అన్యాక్రాంతమైన ఆలయ భూములపై ప్రత్యేక దృష్టి

Kottu Satyanarayana says Special focus on alienated temple lands - Sakshi

వాటిని తిరిగి రాబట్టేందుకు చర్యలు 

దేవదాయ శాఖ అధికారులతో ఆ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ

సాక్షి, అమరావతి/తాడేపల్లిగూడెం: రాష్ట్రంలో అన్యాక్రాంతమైన దేవదాయశాఖకు చెందిన భూములను తిరిగి రాబట్టే విషయంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని డిప్యూటీ సీఎం, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. జిల్లాల పునర్విభజన అనంతర పరిస్థితులపై అన్ని జిల్లాల దేవదాయ శాఖ అధికారులకు బుధవారం తాడేపల్లిలోని దేవదాయ శాఖ ట్రైనింగ్‌ కేంద్రంలో ఒక్క రోజు ఓరియంటేషన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో ఆయన వర్చువల్‌గా మాట్లాడారు. దేవదాయ శాఖకు రాష్ట్రంలో సుమారు నాలుగు లక్షల ఎకరాలకు పైగా భూములున్నాయని, వాటిలో 1.05 లక్షల ఎకరాలు అన్యాక్రాంతమైనట్టు చెప్పారు.

ఈ భూములకు సంబంధించి మూడు వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఆ కేసుల విషయంలో ఆక్రమణదారులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఎప్పటికప్పుడు తగిన సమాచారాన్ని కోర్టుల ముందుంచాలన్నారు. భూముల విషయంలో కోర్టు కేసుల ప్రగతి ఎలా ఉందనే విషయంపై ప్రతి మూడు నెలలకోసారి, రాష్ట్రంలో ఆలయాల పరిస్థితిపై ప్రతి శుక్రవారం సమీక్ష నిర్వహిస్తామని మంత్రి వివరించారు.

భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉండే దేవదాయ శాఖపై లేని పోని అబద్ధాలతో బురదజల్లేందుకు ప్రతిపక్షాలు కాచుకుకూర్చున్నాయని, ఏ చిన్న పొరపాట్లకూ తావివ్వకుండా బాధ్యతగా పనిచేయాలని ఆదేశించారు.  ప్రస్తుత వేసవిలో భక్తులు ఇబ్బంది పడకుండా క్యూలైన్లలో నీడ ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశించారు. దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌ తదితరులు పాల్గొన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top