
సాక్షి, అమరావతి: గుంటూరులో బీటెక్ విద్యారి్ధని రమ్య హత్య దురదృష్టకరమని, ఈ సమయంలోను టీడీపీ నేత లోకేశ్ వ్యవహరించిన తీరు బాధాకరమని వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. రమ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన లోకేశ్ వైఎస్సార్‌సీపీ దళిత కార్యకర్తల్ని కొడుకులని తిట్టడం ఏమిటని నిలదీశారు. బూతులు తిట్టినంతమాత్రాన నాయకుడు కాలేరనే విషయాన్ని లోకేశ్ గ్రహించాలని సూచించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరులసమావేశంలో ఆయన మాట్లాడారు. ఎక్కడైనా మృతదేహం ఉంటే రాబందుల కంటే ముందు లోకేశ్ వాలిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఎస్సీలను వేధింపులకు గురిచేయడంబాబుగారి పేటెంట్ అని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు పోలీసులపై దౌర్జన్యం చేసి, బూతులు తిట్టిన విషయాన్ని గుర్తుచేశారు.
ప్రభుత్వం వేగంగా స్పందించింది
ఘటన జరిగిన తర్వాత పోలీసులు, ప్రభుత్వం వేగంగా స్పందించినట్లు చెప్పారు. నిమిషాల వ్యవధిలోనే నిందితుడ్ని గుర్తించి, గంటల్లోనే అరెస్టు చేశారన్నారు. హోంమంత్రి సుచరిత వెళ్లి బాధితులకు అండగా నిలిచారని గుర్తుచేశారు. హంతకుడిని శిక్షించే విషయంలో ప్రభుత్వం, పోలీసువ్యవస్థ ఎక్కడా రాజీపడబోవని స్పష్టం చేశారు. ఏ ఆడబిడ్డకు కష్టం వచ్చినా సీఎం జగన్ సహించరని చెప్పారు. రమ్య హత్యపై సీఎం జగన్ చాలా సీరియస్‌గా ఉన్నారని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని పోలీసులను ఆదేశించారని చెప్పారు. సీఎం జగన్ ప్రభుత్వంలో పోలీసులు న్యాయబద్ధంగా వ్యవహరిస్తారని, తప్పు జరిగితే ఎలాంటి వ్యక్తులనైనా శిక్షించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.