
సాక్షి, అమరావతి: బెరైటీస్, సిలికా, మైకా, క్వార్ట్జ్ గనుల లీజులు పొందడం మరింత కఠినం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ ఖనిజాలను మైనర్ మినరల్ జాబితా నుంచి తొలగించింది. దీంతో ఈ ఖనిజాలు ఈనెల 20 నుంచి మేజర్ మినరల్స్ పరిధిలోకి వచ్చాయి. అంటే వాటి లీజుల మంజూరుకు కేంద్రం ఆమోదం తెలపాల్సి ఉంటుంది.
ఇక, మైనర్ మినరల్స్ అయితే లీజులు ఇచ్చే అధికారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుంది. లీజుదారుల మినరల్ ప్లాన్లను కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఐబీఎం (ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్) ఆమోదించాలి. మేజర్ మినరల్స్ కేంద్రం పరిధిలోకి వెళ్లడంతో రాష్ట్ర గనుల శాఖ దరఖాస్తు ప్రతిపాదనను ఐబీఎంకు పంపుతుంది. ఐబీఎం ఆమోదించాకే లీజు మంజూరవుతుంది. దీంతో కొత్త లీజుల మంజూరు కఠినంగా మారడంతోపాటు ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉన్నట్లు లీజుదారులు వాపోతున్నారు.
వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో బెరైటీస్, పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో క్వార్ట్జ్ , సిలికా, విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు తదితర జిల్లాల్లో మైకా ఖనిజ లీజులు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న లీజుదారులు నేరుగా ఐబీఎంకు ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆ లీజుదారులు తమ మైనింగ్ ప్లాన్ కూడా సమర్పించాల్సి వస్తుంది. ఆ ప్లాన్‌కు ఆమోదం లభించే వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన ప్లాన్‌తో మైనింగ్ చేసుకునే అవకాశం కలి్పంచింది. ఈ సంవత్సరం జూన్ 30వ తేదీలోపు ప్రస్తుత లీజుదారులు తమ ప్లాన్లను ఐబీఎంకు సమరి్పంచాలి.