చిర్రెత్తిస్తున్న స్పామ్‌ కాల్స్‌  | Sakshi
Sakshi News home page

చిర్రెత్తిస్తున్న స్పామ్‌ కాల్స్‌ 

Published Wed, Apr 26 2023 5:08 AM

More than three spam calls a day in India - Sakshi

సాక్షి, అమరావతి: అర్జంట్‌ పనిలో ఉన్నపుడు అదేపనిగా ఫోన్‌ మోగుతూ ఉంటుంది. అంత పనిలోనూ ఫోన్‌ ఎత్తితే.. తక్కువ వడ్డీతో లోన్‌ ఇస్తామనో, తక్కువ రేటుకే ఇంటి స్థలం అంటూనో.. అవతలి నుంచి గొంతు వినిపిస్తుంది. ఆ మాట వినగానే ఫోన్‌ వినియోగదారుడికి చిర్రెత్తుకొస్తుంది. ఈ స్పామ్‌ కాల్‌ సమస్య ప్రపంచ వ్యాప్తంగా చాలా వేధిస్తోంది. యూజర్లను కాల్స్‌తో పాటు మెసేజ్‌లు, ఈ–మెయిళ్లతో కూడా చికాకు పెడుతున్నారు.

మన దేశంలో ఎక్కువ మందికి రోజులో మూడు అంతకంటే ఎక్కువ స్పామ్‌ కాల్స్‌ వస్తున్నట్టు లోకల్‌ సర్వే నివేదిక చెబుతోంది. ఇలాంటి కాల్స్‌ను 40 శాతం మంది బ్లాక్‌/డిస్‌కనెక్ట్‌ చేస్తున్నట్టు పేర్కొంది. కేవలం 2 శాతం మంది మాత్రమే స్పామ్‌ కాల్స్‌లో మాట్లాడుతున్నట్టు వివరించింది. ఈ స్పామ్‌ కాలర్లను నియంత్రించడానికి భారత ప్రభుత్వం పదేపదే కొత్త నిబంధనలను ప్రవేశపెడుతూనే ఉంది.

2007లో డునాట్‌డిస్టర్బ్‌ (డీఎన్‌డీ) సదుపాయా న్ని తీసుకొచ్చింది. స్పామ్‌ కాల్స్‌ను అరికట్టడానికి టెలికాం కమర్షియల్‌ కమ్యూనికేషన్‌ కస్టమర్స్‌ ప్రిఫరెన్స్‌ రెగ్యులేషన్‌ (టీసీసీసీపీఆర్‌) ఫ్రేమ్‌వర్క్‌ను 2010లో ట్రాయ్‌ ప్రవేశపెట్టింది. వీటిని యాక్టివేషన్‌ చేసుకున్నప్పటికీ 95 శాతం మంది తిరిగి స్పామ్‌కాల్స్‌ను ఎదుర్కొన్నట్టు సర్వే గుర్తించింది.   

స్పామ్‌బాట్‌లో రెండో స్థానం.. 
లండన్‌కు చెందిన స్పామ్, సైబర్‌ బెదిరింపులను ట్రాక్‌ చేసే సంస్థ ‘స్పామ్‌హాస్‌ ప్రాజెక్ట్‌’ నివేదిక ప్రకారం చైనా తర్వాత భారత దేశంలోనే అత్యధికంగా స్పామ్‌బాట్‌లను వినియోగిస్తున్నా రు. ఒకేసారి ఎక్కువ సంఖ్యలో స్పామ్‌ కాల్స్, మెసేజ్‌లను పంపేందుకు స్వయం ప్రతిపత్తి కలిగిన కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌ స్పామ్‌బాట్‌ను వినియోగిస్తారు. ఈ ఏడాది మార్చి నెలాఖరుకు భారత్‌లో దాదాపు 9.39 లక్షల స్పామ్‌బాట్‌లు చురుగ్గా ఉన్నట్టు అంచనా. వీటిని ప్రధానంగా ఫిషింగ్, క్లిక్‌–ఫ్రాడ్, డీడీఓఎస్‌ కోసం ఉపయోగిస్తున్నట్టు గుర్తించారు.  

రష్యాలో అధికంగా స్పామ్‌ ఈ–మెయిళ్లు 
స్పామ్, ఫిషింగ్‌ తాజా నివేదిక ప్రకారం 2022లో రష్యా (29.8 శాతం), చైనా (14శాతం), అమెరికా (10.7 శాతం) స్పామ్‌ ఈ–మెయిళ్లలో తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. అత్యధికంగా స్పెయిన్‌లో 8.8 శాతం, తర్వాత రష్యాలో 7.3 శాతం హానికరమైన ఈ–మెయిళ్లను బ్లాక్‌ చేశారు. భార త్‌లో స్పామ్‌ మెయిళ్ల వాటా 1.8 శాతంగా ఉంటే.. బ్లాక్‌ చేసిన ఈ–మెయిళ్లు 1.6 శాతంగా ఉంది.   

ప్రపంచ వ్యాప్తంగా ఇదే సమస్య.. 
స్పామ్‌కాల్‌ సమస్య ప్రపంచ వ్యాప్తంగా ప్రబలంగా మారింది. అర్జెంటీనాలో ఫోన్‌ కాల్స్‌లో అత్యధికంగా 52 శాతం స్పామ్‌కాల్స్‌ నమోదవుతున్నట్టు గుర్తి ంచారు. భారత్‌లో ఆ వాటా 12.7 శాతంగా ఉంది. ఇక ఐర్లాండ్, హంగేరీ, థాయ్‌లాండ్‌ దేశాలు స్పామ్‌ కాల్‌ ముప్పు చాలా తక్కువగా ఉంది. ఈ దేశాల్లో 10 శాతం లోపే స్పామ్‌ కాల్స్‌ నమోదవుతున్నాయి.    

Advertisement
 
Advertisement
 
Advertisement