'నకిలీ మద్యం' చెన్నై To విశాఖ! | Liquor being transported to Visakhapatnam in the name of Defense and sold at high prices | Sakshi
Sakshi News home page

'నకిలీ మద్యం' చెన్నై To విశాఖ!

Aug 1 2025 4:20 AM | Updated on Aug 1 2025 5:28 AM

Liquor being transported to Visakhapatnam in the name of Defense and sold at high prices

మద్యం మాఫియా

సాధారణ మద్యాన్ని ఖరీదైన బ్రాండ్‌ మద్యం సీసాల్లో నింపి రవాణా 

నకిలీ మద్యం సరఫరాలో ఆరితేరిన వెంకటేష్‌  పిళ్లై బృందం

ఖరీదైన ఖాళీ మద్యం సీసాల్లో పాండిచ్చేరి మద్యం నింపుతున్న చెన్నై ముఠా 

చెన్నై గ్యాంగ్‌తో అక్కయ్యపాలెంకు చెందిన పిళ్లై బృందం చెట్టాపట్టాల్‌ 

డిఫెన్స్‌ మద్యం పేరుతో విశాఖకు తరలిస్తూ అధిక ధరకు విక్రయం 

పోలీసులకు చిక్కిన వెంకటేష్‌ పిళ్లై చెన్నై ముఠాలోని మరో ఇద్దరు.. 

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం :  1000 ఎంఎల్‌.. ఫుల్‌ బాటిల్‌.. అంటే మద్యం ప్రియులకు పండగే. అందులోనూ డిఫెన్స్‌ బాటిల్‌ అంటే ఎంత ధర అయినా కొనుగోలు చేద్దామనే ఆలోచన!. ఇంట్లో పార్టీ ఉన్నా.. పండగ ఉన్నా... ఇంటికి బంధువులు, స్నేహితులు వస్తే డిఫెన్స్‌ బాటిల్‌ ఇచ్చి ఖుషీ చేద్దామనుకుంటారు.. సరిగ్గా దీన్నే పక్కాగా క్యాష్‌ చేసుకుంటోంది విశాఖ నగరంలోని అక్కయ్యపాలెంకు చెందిన వెంకటేష్‌ పిళ్లై టీం. చెన్నైలోని బర్మాకాలనీకి చెందిన ఓ టీం ఖరీదైన బ్రాండ్‌ మద్యం ఖాళీ సీసాలను సేకరించి.. అందులో మాములు బ్రాండ్‌ మద్యాన్ని నింపి.. ఖరీదైన మద్యంగా సరఫరా చేస్తోంది. 

వీరితో సంబంధాలు నెరుపుకుంటూ అక్కడ నుంచి మద్యాన్ని దిగుమతి చేసుకుంటూ విశాఖలో డిఫెన్స్‌ మద్యం పేరుతో విక్రయించి భారీగా దండుకుంటోంది వెంకటేష్‌ పిళ్లై బృందం. చెన్నై నుంచి ట్రావెల్స్‌ ద్వారా ఈ మద్యాన్ని తరలిస్తుండడం విశేషం. లావాదేవీలన్నీ ఫోన్‌ పే, బ్యాంక్‌ అకౌంట్ల ద్వారా నిర్వహిస్తుండటం గమనార్హం. ఇందులో ఇప్పటికే చెన్నైకు చెందిన ముగ్గురిలో ఇద్దరిని ఎక్సైజ్‌ పోలీసులు అరెస్టు చేశారు. వెంకటేష్‌ పిళ్‌లైను కూడా అరెస్టు చేసి జైలుకు తరలించారు. లోతుగా విచారించేందుకు నేటి నుంచి వెంకటేష్‌ పిళ్‌లైను ఎక్సైజ్‌ పోలీసులు కస్టడీలోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.  

బాటిలింగ్‌ యూనిట్‌ను ఏర్పాటుచేసుకొని.. 
చెన్నైలోని బర్మా కాలనీకి చెందిన ముఠా సభ్యులు పలు ప్రాంతాల నుంచి ఖరీదైన బ్రాండ్‌ మద్యం ఖాళీ సీసాలను సేకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపుగా అన్ని జిల్లాల నుంచి ప్రీమియం బ్రాండ్‌ ఖాళీ సీసాలను అక్కడకు తరలిస్తున్నారు. అనంతరం పాండిచ్చేరి నుంచి తక్కువ ధరకు లభించే మద్యాన్ని (సాధారణ ఇతర బ్రాండ్లు) తీసుకొచ్చి ఈ ఖాళీ సీసాల్లో నింపేస్తున్నారు. ఇందుకోసం బాటిలింగ్‌ యూనిట్‌ను అక్కడ ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది. అనంతరం ఆర్డర్లకు అనుగుణంగా ఆయా ప్రాంతాలకు వీటిని తరలిస్తున్నారు. 

తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన వెంకటేష్‌ పిళ్‌లై.. ఈ ముఠాతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి ఈ మద్యాన్ని ఇక్కడకు తరలిస్తున్నారు. అయితే వెంకటేష్‌ పిళ్లై గత 20 సంవత్సరాలుగా అక్కయ్యపాలెంలోనే నివాసం ఏర్పాటు చేసుకుని స్థిరపడ్డారు. అంతేకాకుండా అక్కడి నుంచి నకిలీ మద్యాన్ని తెచ్చిన తర్వాత.. కొన్నింటిలో నీటిని కూడా నింపి యథా­విధిగా సీల్‌ వేసి విక్రయిస్తున్నట్టు విచారణలో తేలింది.  

ఫోన్‌ పే, బ్యాంక్‌ అకౌంట్ల ద్వారానే లావాదేవీలు 
కోయంబత్తూరు నుంచి విశాఖకు 20 ఏళ్ల క్రితం వచ్చిన వెంకటేష్‌ పిళ్లై మొదటి నుంచీ ఈ నకిలీ మద్యం సరఫరాలో ఆరితేరారు. గతంలోనూ ఇతనిపై పలుసార్లు కేసులు నమోదయ్యాయి. చెన్నైకు చెందిన ఇషాక్, మహమ్మద్‌ నిస్సార్‌ అహమ్మద్‌తో పాటు మహమ్మద్‌ సాధిక్‌ భాష ఒకే కుటుంబానికి చెందినవారు. వీరు ఏపీలోని దాదాపు అన్ని జిల్లాల నుంచి ఖరీదైన మద్యం ఖాళీ సీసాలను సేకరిస్తున్నారు. 

ఆయా జిల్లాల్లో ఈ వ్యాపారం చేసే వారితో సంబంధాలు పెట్టుకుని.. చెన్నైలోని బర్మా కాలనీకి చెందిన తమకే విక్రయించేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. అక్కడి నుంచి ఖరీదైన మద్యం పేరుతో నింపిన బాటిల్స్‌ను తమకు వచ్చే ఆర్డర్లకు అనుగుణంగా ట్రావెల్స్‌ ద్వారా తరలిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఆర్డర్లకు అనుగుణంగా తమకు రావాల్సిన మొత్తాన్ని ఫోన్‌ పే, బ్యాంక్‌ అకౌంట్ల ద్వారానే లావాదేవీలు నిర్వహిస్తున్నారు.  

రూ.వెయ్యి తగ్గించామని కలరింగ్‌ ఇస్తూ.. 
1000 ఎంఎల్‌ బాటిల్‌ను రూ.500కే తయారుచేస్తున్న ఈ ముఠా రూ.4 వేలు చొప్పున విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. అంతిమంగా బయట మార్కెట్‌లో రూ.5 వేల విలువ చేసే బాటిల్‌ను రూ.4 వేలకే విక్రయిస్తున్నామంటూ నకిలీ మద్యాన్ని ఖరీదైన మద్యంగా అంటగడుతున్నారు. బయటి మార్కెట్‌ కంటే రూ.వెయ్యి ధర తగ్గడమే కాకుండా.. అంత సులువుగా దొరకని డిఫెన్స్‌ మద్యం తమకు వస్తోందని భావిస్తున్న కొందరు వెంకటేష్‌ పిళ్లై నుంచి ఆర్డర్లు పెట్టి మరీ తీసుకుంటుండటం గమనార్హం. 

తాజాగా అక్కయ్యపాలెంలో పట్టుబడిన ఈ మద్యాన్ని పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపగా.. ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించే పదార్థాలు కూడా ఇందులో కలిసి ఉన్నట్టు ల్యాబ్‌ నివేదికలో తేలింది. ఇందులో పాండిచ్చేరి మద్యంతో పాటు ఇంకా ఏమైనా రసాయనాలు కలుపుతున్నారా? అనేది కూడా తేలాల్సి ఉంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement