
వక్ఫ్ సవరణ బిల్లును ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, రేపు(గురువారం) రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్ విందును బహిష్కరించాలని చేయాలని నిర్ణయించింది.
సాక్షి, విజయవాడ: వక్ఫ్ సవరణ బిల్లును ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, రేపు(గురువారం) రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్ విందును బహిష్కరించాలని చేయాలని నిర్ణయించింది. వక్ఫ్ సవరణ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆల్ ఇండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
రేపు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్‌ను బాయ్ కాట్ చేస్తున్నామని.. రాష్ట్రంలోని అన్ని ముస్లిం సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఇఫ్తార్‌ను బాయ్ కాట్ చేయాలని ఆల్ ఇండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు పిలుపునిచ్చింది. ‘‘సనాతనధర్మం బోర్డులో ఇతర మతాలను కలపాలని చూస్తే మొదటగా పోరాడేది మేమే. ముస్లింల హక్కులను కాపాడేందుకు సీఎం చంద్రబాబు చొరవ తీసుకోవాలని కోరుతున్నాం.
..వక్ఫ్ సవరణ బిల్లు ముస్లింల మతపరమైన అంశాల్లో జోక్యంగా భావిస్తున్నాం. రాజ్యాంగం కల్పించిన హక్కుల ఉల్లంఘన ఇది. మతపరమైన నిర్వహణ ఆయా మతాలే చూసుకుంటాయి. బిల్లులో పారదర్శకత లేదు. ముస్లింలపై జరుగుతున్న కుట్ర ఇది’’ అని ఆల్ ఇండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు పేర్కొంది.
‘‘వక్ఫ్ సవరణ బిల్లు కుట్రపూరితంగా చేస్తున్నారు. ప్రతీ మతానికి వారికి సంబంధించిన భూములను రక్షించుకునేందుకు బోర్డులు ఉన్నాయి. ముస్లింలకు మాత్రమే బోర్డు ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం సరికాదు. భవిష్యత్తులో అన్నిమతాలకు ఇదే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది. దేశవ్యాప్తంగా వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగుతాయి. ఈ నెల 29న విజయవాడ ధర్నాచౌక్‌లో భారీ నిరసన చేపడతాం’’ అని ఆల్ ఇండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు సభ్యులు తెలిపారు.
