వివాదాస్పద కొఠియాలో.. పంచాయతీలు ఏకగ్రీవం

Kotia Area AP Border Two Villages Unanimous In Local Body Election At Srikakulam - Sakshi

ఫంగుణ సినారి సర్పంచ్‌గా కుసుమ, గంజాయి పొదర్‌ సర్పంచ్‌గా దినకర గమేల్‌ ఎన్నిక 

జయపురం: ఏఓబీ(ఆంధ్రా–ఒడిశా బోర్డరు) కొఠియాలో ఏపీ నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికల్లో ఇక్కడి గంజాయి పొదర్, ఫంగుణ సినారి గ్రామపంచాయితీలు ఏకగ్రీవమయ్యాయి. ఈ క్రమంలో ఫంగుణ సినారి గ్రామపంచాయతీ సర్పంచ్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన కున్నేటి కుసుమ, గంజాయి పొదర్‌ సర్పంచ్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన దినకర గమేల్‌ సర్పంచ్‌ల ఎంపిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. వాస్తవానికి కొఠియాని ఓ గ్రామపంచాయతీగా ఒడిశా ప్రభుత్వం ఏర్పాటు చేయగా, ఏపీ ప్రభుత్వం ఇదే ప్రాంతాన్ని 3 గ్రామపంచాయతీలుగా విభజించి, ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇదే ప్రాంతం విషయంలో ఉభయ రాష్ట్రాలు తమ ప్రాంతమంటే తమదని గొడవపడుతున్న విషయం తెలిసిందే.

కొఠియా సర్పంచ్‌ని సత్కరిస్తున్న దృశ్యం 
ఏపీని అడ్డుకుంటాం.. 
కొరాపుట్‌: వివాదాస్పద కొఠియా పంచాయతీలో ఏపీ(ఆంధ్రప్రదేశ్‌) చొరబాటుని అడ్డుకుంటామని రాష్ట్ర ఔళి శాఖ మంత్రి పద్మినీ దియాన్‌ తెలిపారు. స్థానిక సద్భావన సమావేశ మందిరంలో కొరాపుట్‌ జిల్లా సంబాదిక సంఘ వార్షిక సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ‘కరోనా పొరే సమాజ్‌’( కరోనా తర్వాత సమాజం)అనే అంశంపై స్పందిస్తూ కరోనా కట్టడి చర్యల్లో మీడియా ప్రతినిధుల సేవలు ప్రశంసనీయమన్నారు. ఈ నేపథ్యంలో వారిని కరోనా యోధులుగా పరిగణించి సత్కరించాలన్నారు. ప్రాణ భయం వీడి, కరోనా వైరస్‌ వ్యాప్తిపై వార్తలు సంగ్రహిస్తూ ప్రజలను చైతన్యం చేశారని వివరించారు.

అలాగే కొఠియా పంచాయతీ బౌగోళిక స్థితిగతులు, అక్కడి ప్రజల భాష, సంస్కృతీ, సంప్రదాయాలన్నీ కొరాపుట్‌ జిల్లా ఆదివాసులకు చెందినవని, ముఖ్యమంత్రి కొఠియా పంచాయతీని కాపాడుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. ఆ పంచాయతీ సమగ్ర అభివృద్ధికి అత్యధిక నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తోందన్నారు. కార్యక్రమంలో భాగంగా పాత్రికేయులను మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు సన్మానించారు. సమావేశంలో జిల్లా బీజేడీ అధ్యక్షుడు ఈశ్వరచంద్ర పాణిగ్రాహి, ఎమ్మెల్యేలు రఘురాం పడాల్, ప్రభు జని, పీతం పాఢి, తారాప్రసాద్‌ బాహిణీపతి పాల్గొన్నారు.  

చదవండి: ఏకగ్రీవాల నుంచే అదే ట్రెండ్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top