కనకదుర్గ ఫ్లై ఓవర్‌కు చివరి సామర్థ్య పరీక్షలు 

Last Fitness Tests On Kanakadurga Flyover In Vijayawada - Sakshi

భవానీపురం(విజయవాడ పశ్చిమ): ఈ నెల 18న ప్రారంభం కానున్న కనకదుర్గ ఫ్లై ఓవర్‌ సామర్థ్య పరీక్షలను మరోమారు నిర్వహించారు. నేషనల్‌ హైవే, ఆర్‌ అండ్‌ బీ అధికారులు ఇప్పటికే పలు పర్యాయాలు లోడ్‌ టెస్ట్‌లు నిర్వహించిన సంగతి విదితమే. మరో రెండు రోజుల్లో ఈ ఫ్లై ఓవర్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో చివరి సారిగా మంగళవారం సుమారు 216 పౌండ్ల బరువుతోకూడిన తొమ్మిది టిప్పర్లను ఫ్లై ఓవర్‌పై ఉంచారు. ఈ టిప్పర్లను సుమారు 106 గంటలపాటు అలానే ఉంచుతారని అక్కడ సిబ్బంది తెలిపారు. కాగా ఫ్లై ఓవర్‌ రోడ్‌లో సెంట్రల్‌ డివైడర్‌ పెయింటింగ్, జీబ్రా లైన్లు, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌తోకూడిన బోర్డ్‌ల ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. ఫిల్లర్‌కు ఫిల్లర్‌కు మధ్య జాయింట్లను కలుపుతూ తుది మెరుగులు దిద్దుతున్నారు.  

ఇంద్రకీలాద్రిపై వెండి రథంలో సింహాలు మాయం!
సాక్షి, విజయవాడ/ఇంద్రకీలాద్రి: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వేంచేసిన దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల వెండి రథంలో రెండు సింహాలు మాయమయ్యాయి. ఒక్కొక్క సింహం మూడు కిలోలకు పైగా బరువు ఉంటుందని దేవస్థాన సిబ్బంది చెబుతున్నారు. ఆది దంపతులను ఉగాది పర్వదినంతో పాటు చైత్రమాస బ్రహ్మోత్సవాల సందర్భంగా వెండి రథంపై నగర వీధుల్లో ఊరేగిస్తారు. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో ఉగాది ఊరేగింపును, చైత్రమాస బ్రహ్మోత్సవాలను రద్దు చేశారు. దీంతో వెండి రథం గురించి దేవస్థానం అధికారులు పట్టించుకోలేదు. ఇటీవల అంతర్వేది ఘటనతో రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో రథాలకు ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం తెలిసిందే.

ఈ నేపథ్యంలో దుర్గామల్లేశ్వరస్వామి వార్ల రథానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని నగర పోలీస్‌ కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు దేవస్థాన ఈవో ఎంవీ సురేష్‌బాబుకు సూచించారు. దీంతో మహా మండపం దిగువన దేవస్థాన సమాచార కేంద్రం వద్ద భద్రపరిచిన వెండి రథాన్ని ప్లాస్టిక్‌ పట్టాతో పూర్తిగా కప్పడం, ప్రత్యేకంగా షెడ్డు ఏర్పాటు చేసే పనులను మంగళవారం ప్రారంభించారు. ఈ క్రమంలోనే రథానికి ఉండాల్సిన నాలుగు వెండి సింహాలలో రెండు మాయమైనట్టు ఆలయ ఇంజినీరింగ్‌ సిబ్బంది గుర్తించారు. 

నివేదిక ఇస్తాం.. 
అమ్మవారి వెండి రథంలో ఉండే నాలుగు సింహాల్లో రెండు కనిపించలేదు. ఉత్సవాల అనంతరం వెండి సింహాలను భద్రపరిచి, వెండి రథానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత సెక్యూరిటీ సిబ్బందిదే.  వెండి సింహాల మాయంపై సమగ్రంగా పరిశీలన చేసి ప్రభుత్వానికి నివేదికిస్తాం. 
– ఎంవీ సురేష్‌బాబు, ఈవో  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top