మహారాణిలా చూడాలని కోరుకుంటున్నారు: మన్సాస్‌

Mansas Trust On Urmila Gajapathi Raju - Sakshi

మాన్సాస్‌ చైర్‌పర్సన్‌ కార్యాలయం పేరుతో లేఖ విడుదల

సాక్షి, విజయనగరం : ఉత్తరాంధ్ర కల్పవల్లి, విజయనగరం ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా చోటుచేసుకున్న వ్యవహారంపై మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌ కార్యాలయం ఓ లేఖను విడుదల చేసింది. సిరిమానోత్సవంలో ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌కు ముందు వరుసలో సీటు కేటాయించడం ఆనవాయితీ అని వివరించింది. కొంతమంది ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నేరుగా వచ్చి ముందు వరుసలో కూర్చున్నారని పేర్కొంది. పుసపాటి అనంద గజపతిరాజు కుమార్తె ఊర్మిళ, ఆమె తల్లి సుధా గజపతి రాజు... ఈవో పక్కన కూర్చొని సిరిమాను ఉత్సవాన్ని వీక్షించారని వివరించింది. అయినప్పటికీ తమకు సీట్లు కేటాయించలేదని మీడియాకు చెప్పడం బాధాకరమని మాన్సాస్‌ కార్యాలయం లేఖలో విచారం వ్యక్తం చేసింది.

వారిని మహారాణి, రాజ కుమార్తెలాగా చూడాలని కోరుకుంటున్నారని, కానీ సిరిమానోత్సవం ప్రజల పండుగని తెలిపింది. ప్రజాస్వామ్యంలో ఇంకా కొంతమంది రాజరికం కోరుకోవడం దురదృష్టకరమని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఊర్మిళ తల్లి, ఊర్మిళ ప్రవర్తించిన తీరు అహంకారపూరితమని మాన్సాస్ కార్యాలయం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా దసరా సందర్భంగా గత మంగళవారం అ‍మ్మవారి సిరిమానోత్సం ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. సాంప్రదాయాలను పాటిస్తూ నిర్వహిస్తూ జరిపిన ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రముఖులు వీక్షించారు. అయితే మన్సాస్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ కోసం ముందు వరుసలో ఏర్పాటు చేసిన కుర్చీలో ఊర్మిల, ఆమె తల్లీ కూర్చోవడంపై  మన్సాస్‌ ట్రస్ట్‌ బోర్డు చైర్‌పర్సన్‌ సంచయిత గజపతి రాజు  తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారి తీరును ఖండిస్తూ లేఖను విడుదల చేశారు.

జాతర సంఘటనలో ప్రభుత్వ ప్రమేయం లేదు
పైడితల్లి సిరిమానోత్సవం సందర్భంగా కోట బురుజుపై జరిగిన సంఘటనలో ప్రభుత్వ జోక్యం లేదని, సంచయిత వ్యక్తిగత ప్రమేయంతోనే జరిగిందని పూసపాటి ఆనంద గజపతిరాజు కుమార్తె పి.ఊర్మిళ గజపతిరాజు అన్నారు. తన నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇంటి ఇలావేల్పు పైడితల్లి అమ్మవారి సిరుమాను ఉత్సవాన్ని ఏటా కోట బురుజుపై నుంచి తిలకిస్తామన్నారు. మమ్మల్ని ఎవరు అనుమతించారని చైర్‌పర్సన్‌ సిబ్బందిపై ఆగ్రహించడం తగదన్నారు. ట్రస్ట్‌ బోర్డు సభ్యురాలిగా నియమించినా ఇప్పటివరకు ప్రమాణ స్వీకారం చేయించలేదని ఆమె తెలిపారు. తమకున్న హక్కులు పలుమార్లు తెలిపామని, అధికారం శాశ్వతం కాదన్నారు.  కార్యక్రమంలో ఆనందగజపతిరాజు సతీమణి సుధా గజపతిరాజు పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top