ఘాటెక్కిన మిర్చి

Mirchi yields are declined and prices are high - Sakshi

దేవరపల్లి: మిర్చి అ‘ధర’హో అనిపిస్తోంది. గతంలో ఎన్నడూలేని ధర పలుకుతోంది. అయితే దిగుబడులు దారుణంగా తగ్గడంతో రైతులు నిట్టూరుస్తు్తన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో ఎండుమిర్చిని సాగుచేస్తున్నా దేవరపల్లి మండలంలోని పల్లంట్ల, కురుకూరు పంట ప్రత్యేకం. ఇక్కడ మిరపకాయలు దేశవాళీ కావడం వల్ల నాణ్యత, రుచి ఉంటుందని ప్రజల నమ్మకం. ఇక్కడ కాయలతో పచ్చళ్లు పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందని చెబుతున్నారు. దీంతో గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడకు వచ్చిన పల్లంట్ల మిరపకాయలు కొనుగోలు చేస్తుంటారు. 

639 హెక్టార్లలో..
జిల్లాలో 639 హెక్టార్లలో ఎండుమిర్చి సాగు ఉంది. దీనిలో దేవరపల్లి, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, గోపాలపురం మండలాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. దేవరపల్లి మండలంలో పల్లంట్ల, కురుకూరు, లక్ష్మీపురం, దేవరపల్లి గ్రామాల్లో పండిస్తుండగా పల్లంట్ల, కురుకూరు గ్రామాల్లోనే సుమారు 150 ఎకరాల్లో పంట ఉంది. గతంలో దేవరపల్లి మండలంలో 300 ఎకరాల్లో మిరప సాగు ఉండేది అయితే చీడపీడలు, దిగుబడులు తగ్గడం వంటి కారణాలతో నాలుగేళ్లుగా రైతులు సాగు తగ్గించారు. 

సగానికి తగ్గిన దిగుబడి
ఈ ఏడాది ఎండుమిర్చి దిగుబడులు దారుణంగా పడిపోయాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎకరాకు సుమారు 6 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా 2 నుంచి 3 క్వింటాళ్లు మాత్రమే వస్తోందని అంటున్నారు. ఎకరాకు సుమారు రూ.లక్ష పెట్టుబడి పెడితే ప్రస్తుతం ధరలు ఆశాజనకంగా ఉండటంతో రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు ఆదాయం వస్తుందని అంటున్నారు. దిగుబడులు మరింత తగ్గిన రైతులకు నష్టాలు తప్పని పరిస్థితి. ప్రస్తుతం ధర వీసె (1400 గ్రాములు) రూ.650 నుంచి రూ.700, గుల్లకాయలు రూ.450 నుంచి రూ.500 పలుకుతోంది.

తెల్లదోమతో నష్టం
ఈ ఏడాది మిరప తోటలకు తెల్లదోమ వ్యాపించింది. కాయ తయారు కాకుండానే పిందె దశలోనే పండిపోయి రాలిపోయిందని రైతులు అంటున్నారు. దీంతో కాపులు లేక తోటలు ఖాళీగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దర పెరిగే అవకాశాలు
నేను మూడు ఎకరాల్లో మిరప పంట వేసి ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించాను. ఎకరాకు 3 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. మూడు ఎకరాల్లో దాదాపు 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ప్రస్తుతం వీసె ధర రూ.700 ఉంది. వారం రోజుల్లో రూ.1,000 దాటవచ్చు. ఈ ఏడాది మిరప తోటలు నల్లదోమ, ఆకుముడత తెగుళ్లతో ఎక్కువగా దెబ్బతిన్నాయి. 
– నలమాటి బాలకృష్ణ, రైతు, పల్లంట్ల 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top