
సాక్షి, సిటీబ్యూరో: రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్(రీట్స్) పెట్టుబడులు 6–7 శాతం రాబడిని అందిస్తున్నాయని అనరాక్–క్రెడాయ్ సంయుక్త నివేదిక వెల్లడించింది. దేశంలో 2019లో మొదలైన తొలి రీట్ లిస్టింగ్ నుంచి ఈ రంగం ఊపందుకుంది. ఈ ఏడాది ఆగస్టు నాటికి దేశంలో రీట్స్ 18 బిలియన్ డాలర్లకు చేరింది. 2030 నాటికి 25 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా.
దేశీయ సంస్థాగత రియల్ ఎస్టేట్ పెట్టుబడుల్లో రీట్స్ వాటా కేవలం 20 శాతం మాత్రమే. అమెరికాలో 96 శాతం, సింగపూర్‌లో 55 శాతం, జపాన్‌లో 51 శాతం వంటి ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాలో రీట్స్ పెట్టుబడులు తక్కువే. డేటా సెంటర్లు, రిటైల్, పారిశ్రామిక వంటి వైవిధ్యభరితమైన స్థిరాస్తి విభాగాలలో రీట్స్ పెట్టుబడులు పెడుతుంటారు.
గతేడాది ప్రపంచవ్యాప్తంగా 250 బిలియన్ డాలర్ల విలువైన డేటా సెంటర్ల రీట్స్ పెట్టుబడులు రాగా.. వచ్చే ఏడేళ్లలో ఇవి రెట్టింపు అవతాయని అంచనా. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 520 మిలియన్ చ.అ. ఆఫీసు స్థలంలో.. కేవలం 32 శాతం 166 మిలియన్ చ.అ. రీట్స్‌లో లిస్టయ్యాయి. యూఎస్, సింగపూర్, జపాన్ వంటి దేశాలతో పోలిస్తే ఇది తక్కువైనప్పటికీ ఇండియాలో రీట్స్ రాబడులు ఆకర్షణీయంగా ఉంటుంది.