మాన్సాస్‌ కార్యాలయం తరలింపు! | Sakshi
Sakshi News home page

మాన్సాస్‌ కార్యాలయం తరలింపు!

Published Tue, Dec 29 2020 8:29 AM

MANSAS Office May Shift From Vizianagaram To Vizag - Sakshi

మాన్సాస్‌లో ప్రక్షాళన మొదలైంది. చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన సంచయిత గజపతి తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆది నుంచి దూకుడుగా వ్యవహరిస్తూ చర్చలకు తెరతీస్తు న్నారు. తరతరాలుగా పూసపాటి ఆనందగజపతి, ఆయన తర్వాత అశోక్‌ గజపతి రాజు పెద్దరికంలో ఉన్న మాన్సాస్‌ ఇప్పుడు అందరికీ హాట్‌టాపిక్‌ అయ్యింది. తాజాగా ట్రస్ట్‌ రెవెన్యూ కార్యాలయాన్ని విశాఖ పట్నం జిల్లా పద్మనాభానికి తరలించాలనే నిర్ణయం చర్చనీయాంశమైంది.

సాక్షి ప్రతినిధి, విజయనగరం: మహారాజా అలక్‌ నారాయణ్‌ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌(మాన్సాస్‌) పేరుతో ట్రస్ట్‌ను 1958లో పి.వి.జి.రాజు విజయనగరంలో ఏర్పాటుచేశారు. సింహాచలం దేవస్ధానంతో పాటు 108 దేవాలయాలు, సుమారు 14,800కి పైగా ఎకరాల విలువైన భూములు ట్రస్ట్‌ ఆధీనంలో ఉన్నాయి. ఈ ట్రస్ట్‌కు పూసపాటి వంశీయులే చైర్మన్లుగా బాధ్యతలు చేపడుతూ వస్తున్నారు. పి.వి.జి.రాజు తర్వాత పూసపాటి ఆనందగజపతిరాజు, ఆయన తదనంతరం ఆయన సోదరుడు అశోక్‌ గజపతిరాజు ట్రస్ట్‌ బోర్డు బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో ఆనందగజపతి రాజు కుమార్తె పూసపాటి సంచయిత గజపతి రాజు మాన్సాస్‌ చైర్‌పర్సన్‌గా ఈ ఏడాది మార్చి 4వ తేదీన బాధ్యతలు చేపట్టారు. గత చైర్మన్లు కేవలం మొక్కుబడి వ్యవహారాలే తప్ప, నేరుగా ట్రస్ట్‌ కీలక వ్యవహారాలపై పట్టించుకోలేదు. ఒక్కసారిగా సంచయిత బాధ్యతలు స్వీకరించాక కీలక నిర్ణయా లు తీసుకోవడం సంచలనం సృష్టిస్తున్నాయి. అవి కాస్తా కొందరికి మింగుడుపడడం లేదు. ఆమె తీసుకున్న నిర్ణయాలపై అడుగడుగునా వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ప్రచారం చేస్తున్నారు. సింహాచలం దేవస్థానం, కళాశాల, అయోధ్యా మైదానం విషయంలోనూ ఆమె తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదయ్యాయి. అవేవీ పట్టించుకోని ఆమె తాను అనుకున్నట్టుగానే మాన్సాస్‌ ఆస్తుల పరిరక్షణ, కార్యాలయ పరిరక్షణ, విద్యాసంస్థల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు.  

పద్మనాభానికి మార్చాలని నిర్ణయం 
తాజాగా మాన్సాస్‌ కార్యాలయాన్ని విశాఖ జిల్లా పద్మనాభంలోని మెమోరియల్‌ జూనియర్‌ కళాశాలకు తరలించాలని సంచయిత నిర్ణయించారు. ఈ మేరకు మాన్సాస్‌ ఈఓ డి.వెంకటేశ్వరరావుకు సూచించారు. ఆయన దేవదాయశాఖ కమిషనర్‌కు అనుమతి కోరుతూ లేఖ రాశారు. పరిపాలన, నిర్వహణ, భద్రత కారణాల దష్ట్యా కార్యాలయాన్ని మార్చాల్సిన అవసరముందంటూ ఆ లేఖలో ఈఓ వివరణ ఇచ్చారు. ఈ పరిణామంతో జిల్లాలో మాన్సాస్‌తో ముడిపడిఉన్న వర్గాల్లో కలకలం రేగింది. పరిపాలన సౌలభ్యం కోసం సంచయిత తీసుకున్న నిర్ణయంపై కమిషనర్‌ స్పందనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా, మాన్సాస్‌ కార్యాలయంలోకి మీడియాను అనుమతించవద్దని ఈఓ ఆదేశించారంటూ, భద్రత సిబ్బంది కోట ద్వారాలు మూసేయడం విమర్శలకు తావిచ్చింది. (చదవండి: అశోక్‌ గజపతిపై తిరుగుబాటు)

Advertisement
Advertisement