
నిందితులు టీడీపీ వాళ్లయితే కేసులు మాఫీ
వైఎస్సార్‌సీపీ లీగల్‌సెల్ అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి మండిపాటు
హత్యాయత్నం కేసులైనా సులువుగా తప్పించేస్తున్నారు
ఉప్పాల హారిక, నాగమల్లేశ్వరరావు కేసుల్లో జరిగిందిదే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలుచేస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం చట్టాలను అపహాస్యం చేస్తోందని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మలసాని మనోహర్‌రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అరాచకం సృష్టిస్తున్న వారు టీడీపీకి చెందిన వాౖరెతే చాలు ఏ చట్టాలూ వారికి వర్తించవన్నట్లుగా అన్ని కేసులను మాఫీ చేస్తున్న దుర్మార్గమైన పాలనను దేశంలోనే తొలిసారి చూస్తున్నామని విరుచుకుపడ్డారు.
తమపై దౌర్జన్యం జరిగిందని కేసు పెట్టడానికి వెళ్లిన బాధితులపైనే ఎదురు కేసులు నమోదు చేస్తున్న అరాచకం రాష్ట్రంలో జరుగుతోందన్నారు. ‘ప్రభుత్వ పెద్దల అండ చూసుకుని కొందరు పోలీసు అధికారులు రెచ్చిపోతున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. ఈ ప్రభుత్వం చేసే అరాచకాలను న్యాయస్థానాల్లో ఎదుర్కొంటాం. అక్రమ అరెస్టులు చేస్తున్న పోలీసుల మీద ప్రైవేట్ కంప్లైంట్స్ వేయడం కొనసాగుతుంది’ అని స్పష్టం చేశారు.
కీలక నిందితులకు వత్తాసు
‘గుడివాడలో కృష్ణాజిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక, ఆమె భర్త రాము మీద పథకం ప్రకారమే కూటమి గూండాలు దాడిచేశారు. గుడివాడలో కేసు నమోదు చేయమని అడిగితే పోలీసులు చేయలేదు. కోర్టును ఆశ్రయిస్తామనడంతో టీడీపీకి చెందిన కీలక నిందితుడు రామును వదిలేసి కేసు నమోదు చేశారు. మన్నవ గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు కేసులోనూ ఐదుగురిని ముద్దాయిలుగా చేర్చి ముగ్గుర్ని రిమాండ్‌కి తరలించారు. దాడిలో కీలక సూత్రధారి, పాత్రధారి బండ్లమూడి చింపిరయ్య, ఆయన అనుచరుడిని కేసు నుంచి తప్పించారు. లిక్కర్ స్కాం కేసులో ఆధారాలతో సహా చంద్రబాబును ముద్దాయిగా చేర్చితే ఆ కేసును నీరుగార్చి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని మండిపడ్డారు.
బంగారుపాళ్యంలోనూ అక్రమ కేసులు
‘మామిడి రైతులను పరామర్శించేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనకు వెళ్తే.. పచ్చమీడియా ఫొటోగ్రాఫర్‌పై దాడి చేశారంటూ ముగ్గురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను అరెస్టుచేశారు. వారిని 24 గంటల్లో కోర్టులో హాజరుపరచాలన్న నిబంధనలను పట్టించుకోలేదు. వారి బంధువులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడంతో 12న అరెస్టుచేశామని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అరెస్టు చేసినప్పుడు వీరి మీద నమోదైన బెయిలబుల్ సెక్షన్లను రాజకీయ ఒత్తిళ్లతో నాన్‌బెయిలబుల్ సెక్షన్లుగా మార్చారు’ అని దుయ్యబట్టారు.