ఎస్‌ఈసీ ఉత్తర్వులు నిలిపేయండి

Kodali Nani has approached the AP High Court - Sakshi

హైకోర్టును ఆశ్రయించిన మంత్రి కొడాలి నాని

కమిషన్‌ ఉత్తర్వులు నా హక్కులను హరిస్తున్నాయి

నేనిచ్చిన వివరణను పరిగణనలోకి తీసుకోలేదు

వ్యాఖ్యలు చేశానంటున్న కమిషన్‌ ఆ ఆధారాలు ఇవ్వడంలేదు

అవి రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించండి

పిటిషన్‌ నేడు విచారించే అవకాశం

సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలు ముగిసే రోజైన ఈనెల 21 వరకు తనను మీడియాతో మాట్లాడకుండా నిరోధిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ శుక్రవారం జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల కమిషనర్‌ జారీచేసిన ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని, ఏకపక్షమైనవని ప్రకటించి, వాటిని కొట్టేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో శనివారం హౌస్‌మోషన్‌ రూపంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం తేలేంత వరకు మీడియాతో మాట్లాడకుండా ఎస్‌ఈసీ ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని అభ్యర్థించారు. ఇందులో ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి, కృష్ణాజిల్లా కలెక్టర్, పోలీస్‌ కమిషనర్, కృష్ణాజిల్లా ఎస్పీ (గ్రామీణ)లను ప్రతివాదులుగా చేర్చారు. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు ఆదివారం విచారించే అవకాశం ఉంది. పిటిషన్‌లో కొడాలి నాని ఏం పేర్కొన్నారంటే..

ఆధారాలు చూపకుండా నోటీసు
‘ఎన్నికల కమిషనర్‌ను కించపరిచేలా, కమిషన్‌ స్థాయిని తగ్గించేలా మాట్లాడానని, దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి నాకు షోకాజ్‌ నోటీసు ఇచ్చారు. కమిషన్‌కు సంతృప్తి కలిగించేలా బహిరంగంగా వివరణ ఇవ్వాలన్నారు. వేటి ఆధారంగా నాకు షోకాజ్‌ నోటీసు ఇచ్చారో ఆ ఆధారాలను నాకు ఇవ్వలేదు. అయినా.. నాకిచ్చిన తక్కువ సమయంలోనే నేను వివరణ ఇచ్చాను. ఎన్నికల కమిషన్‌ స్థాయిని తగ్గించేలా నేను వ్యాఖ్యలు చేయలేదని.. రాజ్యాంగ వ్యవస్థలపట్ల నాకు గౌరవం ఉందన్న విషయాన్ని తెలియజేశాను. కానీ, నా వివరణను పరిగణనలోకి తీసుకోకుండా విస్మయకరంగా ఈ నెల 21 వరకు నన్ను మీడియాతో మాట్లాడకుండా నిరోధిస్తూ ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి ఉత్తర్వులిచ్చారు. సభలు, సమావేశాల్లో కూడా మాట్లాడకూడదని ఆంక్షలు విధించారు. దీంతో రాజ్యాంగం నాకిచ్చిన భావప్రకటన స్వేచ్ఛను హరించినట్లయింది. అంతేకాక.. నాపై కేసు పెట్టాలని ఎస్పీని ఆదేశించారు. కానీ, ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని పునరుద్ఘాటిస్తున్నా’.. అని మంత్రి వివరించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top