
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుకు డిసెంబర్ 15, 2022 వరకూ రూ.20,744 కోట్లు ఖర్చయిందని వార్షిక నివేదికలో జలశక్తి శాఖ పేర్కొంది. పనుల నిమిత్తం ఇప్పటి వరకూ రూ.13,226.04 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొంది. 2017–18 ధరల ప్రకారం ప్రాజెక్టుకు ఆమోదించిన అంచనా వ్యయం రూ.47,725.74 కోట్లు అని స్పష్టం చేసింది. కేంద్రం తరఫున ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు నీటి పారుదల విభాగాన్ని అమలు చేస్తోందని పేర్కొంది.
2,454 మీటర్ల ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్, 1,128.4 మీటర్ల పొడవైన స్పిల్ వేతో తూర్పు, పశ్చిమగోదావరి, విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లో 2.91 లక్షల హెక్టార్లకు సాగు నీరు అందించడంతోపాటు పలు ఇతర ప్రయోజనాల కోసం ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు తెలిపింది. 2022లో వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్ విభాగంలో భారతదేశం గెలుచుకున్న నాలుగు అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజీ ఒకటని తెలిపింది.