రాజకీయ దురుద్దేశాలతోనే పిటిషన్‌

Lawyer On behalf of CM Jagan filed counter petition In CBI special court - Sakshi

థర్డ్‌పార్టీకి పిటిషన్‌ వేసే అధికారం లేదని సుప్రీంకోర్టు చెప్పింది

వాస్తవాలను దాచి రఘురామ పిటిషన్‌ దాఖలు చేశారు

బ్యాంకులను మోసం చేశారంటూ ఆయనపై సీబీఐ కేసులున్నాయి

ప్రత్యేక కోర్టులో కౌంటర్‌ దాఖలు చేసిన జగన్‌ తరఫు న్యాయవాది

సాక్షి, హైదరాబాద్‌: ‘ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యక్తిగత ప్రయోజనాలతోను, రాజకీయ దురుద్దేశాలతోను నా బెయిల్‌ను రద్దు చేయాలంటూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇది చట్టప్రక్రియను దుర్వినియోగం చేయడమే..’ అని సీఎం వైఎస్‌ జగన్‌ సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. పిటిషన్‌ దాఖలు చేసిన తీరు, అందులో వాడిన భాష ఆయన దురుద్దేశాన్ని స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. అవాస్తవాలు, తప్పుడు ఆరోపణలు, అభూత కల్పనలతో ఈ పిటిషన్‌ దాఖలు చేశారని, ప్రత్యేక కోర్టు విధించిన బెయిల్‌ షరతులను తాను ఎప్పుడూ ఉల్లంఘించలేదని జగన్‌ తెలిపారు. సీఎం జగన్‌బెయిల్‌ను రద్దుచేయాలంటూ రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌పై జగన్‌ తరఫు న్యాయవాది జి.అశోక్‌రెడ్డి మంగళవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో కౌంటర్‌ దాఖలు చేశారు.

ఓ సాక్షిని జగతి పబ్లికేషన్స్‌ ఇంటర్వ్యూ చేసిందన్న కారణంగా 2017లో బెయిల్‌ రద్దుచేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు కొట్టివేసిందని తెలిపారు. జగన్‌ బెయిల్‌ షరతులను ఉల్లంఘించలేదని, ఆయన బెయిల్‌ను రద్దు చేయాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసిందన్నారు. కరోనా నియంత్రణలో భాగంగా సీఎం హోదాలో చర్యలు తీసుకోవాల్సి ఉన్నందునే కోర్టు విచారణకు హాజరుకాలేకపోతున్నానని, తాను హాజరుకాకపోయినా విచారణకు ఎక్కడా అంతరాయం కలగలేదని తెలిపారు. వ్యక్తిగత ద్వేషంతో రాజకీయంగా ప్రయోజనం పొందాలని దాఖలు చేసే ఈ తరహా పిటిషన్లు ఎంతమాత్రం విచారణార్హం కాదని పేర్కొన్నారు. అందువల్ల ఈ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు.

రఘురామ అనేక కేసుల్లో నిందితుడు
బెయిల్‌ రద్దుచేయాలని కోరే హక్కు థర్డ్‌పార్టీకి లేదని అనేక కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులిచ్చిందని తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు రోజువారీ పద్ధతిలో ఈ కేసులను విచారిస్తోందని, నిందితుల డిశ్చార్జ్‌ పిటిషన్లపై వాదనలు వింటోందని తెలిపారు. విచారణను జాప్యం చేస్తున్నారంటూ రఘురామ పేర్కొనడం కోర్టు ధిక్కరణకు పాల్పడమేనని పేర్కొన్నారు. రఘురామ వాస్తవాలను దాచి ఈ పిటిషన్‌ దాఖలు చేశారని తెలిపారు. ఆయనపై బ్యాంకుల నుంచి రుణంగా తీసుకున్న రూ.947.71 కోట్లకుపైగా ఎగ్గొట్టారనే తీవ్రమైన ఆరోపణలున్నాయని, సీబీఐ నమోదు చేసిన 2 కేసుల్లో నిందితుడని తెలిపారు.

ఆయనపై 7 క్రిమినల్‌ కేసులున్నాయని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ విధానాలకు విరుద్ధంగా వ్యవహరించినందున ఎంపీగా ఆయన్ని అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ గతేడాది లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసినట్లు కౌంటర్‌లో జగన్‌ వివరించారు. దీనిపై రిజాయిండర్‌ దాఖలు చేసేందుకు గడువు ఇవ్వాలని రఘు న్యాయవాదులు కోరడంతో విచారణను న్యాయమూర్తి ఈనెల 14కు వాయిదా వేశారు. కాగా, ఈ పిటిషన్‌పై చట్టప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని సీబీఐ ప్రత్యేక కోర్టులో మెమో దాఖలు చేసింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top