మెల్యే, ఎంపీలు
‘రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు’ అనేది నానుడి. ‘రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలు తప్ప’ అనే మరో నానుడి ఉంది. ఈ రోజుకు మిత్రుడు, మరొక రోజుకు ప్రత్యర్థి అవుతాడు. ఇది రాజకీయ జీవిత సత్యం. అయితే దశాబ్దాల రాజకీయ చైతన్యం కలిగిన జిల్లాలో మహామహులు ప్రజాస్వామ్య స్ఫూర్తితో రాష్ట్ర, దేశ స్థాయిలో అత్యున్నత స్థాయిలో పదవులను అలంకరించారు. కొందరు మంత్రులుగా, మరికొందరు ముఖ్యమంత్రి స్థాయిలో సేవలందించి, రాష్ట్రానికి కీర్తి కిరీటాన్ని అందించారు. కానీ కూటమి పాలనలో రాజకీయాలకు అర్థాలే మారిపోయాయి. ప్రతిపక్ష పార్టీ నేతలపై విచక్షణ మరిచి విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. అదే ప్రతిపక్షం ప్రతి విమర్శలు చేస్తే భౌతిక దాడులు పాల్పడుతూ బిహార్ సంస్కృతికి తెర లేపుతున్నారు. మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంట్లో జరిగిన విధ్వంసం కూటమి దాష్టీక పాలనకు అద్దం పడుతోంది.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కూటమి ప్రభుత్వంలో ప్రతి పక్షం ప్రశ్నించడమే పాపం.. విమర్శించడమే నేరమైపోయింది. ఏడాది పాలనలో ప్రభుత్వ వైఫల్యాలను, స్థానిక నేతల అవినీతి, అక్రమాలను రాజకీయ వేదికలపై నిర్దిష్టమైన ఆధారాలతో విమర్శిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్న పరిస్థితి నుంచి రౌడీమూకలతో విధ్వంసానికి తెగించారు. ప్రశాంతతకు, రాజకీయ ప్రతిష్టకు మారు పేరైన నెల్లూరులో వేమిరెడ్డి దంపతులు బిహార్ సంస్కృతికి తెర తీశారు. రాజకీయ విలువలకు పాత రేసి విధ్వంసాలు సృష్టిస్తున్నారు.
మాజీ మంత్రి, కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంట్లో బీభత్సం వెనుక టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేల కుట్రతోనే జరిగిందని చెప్పకనే చెప్పారు. రౌడీమూకల విధ్వంసాన్ని ఖండిస్తున్నట్లు చెబుతూనే తనపై ప్రసన్న చేసిన వ్యాఖ్యలకు తీవ్ర స్థాయిలో కోపాన్ని ప్రదర్శించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో ‘నిజం’ చెప్పేశారు. టీడీపీ కార్యకర్తలను అయితే ఆపగలిగాము కానీ అభిమానులను ఆపలేకపోయామంటూ నిజం కక్కేసి పెద్ద మనుషుల ముసుగును తొలగించారు.
వేమిరెడ్డి ఇంటి నుంచే విధ్వంస రచన?
మాజీమంత్రి పసన్నకుమార్‌రెడ్డిని పక్కాగా హత మార్చేందుకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఇంటి నుంచే విధ్వంస రచన జరిగిందనేది స్వయంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మీడియా ముఖంగా మాట్లాడిన మాటలను బట్టి అర్థం అవుతోంది. ఓ ఎల్లో మీడియా చానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఆ ఘటనకు మాకు సంబంధం లేదంటూనే.. కార్యకర్తలను అయితే ఆపగలిగాము కానీ అభిమానులను ఆపలేకపోయామని, వెళ్లిన వారిని వెనక్కి రమ్మని చెప్పడం చూస్తే వారి ఇంటి నుంచే పక్కా ప్లాన్ రూపకల్పన జరిగినట్లు తెలుస్తోంది. సింహపురి రాజకీయ చరిత్రలో ఇలాంటి ఘటనలు ఎన్నడూ చోటు చేసుకోలేదు. ప్రజా జీవితంలో ఉన్న వారిపై ఎన్నో ఆరోపణలు వస్తుంటాయి.
వాటికి కౌంటర్ ఇవ్వడం, అవసరమయితే న్యాయపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మాత్రం హత్యలకు ప్రేరేపిత హింసను ప్రోత్సహిస్తున్నారని, ఆస్తుల విధ్వంసానికి పురిగొల్పుతున్న ఘటనలను జిల్లా ప్రజలు హర్షించడం లేదు. ఈ తరహా ఘటనలు ఇంత వరకు బిహర్ రాష్ట్రంలోనే జరుగుతున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా చూస్తుంటాం. బిహర్ తరహా హింసను నెల్లూరులో పరిచయం చేయడం భవిష్యత్ పరిణామాలను చూస్తే ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఆ గుండె ఆగి ఉంటే..
ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంట్లో పనివారితోపాటు ఆయన తల్లి 85 ఏళ్ల వృద్ధురాలు శ్రీలక్ష్మమ్మ ఉంది. దాదాపు ఆరు దశాబ్దాలకుపైగా రాజకీయ కుటుంబంలో మసలిన ఆమెకు ఇలాంటి ఘటనలు ఎన్నడూ ఎదురుకాలేదు. వందలాది మంది టీడీపీ రౌడీ మూకలు ఒక్కసారిగా రెండు వైపు ద్వారాల నుంచి ఇంట్లోకి ప్రవేశించి దాదాపు అర్ధగంట పాటు సాగించిన విధ్వంసానికి భయంతో ఆ పెద్దావిడ గుండె ఆగి ఉంటే పరిస్థితి ఏమిటనే జిల్లా ప్రజల్లో చర్చ ప్రారంభమైంది. టీడీపీ గూండాలు సాగించిన బీభత్సానికి భీతిల్లిపోయిన ఆమె ప్రాణభయంతో బాత్‌రూమ్‌లో దాక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పగిలిన కిటికీ అద్దాల్లో నుంచి భయంతో దైన్యంగా చూస్తున్న ఆమె చూపులు పలువురి గుండెలు తరుక్కుపోతున్నాయి. ప్రజాస్వామ్యంలో విమర్శలకు దాడులు జవాబు కాదని వేమిరెడ్డి దంపతులు తెలుసుకోవాలని జిల్లా ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
ప్రతి విమర్శలను తట్టుకోలేకపోయిన ఎమ్మెల్యే వేమిరెడ్డి
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఇటీవల మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి అవినీతి చేశారంటూ, పర్సంటేజీల ప్రసన్న అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనికి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆమెను ఉద్దేశించి చేసిన ప్రతి విమర్శలు చేయడంతో తట్టుకోలేకపోయింది. ప్రసన్నకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల చేపట్టిన కూటమి ఏడాది పాలనపై వైఎస్సార్‌సీపీ ఉద్యమానికి ఊహించని స్థాయిలో ప్రజా స్పందన పెల్లుబుకింది. తాజాగా సోమవారం నిర్వహించిన ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ప్రజాక్షేత్రంలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రభ మనసక బారుతుండడంతో జీరి్ణంచుకోలేకపోయిన ఆమె తన అనుచర వర్గాన్ని ప్రసన్నపైకి ఉసిగొలి్పంది. ఆమె కీలక అనుచరులు గంట వ్యవధిలోనే వందల మందిని రౌడీమూకలను సమీకరించి ప్రసన్న ఇంట్లో విధ్వంసానికి ఒడిగట్టారు. ముందస్తు పథకం ప్రకారం ప్లాన్ అమలు జరిగినట్లు స్పష్టమవుతోంది. ముందుగా సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. పోలీసులు సైతం రౌడీ మూకలను చెదరగొట్టారే కానీ, అదుపులోకి తీసుకోలేదు. దీన్ని బట్టి పోలీసులకు సైతం సమాచారం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.