
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రహదార్లకు మహర్దశ పట్టనుంది. తొలిదశ విస్తరణ పనులకు ప్రభుత్వం రూ.2,978.51 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో 1,243.51 కిలోమీటర్ల మేర రాష్ట్ర, జిల్లా రహదార్లను అభివృద్ధి చేయనున్నారు. ఈ పనులకు సంబంధించి 70 శాతం నిధులు న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్‌డీబీ) రుణ సహాయం అందిస్తుండగా 30 శాతం రాష్ట్ర ప్రభుత్వంభరించనుంది.
► అన్ని జిల్లాల్లో కలిపి 33 ప్యాకేజీల కింద రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనులు. 17 ప్యాకేజీల కింద 696.75 కి.మీ. విస్తరణకు రూ.1,746.84 కోట్లు, భూ సేకరణకు రూ.19.27 కోట్లు. మొత్తం రూ.1,766.11 కోట్లు
► 16 ప్యాకేజీల కింద 546.76 కి.మీ. విస్తరణకు రూ.1,200.79 కోట్లు, భూ సేకరణకు 11.61 కోట్లు కలిపి మొత్తం రూ.1,212.40 కోట్లు
► ఎన్‌డీబీ అందిస్తున్న రుణ సాయం రూ.6,400 కోట్ల నుంచి రూ.8,800 కోట్లకు పెంచేందుకు ఆర్‌అండ్‌బీ కసరత్తు
► ఎన్‌డీబీ రుణ సాయంతో సుమారు 3,100 కిలోమీటర్ల మేర రహదార్లు అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక టెండర్ల పారదర్శక నిర్వహణకు జ్యుడీషియల్ ప్రివ్యూ
రాష్ట్రంలో రూ.100 కోట్లు పైబడిన ఏ ప్రాజెక్టు అయినా పూర్తి పారదర్శకతతో నిర్వహించేందుకు టెండర్ డాక్యుమెంట్లను జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపుతున్నారు. రహదారుల అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్ డాక్యుమెంట్లను గత నెల 28న జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపించారు. పారదర్శకత కోసం ప్రజలు, కాంట్రాక్టర్ల నుంచి అభ్యంతరాలు, సూచనలు, సలహాలు స్వీకరించేందుకు ఈ నెల 3వ తేదీతో గడువు ముగిసింది. టెండర్ల స్వీకరణకు ఈ నెల 30వ తేదీ తుది గడువుగా ఆర్‌అండ్‌బీ పేర్కొంది. జ్యుడిషియల్ ప్రివ్యూ అనుమతులతో టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లను ఖరారు చేస్తారు.