త్వరలోనే రహదారుల నిర్మాణ పనులు మొదలు

Krishna Babu Says Speed Up Road Works Andhra Pradesh - Sakshi

బిడ్డింగ్ దశలో కూడా ఎన్డీబీ అభిప్రాయం తీసుకున్నాం

50 శాతం ఆక్యుపెన్సీతో సిటీ బస్సులు

అందుకే ఫ్లైఓవర్‌ ఓపెనింగ్‌ ఆగింది

రహదారులు, భవనాల ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు

సాక్షి, విజయవాడ: న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు (ఎన్‌డీబీ) అందించే రుణ సాయంతో రాష్ట్రంలో త్వరలోనే రహదారుల నిర్మాణ పనులు మొదలు పెడతామని రహదారులు, భవనాల ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు అన్నారు. టెండర్లను పారదర్శకంగా నిర్వహించేందుకు జ్యుడీషియల్ ప్రివ్యూకి పంపి త్వరలోనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పనులు మొదలు పెట్టకపోతే నిధులు సరెండర్ చేయాలని కేంద్రం నిబంధన పెట్టిందన్న కృష్ణబాబు... ఎన్ఐసి ప్లాట్‌ఫామ్ ద్వారా, గ్లోబల్ బిడ్డింగ్ ద్వారా టెండర్లు నిర్వహిస్తామని వెల్లడించారు. అయితే కొంతమంది కావాలనే దీని గురించి దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇ-టెండర్ తో పాటు 25 బిడ్స్ వచ్చాయని, ఇందుకు సంబంధించిన హార్డ్ కాపీలు కూడా అందాయని తెలిపారు. (చదవండి: రూ.2,978 కోట్లతో రోడ్లు)

అదే విధంగా బిడ్డింగ్ దశలో కూడా ఎన్‌డీబీ అభిప్రాయం తీసుకున్నామన్న కృష్ణబాబు, ప్రపంచ బ్యాంకు సూచించిన నిబంధనల మేరకే అర్హత ప్రమాణాలను నిర్దేశించినట్లు తెలిపారు. కేవలం జాతీయ బ్యాంకుల ద్వారా సదరు సంస్థలు లావాదేవీలు చేయాలన్న నిబంధన మాత్రమే జ్యుడీషియల్ ప్రివ్యూ లో సూచించారని, టెండర్ల విషయంలో ఎలాంటి సందేహాస్పద లావాదేవీలు జరగలేదని స్పష్టం చేశారు. బిడ్ల నుంచి రివర్స్ టెండర్ల వరకు సంబంధించిన ప్రక్రియ అంతా కూడా ఏపీ ప్రభుత్వంతో పాటు ఎన్‌డీబీ పర్యవేక్షణలో సాగిందన్నారు. అయితే బిడ్లు ఇంత తక్కువగా ఎందుకు దాఖలు అయ్యాయన్న విషయాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు.

అప్పుడే మళ్లీ రాయితీ వర్తింపజేస్తాం
విజయవాడ, వైజాగులో సిటీ బస్సులు రన్ చేస్తామని కృష్ణబాబు తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సీటీ బస్సులను తిప్పుతున్నామన్నారు. 50 శాతం ఆక్యుపెన్సీతోనే బస్సులను నడుపుతామని, అయితే భారీగా నష్టం చేకూర్చే అంశంగా ఉంటుందన్నారు. అలాగే బస్సుల్లో స్టాడింగుకు అనుమతించడం లేదని, అందుకే వృద్ధులు బస్సు ప్రయాణాలు చేయొద్దని సూచిస్తున్నామన్నారు. కానీ కొందరు అత్యవసర పరిస్థితులంటూ కొందరు వృద్ధులు వస్తున్నారని, వారి బస్‌ ప్రయాణాలను నిరుత్సాహాపరిచేందుకే బస్సుల్లో సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రాయితీలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలిపారు. అయితే సాధారణ పరిస్థితులు రాగానే సీనియర్ సిటీజన్లకు రాయితీని వర్తింపజేస్తామని కృష్ణబాబు పేర్కొన్నారు.(చదవండి: ఆర్టీసీ ఉన్నతాధికారుల సమావేశం)

అందుకే ఫ్లైఓవర్‌ ఓపెనింగ్‌ ఆగింది
కేంద్ర మంత్రి గడ్కరీకి కరోనా కారణంగా ఫ్లైఓవర్ ఓపెనింగ్ ఆగిందని కృష్ణబాబు వెల్లడించారు. గడ్కరీ ప్రారంభించాకే ఫ్లైఓవర్ పై రాకపోకలకు అనుమతిస్తామని తెలిపారు. ఇక అంతర్‌రాష్ట్ర సర్వీసుల గురించి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం బస్ సర్వీసులను పెంచడానికి ఇష్టపడడం లేదని, ఏపీని తగ్గించుకోమని సూచిస్తోందన్నారు.  తెలంగాణ సూచనల మేరకు సర్వీసులను తగ్గించుకోవవడానికి సిద్దంగా ఉన్నా, ఏపీ తగ్గించుకునే 1.10 లక్షల కిలోమీటర్ల మేర రవాణను ప్రైవేట్ ఆపరేటర్లకు అవకాశం లభిస్తుందన్నారు. ‘‘ఏపీ తిప్పే సర్వీసుల కంటే డబుల్ సర్వీసులు తిప్పుతామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. అయితే బెజవాడ-హైదరాబాద్ రూట్లో మాత్రమే డబుల్ సర్వీసులు తిప్పుతానంటోన్న తెలంగాణ.. మిగిలిన రూట్ల గురించి ప్రస్తావించడం లేదు’’ అని కృష్ణబాబు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top