Andhra Pradesh: రైతన్నలకు రూ.92,000 కోట్ల రుణాలు

Loans of Rs 92000 crore to farmers Andhra Pradesh - Sakshi

ఖరీఫ్‌లో పంట రుణాల లక్ష్యం రూ.71,000 కోట్లు

వ్యవసాయ టర్మ్‌ రుణాలు మరో రూ.21,000 కోట్లు

19.02 లక్షల టన్నుల ఎరువులు సిద్ధం

కౌలు రైతులకు 5.8 లక్షల సీసీఆర్‌ కార్డుల జారీ లక్ష్యం    

సాక్షి, అమరావతి: వర్షాలు, తుపాన్ల బారిన పడి రైతన్నలు పంటలు నష్ట పోరాదనే ఉద్దేశంతో ఖరీఫ్‌లో ఆయకట్టుకు ముందుగానే నీటి విడుదలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం విత్తనాలు, ఎరువులను ఆర్బీకేల ద్వారా పెద్ద ఎత్తున పంపిణీ చేస్తోంది. మరోవైపు ఖరీఫ్‌లో పంట రుణాలుగా రూ.71,000 కోట్లు, వ్యవసాయ టర్మ్‌ రుణాలుగా మరో రూ.21,000 కోట్లను రైతులకు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకుని పంపిణీకి చర్యలు చేపట్టింది. జిల్లాలవారీగా బ్యాంకర్ల కమిటీ సమావేశాలను నిర్వహించి లక్ష్యం మేరకు రైతులకు రుణాలు అందించాలని కలెక్టర్లకు దిశా నిర్దేశం చేసింది. 

ఈ ఏడాది 5.8 లక్షల మంది కౌలు రైతులకు క్రాప్‌ కల్టివేటర్‌ రైట్స్‌ (సీసీఆర్‌) కార్డులను జారీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఆర్బీకేల వారీగా కౌలు రైతులను గుర్తించి సీసీఆర్‌ కార్డులను జారీ చేయడంతోపాటు ఇ–క్రాప్‌లో నమోదు చేయాలని ఆదేశించింది. 

గోదావరి డెల్టాకు విడుదలైన సాగునీరు
ఖరీఫ్‌లో ముందస్తు సాగునీటి విడుదలకు సంబంధించి ఆయకట్టు వారీగా తేదీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు విడుదల చేసేలా సాగునీటి శాఖతో కలెక్టర్లు సమన్వయం చేసుకోవాలని ఆదేశించింది. ఇప్పటికే గోదావరి డెల్టాకు సాగునీటిని ఈ నెల 1వ తేదీన ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ముందస్తు సాగునీటి విడుదలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించడంతో పాటు ఆర్బీకేల స్థాయిలో ఈ నెలలో తొలి శుక్రవారం, మండల స్థాయిలో రెండో శుక్రవారం, జిల్లా స్థాయిలో మూడో శుక్రవారం వ్యవసాయ సలహా మండలి సమావేశాలను విధిగా నిర్వహించాలని పేర్కొంది. పంటల ప్రణాళికలను ఖరారు చేసి రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. 

ఆర్బీకేల్లో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు
నాణ్యత పరీక్షలు నిర్వహించిన విత్తనాలను ఆర్బీకేల ద్వారా సబ్సిడీపై ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. 84,542 క్వింటాళ్ల పచ్చి ఎరువు విత్తనాలు, 3,29,688 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు, 1,71,234 క్వింటాళ్ల వరి విత్తనాల పంపిణీకి వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. 19.02 లక్షల టన్నుల ఎరువులను ఖరీఫ్‌లో పంపిణీ చేయనున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top