సేంద్రీయ సేద్యం.. రసాయన ఎరువులకు స్వస్తి   

Mostly Organic Farming In PSR Nellore District - Sakshi

సేంద్రియ ఎరువులతో సాగు

జిల్లాలో 67 వేల ఎకరాల్లో సాగు

53 వేల మందికి పైగా ప్రకృతి వ్యవసాయంలో రైతులు

222 గ్రామాల్లో ఎక్కువగా ప్రకృతి వ్యవసాయం

రసాయనిక ఎరువులు, పురుగు మందులతో పెరుగుతున్న పెట్టుబడులు, తగ్గుతున్న పంట నాణ్యత.. రైతులను సంప్రదాయ సేద్యంపై వైపు నడిపిస్తోంది. సహజ సిద్ధ (ఆర్గానిక్‌) పంట ఉత్పత్తులకు మార్కెట్లోనూ మంచి డిమాండ్‌ఉండడం, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తుండడంతో రైతులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతులకు లాభాసాటిగా ఉండాలనే లక్ష్యంతో ప్రకృతి సేద్యానికి రాష్ట్ర ప్రభుత్వం సైతం తోడ్పాటును అందిస్తోంది. పెట్టుబడులు తగ్గడంతో పాటు అధిక దిగుబడులతో జిల్లాలో ఏటా సహజ సేద్యం సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది.   

విడవలూరు/నెల్లూరు(సెంట్రల్‌): ప్రకృతి వ్యవసాయం లాభసాటిగా మారడంతో రైతులకు వరంగా మారింది. ప్రస్తుతం రసాయనిక ఎరువుల ధరలు రోజురోజుకు గణనీయంగా పెరుగుతుండడంతో సాగు పెట్టుబడి అధికం అవుతుంది. పంట నాణ్యత లేకపోవడంతో దళారుల దోపిడీతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రకృతి వ్యవసాయంతో సత్ఫలితాలు వస్తుండడం, సేంద్రియ సేద్య (ఆర్గానిక్‌) ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి డిమాండ్, రేటు లభిస్తుండడంతో రైతులు సైతం ఆ తరహా సేద్యంపై ఆసక్తి కనబరుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం సేంద్రియ సేద్యాన్ని ప్రభుత్వం ప్రోత్సాహం అందించడంతో జిల్లాలో ఏటేట సాగు విస్తీర్ణం పెరుగుతోంది. 


  
67 వేల ఎకరాల్లో సాగు  
జిల్లాలో ప్రకృతి వ్యవసాయం సాగుకు రైతులు ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రకృతి వ్యవసాయానికి మహిళా రైతులు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. విడవలూరు, వింజమూరు తదితర మండలాల్లో మహిళా రైతులు ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా వరి, ఇతర పంటలు సాగు చేస్తున్నారు. వీరు ప్రకృతి వ్యవసాయం కింద సాగు చేయడంతో గతంలో వీరికి ఆదర్శ మహిళా రైతుగా బిరుదులు కూడా దక్కాయి. జిల్లాలో ఈ ఏడాది 53,764 మంది రైతులు 67,356  ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 46 మండలాల్లో  222 గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం ఎక్కువగా సాగు చేస్తున్నారు. ప్ర«ధానంగా ఆత్మకూరు, ఉదయగిరి, కావలి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ తరహా సాగు విస్తీర్ణం పెరిగింది.  

18 రకాల పంటలు 
జిల్లాలో ఎక్కువగా 18 రకాల పంటలను ప్రకృతి వ్యవసాయంలో ఎక్కువగా పండిస్తున్నారు. ప్రధానంగా వరి పంట అధిక విస్తీర్ణంలో పండిస్తున్నారు. వరితో పాటు జొన్నలు, సజ్జలు, రాగులు, మినుములు, కందులు, పెసలు, పిల్లిపిసర, జనుము, జీలుగ, మొక్కజొన్న, కొర్రలు, గోగులు, గోరుచిక్కుళ్లు, కాకర, బీర, సొరకాయలు, బెండ, టమాటాలు ఎక్కువగా వీటిని ప్రకృతి వ్యవసాయంలో పండిస్తున్నారు.   

110 గ్రామాల ఎంపిక  
ప్రకృతి వ్యవసాయం ద్వారా ఎడగారులో వరి సాగు పండించేందుకు జిల్లాలో 110 గ్రామాలను ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులకు బీజామృతం (విత్తన శుద్ధి), జీవామృతం (పంట సత్తువ), నీమామృతం (గుడ్డు దశ నాశనం), బ్రహ్మాస్త్రం (లబ్ధిపురుగు నివారణ) అగ్నాస్త్రం (అగ్గి తెగులు నివారణ) అజోల్లా (నత్రజని అందించడం) వంటి వాటిపై అవగాహన కల్పించడంతో పాటు వాటి తయారీ విధానం, వాడుక విధానాన్ని తెలుపుతున్నారు.     

ప్రకృతి వ్యవసాయమే అనివార్యం 


ఈమె పేరు రొడ్డా వెంగమ్మ. ఊటుకూరు సర్పంచ్, వింజమూరు మండలం. ఈమె 5 ఎకరాల్లో మామిడి తోట, 5 ఎకరాల్లో వరి, అర ఎకరాలో కంది, అర ఎకరాలో కూరగాయలను పండిస్తున్నారు. రసాయనిక ఎరువులు, పురుగు మందులతో సాగు చేయడంతో పెట్టుబడులు పెరిగి, ఆర్థికంగా నష్టపోయారు. దీంతో ఆమె ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించారు. తొలుత కొంత సేంద్రియ విధానంలో సాగు చేసి సత్ఫలితాలు సాధించారు. దీంతో పూర్తిగా ప్రకృతి సేద్యం చేయడం ద్వారా ఖర్చులు తగ్గించుకున్నారు. అధిక దిగుబడులతో రాబడి పెరిగిందని చెబుతున్నారు. ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన అన్ని రకాల కషాయాలను స్వయంగా తయారు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.

మూడేళ్ల నుంచి వరి పంట సాగు 


ఈమె పేరు చౌటూరు రమణమ్మ, విడవలూరు. ఈమె తనకున్న రెండు ఎకరాల సొంత పొలంలో వరి సాగు చేస్తున్నారు. గిరిజన మహిళ కావడంతో పెద్దగా విద్యను అభ్యసించలేదు. ఈమె కూడా అందరిలాగే రసాయనిక ఎరువులు, పురుగు మందులతో సాగు చేసింది. పెద్దగా రాబడి లేకపోవడంతో సాగు కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయంపై అంతపట్టు లేకపోయినప్పటికీ, ప్రకృతి సేద్యంతో ఖర్చులు తగ్గుతాయని, రాబడి పెరుగుతుందని ప్రకృతి సేద్యం సిబ్బంది సూచనలతో ఆ వైపు అడుగులు వేసింది. వారి పర్యవేక్షణలో మూడేళ్లుగా ప్రకృతి వ్యవసాయం ద్వారానే వరి సాగు చేస్తున్నారు. దీంతో ఈమెకు ఉత్తమ మహిళా రైతుగా బిరుదు లభించింది.    

అవగాహన కల్పిస్తున్నాం  
ప్రకృతి వ్యవసాయం సాగుపై జిల్లా వ్యాప్తంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రస్తుతం సాగు చేస్తున్న రైతులను ప్రోత్సహిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకృతి వ్యవసాయం సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో రైతులు కూడా సాగు చేసేందుకు ముందుకు వస్తున్నారు. అన్ని విధాలుగా రైతులకు సహాయ సహకారాలు అందిస్తున్నాం. 
– ప్రభాకర్, ప్రకృతి వ్యవసాయం 

జిల్లా మేనేజర్‌ చాలా బాగుంది  
ప్రకృతి వ్యవసాయం అంటే నాకు ఎంతో ఇష్టం. నేను 20 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్నాను.  వరితో పాటు, ఇతర పంటలను సాగు చేస్తున్నాను. పంటకు పోషకాలు అందించేందుకు అవసరమైన ప్రకృతి పరమైన పోషకాలు సిద్ధం చేసుకోవడం, వాటిని తయారు చేసుకోవడం కొంచెం కష్టంగా ఉన్నా.. ఖర్చులు భాగా తగ్గుతున్నాయి. అధిక దిగుబడులతో లాభాలు వస్తున్నాయి. 
–  ఇందకూరు అనిల్‌రెడ్డి, రైతు, అశ్వనీపురం, ఆత్మకూరు మండలం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top