పచ్చర్ల జంగిల్‌ క్యాంప్‌.. అడవిలో ఆహ్లాదకర ప్రయాణం

Nallamala Jungle Camps Pacherla At Kurnool - Sakshi

అత్యాధునిక వసతులతో కాటేజీలు  

చిట్టడవిలో 25 కి.మీ సఫారీ  

పర్యాటకులకు అన్ని రకాల సదుపాయాలు

వసంత కాలం వచ్చేసింది. ఆకులు రాల్చిన అడవి పచ్చదనాన్ని తొడిగి సరికొత్తగా కనిపిస్తోంది. పచ్చని చిలుకలు.. పాడే కోయిలలు సందడి చేస్తున్నాయి. ఎగిరే జింకలు.. దూకే వానరాలు.. ఉరికే ఉడతలు.. ఉత్సాహంగా ఉల్లాసంగా కనువిందు చేస్తున్నాయి. ఎత్తుగా నిటారుగా దర్పాన్ని ప్రదర్శించే వృక్షాలు..హొయలొలుకుతూ వయ్యారంగా అల్లుకున్న లతలు ఆత్మీయ ఆహ్వానాన్ని పలుకుతున్నాయి. ఈ ప్రకృతి రమణీయతను ఆస్వాదించాలంటే పచ్చర్ల క్యాంప్‌కు వెళ్లాల్సిందే.   

ఆళ్లగడ్డ: నల్లమల.. రాష్ట్రంలోనే అతిపెద్ద అభయారణ్యం. విశేషమైన వృక్ష సంపద, లెక్కలేనన్ని వన్యప్రాణులు, ఎన్నో రకాల పక్షులు, క్రూరమృగాలైన పెద్దపులులు, చిరుతలు, ఔషధ మెక్కలు ఈ అడవి సొంతం. పర్యావరణ ప్రేమికులకు మరింత ఆసక్తిని, ఆనందాన్ని కలిగించేందుకు అటవీ శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. నల్లమల అందాలను దగ్గర నుంచి చూసే అరుదైన అవకాశం జంగిల్‌ సఫారీ పేరిట అందుబాటులోకి తెచ్చింది.

కాటేజీలు   

అడవి గురించి తెలుసుకునేందుకు, వన్యప్రాణులను ప్రత్యక్షంగా వీక్షించేందుకు, ఇక్కడ ఉన్న చెంచులతో మాట్లాడి వారి స్థితిగతులను అర్థం చేసుకునేందుకు నల్లమలలోని పచ్చర్ల టైగర్‌ రిజర్వ్‌ అవకాశం కల్పిస్తోంది. వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించేలా ప్రత్యేక టూర్‌ ప్యాకేజీలను అమలు చేస్తోంది. 

జంగిల్‌ క్యాంప్‌ పునఃప్రారంభం 
ప్రకృతి ప్రేమికులకు ఆనందాన్ని పంచేందుకు, మనసును ఆహ్లాదపరిచేందుకు నల్లమలలోని ‘పచ్చర్ల’ జంగిల్‌ క్యాంప్‌ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కోవిడ్‌ దృష్ట్యా కొంతకాలం మూతపడిన సఫారీ మళ్లీ పునఃప్రారంభమైంది. ప్రకాశం జిల్లా గిద్దలూరు మీదుగా శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులు జంగిల్‌ సఫారీకి వస్తున్నారు. వారాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఇక్కడి సౌందర్యాన్ని చూడటానికి విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుండటం విశేషం.  

జంగిల్‌ సఫారీలో పర్యాటకులు   

అందుబాటులో కాటేజీలు 
నంద్యాల, గిద్దలూరు మార్గంలో నంద్యాలకు 25, గిద్దలూరుకు 35 కి.మీ దూరంలో పచ్చర్ల జంగిల్‌ క్యాంప్‌ ఉంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్యాంప్‌కు చేరుకోవచ్చు. ఇక్కడ రెండు ఓపెన్‌ టాప్‌ జీపులను పర్యాటకుల కోసం అందుబాటులో ఉంచారు. ఒక్కో వాహనంలో 10 మంది కూర్చొని సఫారీ చేయవచ్చు. ఒక్కో వ్యక్తికి రూ. 200 చొప్పున చెల్లిస్తే ఐదుగురు వెళ్లేందుకు అనుమతి ఇస్తారు.

మొత్తం రూ.1000 చెల్లించి ఇద్దరు ముగ్గురైనా సఫారీకి వెళ్లవచ్చు. జంగిల్‌ క్యాంప్‌లో నాలుగు కాటేజీలు, 2 మిలట్రీ టెంట్‌ హౌస్‌లు ఉన్నాయి. కాటేజీ అద్దె రూ. 4,000, మిలట్రీ టెంట్‌ అద్దె రూ. 5,000 (ఇద్దరికి), ఆరేళ్లు దాటిని పిల్లలకి రూ. 1,000 అదనంగా వసూలు చేస్తారు. బస చేసిన వారికి రెండు పూటలా భోజం, ఉదయం బెడ్‌ కాఫీ, టిఫిన్, సాయంత్రం స్నాక్స్‌ అందిస్తారు. జంగిల్‌ సఫారీ ఉచితంగా చేయవచ్చు.  

అడవిలో ఆహ్లాదకర ప్రయాణం 
నల్లమలలోని టైగర్‌ రిజర్వ్‌ అటవీ ప్రాంతంలో సుమారు 25 కి.మీ  ప్రయాణం ఆహ్లాదకరంగా సాగుతుంది. నెమళ్లు, వివిధ రకాల పక్షులు, జింకలు, దుప్పులు, అడవి పందులు, కొండ గొర్రెలు, భయపెట్టే కొండ చిలువలు, తాచు పాములు వీటి మధ్య పర్యటన కొనసాగుతుంది. మధ్యన రెండు చోట్ల వాచ్‌ టవర్‌లను ఏర్పాటు చేశారు. సందర్శకులు వీటిని ఎక్కితే నల్లమల అంతా చూడవచ్చు.

ప్రస్తుతం నల్లమలలో దాదాపు 50 చిరుత పులులు, 70 పెద్ద పులులు ఉన్నట్లు అంచనా. అప్పుడప్పుడు చిరుత, పెద్ద పులులు కూడా కనిపిస్తున్నాయి. అడవిలోకి వెళ్లే పర్యాటకులు అటవీ సిబ్బంది ఆపిన చోట మాత్రమే కిందకు దిగాలి. అటవీ మధ్యలో దిగడం, ఫొటోలు తీసుకోవడం చేయకూడదు.

స్థానికంగా ఉండే చెంచులే టూరిస్టు గైడ్లు 
స్థానికంగా నివసించే చెంచులే గైడ్‌లుగా ఉంటూ నల్లమల అడవిని చూపిస్తారు. పర్యాటకులు వారితో మమేకమై ముచ్చటించేందుకు అటవీ శాఖ అవకాశం కల్పిస్తోంది. చెంచుల స్థితిగతులు, జీవనవిధానంపై అవగాహన కలుగుతుంది. నల్లమల అందాలను మనసారా ఆస్వాదించేలా అధికారులు ప్యాకేజీని రూపొందించారు.  

మళ్లీ రావాలని అనిపిస్తోంది 
స్నేహితుడి పెళ్లి అయిపోయిన తరువాత ఫొటో షూట్‌ కోసం ఇక్కడికి వచ్చాను. ఇంత ఆహ్లాదకరంగా ఉంటుందని అనుకోలేదు. మళ్లీ రావాలని అనిపిస్తోంది.  
– కాశీబాబు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్, చెన్నై

చాలా బాగుంది 
స్నేహితులతో కలిసి మొదటిసారి ఇక్కడికి వచ్చాను. పచ్చర్ల జంగిల్‌ సఫారీ చాలా బాగుంది. మరోసారి కుటుంబ సభ్యులం అందరం కలిసి రావాలని అనుకుంటున్నాం. 
– చందన, మార్కాపురం, ప్రకాశం జిల్లా  

లాభాపేక్ష లేకుండా సేవలు 
జంగిల్‌ క్యాంప్‌ ఆహ్లాదకరంగా ఉంటుంది. కాటేజీ బుక్‌ చేసుకున్నవారు ఒక్క రూపాయికూడా అదనంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. భోజనాలు, టీ, టిఫిన్, స్నాక్స్‌ అన్నీ ఫ్రీగా అందజేస్తున్నాం. లాభాపేక్ష లేకుండా సేవలు అందిస్తున్నారు. పర్యాటకులు చెల్లించే మొత్తం ఇక్కడ పనిచేసే చెంచులకే ఖర్చు చేస్తున్నాం. 
– నరసయ్య, డీఆర్వో 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top