
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మత సామరస్యం, శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని డీజీపీ గౌతం సవాంగ్ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీలు, పోలీసు కమిషనర్లు, స్టేషన్‌హౌస్ ఆఫీసర్లతో ఆయన ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ గౌతం సవాంగ్ మాట్లాడుతూ.. అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చిలు ఇతర ప్రార్థనా మందిరాల సర్వే, మ్యాపింగ్, సెక్యూరిటీ ఆడిట్‌ను వెంటనే పూర్తి చేయాలన్నారు.
► జియో ట్యాగింగ్‌ను రెండు రోజుల్లో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రార్థనా మందిరాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు, రథశాలల నిర్మాణం, భద్రతా సిబ్బంది నియామకం మొదలైనవి వెంటనే పూర్తి చేసేలా దేవదాయ, మైనార్టీ వ్యవహారాల శాఖల అధికారులతో చర్చించాలని చెప్పారు. అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చిల వద్ద ఇ–బీట్‌ను ఏర్పాటు చేయాలని డీజీపీ చెప్పారు.
► పోలీస్ స్టేషన్ల పరిధిలో శాంతి కమిటీలను వారంలోగా పునరుద్ధరించి వాటిని క్రియాశీలం చేయాలని స్టేషన్ ఆఫీసర్లకు ఆదేశించారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాలపై దాడులు చేసే, దొంగతనాలు చేసిన రికార్డు ఉన్న నేరస్తులపై నిఘా పెట్టాలన్నారు. బయట నుంచి వచ్చే వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తులను గుర్తించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
► అసాంఘిక శక్తుల ఆటకట్టించేందుకు పోలీసు యంత్రాంగం సదా సంసిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. అంతర్వేది ఆలయ రథం దగ్ధం కేసు విచారణలో సీబీఐకి పూర్తిగా సహకరిస్తామన్నారు. దేవదాయ శాఖ, మైనార్టీ వ్యవహారాల శాఖ, అందరు మత పెద్దలతో సంప్రదింపులు జరుపుతూ రాష్ట్రంలో అన్ని ప్రార్థనా మందిరాలకు పూర్తి భద్రత కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని డీజీపీ అన్నారు.
► మత సామరస్య పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
ఈ సమావేశంలో అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్, డీఐజీ పాల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.