టెన్త్‌ క్లాస్‌ పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్‌ వ్యవహారం.. 22 మంది ఉపాధ్యాయుల సస్పెన్షన్‌  

Malpractice In Tenth Class Exams In Kolimigundla 22 Teachers Suspended - Sakshi

సాక్షి, నంద్యాల జిల్లా: కొలిమిగుండ్ల మండలంలోని అంకిరెడ్డిపల్లె ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో తెలుగు పరీక్ష రోజే మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన 22 మంది ఉపాధ్యాయులను విద్యాశాఖ ఉన్నతాధికారులు బుధవారం సస్పెండ్‌ చేశారు. వీరిలో చీఫ్‌ డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్, కస్టోడియన్, తొమ్మిది మంది ఇన్విజిలేటర్లతో పాటు వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు, ఒక ప్రైవేట్‌ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు ఉన్నారు. ప్రశ్నపత్రాన్ని సెల్‌ఫోన్‌లో ఫొటో తీసి వాట్సాప్‌లో ఫార్వర్డ్‌ చేయడంతో ఇద్దరు సీఆర్పీలు, పది మంది ఉపాధ్యాయులు, తొమ్మిది మంది ఇన్విజిలేటర్లు మొత్తం 21 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.

వీరంతా సోమవారం బెయిల్‌పై విడుదలయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు నిబంధనల ప్రకారం 48 గంటల పాటు రిమాండ్‌లో ఉంటే సస్పెండ్‌కు గురవుతారు. ఇందులో భాగంగానే విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. సస్పెండ్‌ అయిన వారిలో చీఫ్‌ సూపరింటెండెంట్‌గా వ్యవహరించిన సుధాకర్‌ గుప్త(పెట్నికోట), డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్‌ రామకృష్ణారెడ్డి, కస్టోడియన్‌ రాఘవయ్య (తిమ్మనాయినపేట), ఉపాధ్యాయులు నీలకంఠేశ్వరరెడ్డి (గొర్విమానుపల్లె), నాగరాజు (అబ్దులాపురం), మధుసూదన్‌రావు (చింతలాయిపల్లె), వెంకటేశ్వర్లు (అంకిరెడ్డిపల్లె), చిన్నదస్తగిరి (అంకిరెడ్డిపల్లె), వనజాక్షి (కనకాద్రిపల్లె), లక్ష్మీదుర్గ(రామకృష్ణ స్కూల్‌ తుమ్మలపెంట),

ఆర్యభట్ట (అబ్దుల్లాపురం), పోతులూరు (గొర్విమానుపల్లె), రంగనాయకులు (క్రాఫ్ట్‌ టీచర్‌ అంకిరెడ్డిపల్లె), ఇన్విజిలేటర్లు హరినారాయణ (తుమ్మలపెంట), శివప్రసాద్‌ (అంకిరెడ్డిపల్లె), వీరేష్‌(తుమ్మలపెంట), శ్రీనివాసరెడ్డి (మదనంతపురం), మదన్‌మోహన్‌(తుమ్మలపెంట), విమల్‌తేజ (అంకిరెడ్డిపల్లె), రవీంద్రగుప్త (అంకిరెడ్డిపల్లె యుటీసీఎల్‌), రాజశేఖరరెడ్డి (అంకిరెడ్డిపల్లె), వెంకటసుబ్బారెడ్డి (తుమ్మలపెంట యుటీసీఎల్‌) ఉన్నారు. ఇద్దరు సీఆర్పీలు (ఔట్‌సోర్సింగ్‌) రాజేష్, మద్దిలేటిల సర్వీస్‌ రెన్యువల్‌ చేయక పోవడంతో వారిద్దరినీ విధుల నుంచి తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
చదవండి: డ్రోన్ట్‌ వర్రీ!... మునిగిపోతున్నవారిని క్షణాల్లో కాపాడే డ్రోన్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top