
సాక్షి,అమరావతి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉత్తరాంధ్ర పర్యటన సూపర్ సక్సెస్ అయ్యింది. ప్రభుత్వ పెద్దల కుట్రలు, పోలీసుల అడ్డంకులు అన్నీ దాటి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి మాకవరపాలెం మెడికల్ కాలేజీ వరకు జగన్ వెంట జనం నడిచారు.

అనకాపల్లి నుంచి రాజుపాలెం వరకు కుండపోత వర్షం కురిసినా, ప్రజల ఉత్సాహం తగ్గలేదు. మహిళలు, వృద్ధులు వర్షంలో తడుస్తూనే జగన్ కోసం ఎదురు చూశారు. కొత్తూరు జంక్షన్ వద్ద టీడీఆర్ బాధితులు, వర్షంలో తడుస్తూనే జగన్‌ను కలిశారు. తాళ్లపాలెం జంక్షన్ వద్ద రోడ్లు చెరువులా మారినా, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులు మోకాళ్ల లోతు నీళ్లలో జగన్ కోసం వేచి చూశారు. రైతుల కష్టాన్ని చూసి చలించిన జగన్, వర్షంలో తడుస్తూనే బాధితులతో మాట్లాడారు.


జగన్ పర్యటనను విఫలం చేసేందుకు అధికారిక యంత్రాంగం ప్రయత్నించినా, ప్రజల ఆదరణ ఆ ప్రయత్నాలను తుడిచిపెట్టేసింది. కూటమి ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి, జగన్ కాన్వాయ్‌లోని వాహనాలను నిలిపి వేసినా, క్యాడర్ పొలాల నుంచి బైకులపై వచ్చి, వర్షంలోనూ హారతులు పట్టారు. గుమ్మడి కాయలతో స్వాగతం పలికారు. జై జగన్ నినాదాలతో ఉత్తరాంధ్ర మార్మోగింది. ఎయిర్‌పోర్ట్ నుంచి మాకవరపాలెం వరకు 63 కి.మీ. దూరాన్ని 6 గంటలకు పైగా ప్రయాణించి, ప్రజల ఆదరణతో జగన్ పర్యటన సూపర్ సక్సెస్‌గా నిలిచింది. ఈ పర్యటనతో వైఎస్సార్‌సీపీ కేడర్‌లో కొత్త ఉత్సాహం నెలకొంది.

