విద్యాలయాల్లో కరోనా జాగ్రత్తలు పాటించాలి: మంత్రి ఆదిమూలపు

Minister Adimulapu Suresh Review With Officials On Covid In Schools - Sakshi

సాక్షి, అమరావతి: పాఠశాలలతో పాటు ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులు కోవిడ్ బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, మూడో వేవ్ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. ఆగష్టు 16వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి కళాశాలలు ప్రారంభించిన దృష్టా గురువారం మంత్రి సమీక్ష చేశారు. విద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖాధికారులతో ఉన్నతస్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు.  కరోనా పరిస్థితులతోపాటు ఇప్పటివరకు వాక్సిన్ వేయించుకున్న ఉపాధ్యాయుల వివరాలు, ప్రస్తుతం పాజిటివ్‌గా నమోదైన విద్యార్ధుల, ఉపాధ్యాయుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఇప్పటికే 97.5 శాతం ఉపాధ్యాయులకు టీకా వేశారని మిగిలిన 7,388 మందికి వెంటనే వేసి 100 శాతం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి సురేశ్‌ ఆదేశించారు. 100 మందికి వాక్సిన్ ఒకేసారి వేయడానికి విద్యా శాఖ ఏ కేంద్రాన్ని ప్రతిపాదిస్తే అక్కడ వాక్సిన్ వేసే ఏర్పాటు చేస్తామని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారులు ఆయా జిల్లా వైద్యాధికారిని సంప్రదిస్తే చాలని స్పష్టం చేశారు.

పాఠశాలల్లో విద్యార్థులు భౌతిక దూరం పాటిస్తే, చాలావరకు కరోనా వ్యాప్తిని నివారించవచ్చని తెలిపారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ తప్పక పాటించాలని సూచించారు. విశ్వ విద్యాలయాలు, డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలలు వంటి వాటిలో సిబ్బందికి, విద్యార్థులకు కూడా వాక్సినేషన్‌కు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఉన్నత విద్యా మండలి‌ చైర్మన్‌ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి, ఉన్నత విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీశ్‌ చంద్ర, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, ఇంటర్మీడియెట్ విద్య కమిషనర్ రామకృష్ణ, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు వెట్రిసెల్వి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top