RK Beach Woman Missing: బీచ్‌లో గల్లంతయ్యిందా..? లేక ఇంకేమైనా జరిగిందా..?

Mystery Of Woman Missing At RK Beach An Visakhapatnam - Sakshi

ఎంవీపీ కాలనీ (విశాఖ తూర్పు): రెండు రోజులు గడుస్తున్నా వివాహిత మిస్సింగ్‌ మిస్టరీ వీడలేదు. పెళ్లి రోజు సందర్భంగా సాగరతీరంలో సరదాగా గడిపిన ఆ జంట... ఇంటికి వెళ్లిపోయేందుకు సిద్ధమైన సమయంలో బీచ్‌లో అసలేం జరిగిందో అంతుచిక్కడం లేదు. ప్రస్తుతం భర్తతోపాటు కుటుంబ సభ్యులు, పోలీసులు, నగర వాసుల మదిలో తలెత్తుతున్న ప్రశ్న ఇదే.  

వెనక్కి తిరిగి చూస్తే కనిపించలేదని ఫిర్యాదు  
సాయిప్రియ మిస్సింగ్‌పై ఆమె భర్త శ్రీనివాస్‌ సోమవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో త్రీటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోమవారం వారి పెళ్లి రోజు కావడంతో ఆమెతో కలిసి ఆర్కేబీచ్‌కు విహారానికి వచ్చినట్లు తెలిపాడు. తాను హైదరాబాద్‌లోని ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా భార్య విశాఖ ఎన్‌ఏడీలోని వాళ్ల అమ్మవారి ఇంటి వద్ద ఉండి చదువుకుంటున్నట్లు శ్రీనివాస్‌ తెలిపాడు. అయితే ఆదివారం పెళ్లిరోజు కావడంతో రెండు రోజుల క్రితమే విశాఖ వచ్చినట్లు వెల్లడించాడు.

ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం సాయిప్రియతో కలిసి ఆర్కేబీచ్‌కు వచ్చి ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నామన్నారు. అయితే రాత్రి 7.30 సమయంలో తిరిగి వెళ్లిపోవడానికి సిద్ధమవగా... తన ఫోన్‌కు మెసేజ్‌ రావడంతో చూసుకుంటూ రోడ్డు వైపు వచ్చినట్లు శ్రీనివాస్‌ ఫిర్యాదులో వివరించాడు. ఆ సమయంలో కాళ్లు కడుక్కోవడానికి సముద్రంవైపు వెళ్లిన తన భార్య సాయిప్రియ వెనుక వస్తుందని భావించినట్లు తెలిపాడు. అయితే కొంతసేపటి తర్వాత వెనక్కి తిరిగి చూడగా ఆమె కనిపించలేదన్నాడు. అనంతరం తీరంలో వెతగ్గా ఎక్కడా కనిపించలేదని వెల్లడించాడు. 

అయితే సోమవారం కూడా శ్రీనివాస్‌ని పలు విధాలుగా ప్రశ్నించినప్పటికీ తాను ఫిర్యాదులో మాదిరిగానే సమాధానం ఇచ్చినట్లు త్రీ టౌన్‌ సీఐ రామారావు వెల్లడించారు. అయితే సాయిప్రియ, శ్రీనివాస్‌ దంపతుల మధ్య ఎలాంటి గొడవలైనా ఉన్నాయా అనే అంశంపై సాయిప్రియ తండ్రి అప్పలరాజుతోపాటు కుటుంబ సభ్యులను ప్రశ్నించగా గొడవలు లేవని, వారు అన్యోన్యంగానే ఉంటున్నారని వెల్లడించినట్లు సీఐ తెలిపారు. అయితే సాయిప్రియ బీచ్‌లో గల్లంతై ఉంటే 24 గంటల నుంచి 36 గంటల్లోపు ఒడ్డుకు కొట్టుకొచ్చే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో బీచ్‌ వెంబడి పోలీసు నిఘా ఉంచినట్లు తెలిపారు.  

తీరంలో విస్తృతంగా గాలింపు 
సాయిప్రియ బీచ్‌లో గల్లంతై ఉంటుందా..? అనే అనుమానంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో భాగంగా ఆర్కే బీచ్‌ తీరం వెంబడి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అయినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీంతో కోస్ట్‌గార్డ్స్, నేవీ అధికారుల సహాయం కోరడంతో 11 గంటల ప్రాంతంలో రెండు కోస్ట్‌గార్డ్‌ గస్తీ నౌకలతోపాటు హెలికాప్టర్‌ ద్వారా ముమ్మరంగా గాలించారు. అయినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీంతోపాటు మంగళవారం మధ్యాహ్నం నగర మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి, డిప్యూటీ మేయర్‌ శ్రీధర్‌ తదితరులు ఆర్కేబీచ్‌కు వచ్చారు. సాయిప్రియ గల్లంతైనట్లుగా భావిస్తున్న ప్రాంతాన్ని సందర్శించారు. దర్యాప్తుపై పోలీసుల నుంచి సమాచారం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్‌ హరివెంకటకుమారి కలెక్టర్‌ మల్లికార్జునతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ కేసు దర్యాప్తునకు అవసరమైన సహకారాన్ని పోలీసులకు అందించాలని కోరారు. దీంతోపాటు తీరప్రాంతం వెంబడి గస్తీ పెంచాలని, హెచ్చరిక బోర్డులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని సూచించారు. కమ్యునిటీ గార్డుల ఏర్పాటుపైనా చర్చించినట్లు మేయర్‌ తెలిపారు. కార్యక్రమంలో పోలీసు, ఇతర ఉన్నతాధికారులతోపాటు సాయిప్రియ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 
 
సంజీవయ్యనగర్‌లో విషాదం  
గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): ఆర్‌కే బీచ్‌లో సాయిప్రియ గల్లంతైన ఘటనతో జీవీఎంసీ 52వ వార్డు సంజీవయ్యనగర్‌లో విషాదం నెలకొంది. సాయిప్రియ కుటుంబం శోకసంద్రంలో మునిగి పోయింది. సోమవారం సాయంత్రం గల్లంతైనప్పటికీ ఆచూకీ తెలియకపోవడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. విజయనగరం జిల్లా కందివలసకు చెందిన శ్రీనివాసరావుకు సాయిప్రియకు వివాహమై రెండేళ్లయింది. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న ఆమె భర్త శ్రీనివాసరావు పెళ్లి రోజు కానుకగా బంగారు చేతి గాజులు చేయించి బహుమతిగా తీసుకొచ్చాడు. అల్లుడూ, కుమార్తెది అన్యోన్యమైన దాంపత్యమని గుర్తు చేసుకుంటూ తల్లి విలపించిన తీరు చూపరులకు కన్నీరుతెప్పిస్తోంది. త్వరలో భార్యను తీసుకుని హైదరాబాద్‌ వెళ్లిపోవాలనుకున్నంతలో ఘోరం జరిగిపోయిందని వాపోతున్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top