ఖాదర్‌పల్లె టూ గల్ఫ్‌.. పట్టణాన్ని తలపించేలా గ్రామం

Khaderpalli Village In YSR District Now Looks Like A Town - Sakshi

నాడు కూలీలు.. నేడు మధ్య తరగతి కుటుంబీకులు

ఇంటింటికి ఒకరిద్దరు చొప్పున గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి

మారిన ఖాదర్‌పల్లె స్థితిగతులు.. ఏడాది పొడవునా 300 మంది గల్ఫ్‌లో పనులు

ఆదర్శంగా రూ.కోటితో మసీద్‌ నిర్మాణం

ఖాదర్‌పల్లె.. ఈ ఊరి వాసులు కూలీలుగా ఉంటూ కష్టాలు అనుభవించారు. చాలీ చాలని డబ్బుతో ఇబ్బందులు పడ్డారు. ఇక ఇక్కట్ల జీవితం వద్దనుకున్నారు. ఇల్లు విడిచి అయినా సంపాదన పెంచుకోవాలనుకున్నారు. గ్రామం వదిలి గల్ఫ్‌ బాట పట్టారు. మెరుగైన ఉపాధి ఎంచుకున్నారు. ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. ధీమాగా సొంతూరిలో చక్కటి ఇళ్లు కట్టుకున్నారు. అందరూ కలసి ఆధ్యాత్మికత ఉట్టిపడేలా మసీద్‌ను నిర్మించుకున్నారు. కుటుంబీకులకు ఆసరాగా ఉంటున్నారు. ఇప్పుడు ఖాదర్‌పల్లె గ్రామాన్ని పట్టణాన్ని తలపించేలా తీర్చిదిద్దారు.    

ఇక్కడ కన్పిస్తున్న వ్యక్తి పేరు చాంద్‌ గారి మహమ్మద్‌ హనీఫ్‌.  పదేళ్లుగా సౌదీలో జీననోపాధి పొందుతున్నాడు. ఫర్నిచర్‌ కంపెనీలో పని చేస్తున్నాడు. ప్రతి మూడేళ్లకొకసారి స్వగ్రామానికి వచ్చి వెళతాడు. రూ.15 వేల వేతనంతో పనిలో చేరిన హనీఫ్‌కు ప్రస్తుతం రూ.40 వేలకుపైగా నెల వేతనం వస్తోంది. గతంలో మాదిరి కాకుండా ఇప్పుడు ఫోనులో కుటుంబీకులందరితో వీడియో కాల్‌లో మాట్లాడుకుంటూ ఆనందంగా పనులు చేసుకుంటున్నట్లు తెలిపాడు. 
 
ఈ యువకుడి పేరు ఇలియాస్‌. రెండేళ్ల క్రితం సౌదీ వెళ్లాడు. కారు మెకానిక్‌గా పని చేస్తున్నాడు. నెలకు రూ.28 వేలు జీతం వస్తోందని.. ప్రతి ఏటా జీతం పెంచుతారని.. ఐదేళ్ల వరకూ పని చేసుకుని కుటుంబం కోసం సంపాదించుకుని వస్తానని చెబుతున్నాడు. కొత్తలో కొంచెం అయిష్టంగా ఉండేదని ఇక్కడ మా ఊరోళ్లందరూ ఉండటం వలన ప్రతి వారం కలుసుకుంటామని.. ఇప్పుడు ఆనందంగా పని చేసుకుంటున్నానని తెలుపుతున్నాడు. 
 
ఈ  యువకుడి పేరు కందనూరు మహమ్మద్‌. కువైట్‌లోని ఓ ఆటో స్పేర్‌ పార్ట్స్‌ దుకాణంలో సేల్స్‌మెన్‌గా పని చేస్తున్నాడు. రెండేళ్ల క్రితం వెళ్లాడు. ప్రస్తుతం నెలకు రూ.40 వేలు వేతనం పొందుతున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బయటి దేశంలో ఉన్నామనే ఫీలింగ్‌ లేకుండా ఉందని, ఇక్కడ మా సీనియర్లు చాలా మంది ఉన్నారని దీంతో ఆనందంగా పని చేస్తుకుంటున్నామని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. 

చాపాడు(వైఎస్సార్‌ జిల్లా) : మండల కేంద్రమైన చాపాడుకు 4 కిలోమీటర్ల దూరంలో కుందూనది ఒడ్డున ఖాదర్‌పల్లె గ్రామం ఉంది. ఈ ఊరి ప్రజలు గతంలో కూలీలుగా ఉంటూ ఎన్నో కష్టాలు పడ్డారు.  మెరుగైన ఉపాధి కోసం అయినవారిని .. ఉన్న ఊరిని వదిలి  గల్ఫ్‌ దేశాలకు పయనమయ్యారు.  కువైట్, సౌదీ అరేబియా,  ఖత్తర్, దుబా యి, మస్కట్‌ గల్ఫ్‌ దేశాలతో పాటు సింగ్‌పూర్‌ వంటి దేశాల్లో పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. 

ఈ గ్రామంలో 1499 మంది ఓటర్లు, 540 కుటుంబాలు ఉన్నాయి. వీరిలో 20 కుటుంబాలు యాదవులు కాగా మిగిలిన వారంతా ముస్లింలే ఉండడం విశేషం.  ముస్లింలతోనే గ్రామం మొదలు కాగా క్రమంగా యాదవులు ఇక్కడకు వచ్చారు. ప్రస్తుతం గ్రామంలోని ప్రతి ఇంటికి ఒకరిద్దరు చొప్పున గల్ఫ్‌ దేశాలకు వెళ్లి వచ్చిన వారే ఉన్నారు. మొదటి సారి వెళ్లిన వారు మూడేళ్లు ఆపై ఉండగా, ఇప్పటికే అనుభవం ఉన్న వారు ఏడాదికి రెండేళ్లకు ఒక సారి స్వ గ్రామాలకు వచ్చి వెళుతుంటారు. ఈ క్రమంలో ఏడాది పొడవునా 300 మంది గల్ఫ్‌ దేశాల్లో ఉండగా మిగిలిన 200 మంది వచ్చి వెళుతుంటారు.  

1978లో ఒక్కడితే మొదలై..   
ఖాదర్‌పల్లె గ్రామానికి చెందిన మహమ్మద్‌ దౌలా అనే వ్యక్తి 1978లో ఉపాధి కోసం బాంబెకు వెళ్లారు. అక్కడే నాలుగేళ్లు ఉండి కువైట్‌ బాట పట్టాడు. ఆయనతో మొ దలైన గల్ఫ్‌ ప్రయాణం నేటి వరకూ కొనసాగుతోంది. చదివిన చదువుకు ఎంచుకున్న ఉద్యోగాల్లో అతి తక్కు వ మంది ఉండగా.. 90 శాతం మంది వివిధ పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు.  

బంగారు పని, అన్ని రకాలైన మెకానిక్‌ పనులు, ఫర్నిచర్‌ తయారీ, డ్రైవింగ్, టైలరింగ్, ఇంటి పనులు, బే ల్దారి పనులు ఇలా అనేక రకాలైన పనులు చేస్తున్నారు. 95 శాతం మంది పురుషులే గల్ఫ్‌ దేశాలకు వెళ్లగా 5 శా తం మంది మాత్రమే మహిళలు గల్ఫ్‌లో ఉపాధి పొందుతున్నారు. కూలీ పనులు చేసుకునే కుటుంబాల వా రు నేడు గల్ఫ్‌ దేశాల్లో నెలకు రూ.30 వేల నుంచి రూ.2 లక్షల వరకూ జీతాలు పొందుతున్నారు. జీతానికి వెళ్లేవారితో పాటు అక్కడే సొంతంగా పని చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తున్నారు. నాడు బోద కొట్టాలతో ఉన్న ఖాదర్‌పల్లె  ప్రస్తుతం ప్రతి కుటుంబం అత్యాధునికంగా మంచి బిల్డింగ్‌లను నిర్మించుకున్నారు. జీవించేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 95 శాతం కుటుంబాల వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

  

మసీద్‌ నిర్మాణం.. 
గ్రామంలో ముస్లింలందరూ  డబ్బులు సమకూర్చుకుని కోటి రూపాయలతో ఇటీవల ఆదర్శంగా మసీద్‌ను నిర్మించుకున్నారు. గ్రామ ప్రజలు ఒక్కో కుటుంబం నుంచి రూ.20 వేల నుంచి రూ.5 లక్షల వరకూ మసీద్‌ కోసం డబ్బులు ఇచ్చారు. వీరి ఆధ్యాత్మిక బాట ఆదర్శంగా నిలుస్తోంది. 

మా కుటుంబంలో ముగ్గురు సౌదీకి వెళ్లారు  
మా కుటుంబంలో మొదట్లో నేను రెండేళ్లు సౌదిలో పని చేసి వచ్చాను. తర్వాత నా కొడుకు, తమ్ముడు, తమ్ముడి కొడుకు సౌదికి వెళ్లారు. నా కొడుకు పదేళ్లకు పైగా ఉండి వచ్చాడు. ప్రస్తుతం తమ్ముడు, తమ్ముడి కొడుకు ఓ ప్రైవేటు కంపెనీలో సూపర్‌వైజర్లుగా పని చేస్తున్నారు.  అక్కడికి వెళ్లి రావటం వల్లనే మా కుటుంబాలు అభివృద్ధి చెందాయి. మొదట్లో  కూలి పనులు చేసుకునే వాళ్లం. ఇప్పడు సంతోషంగా జీవిస్తున్నాం.     
– సయ్యద్‌ నూర్, 
ఖాదర్‌పల్లె వాసి, చాపాడు మండలం 

 
18 ఏళ్లు కువైట్‌లో పని చేశా 
1985లో కువైట్‌ వెళ్లాను. యువకుడిగా పదేళ్ల పాటు కారు డ్రైవర్‌గా పని చేశాను. తర్వాత 1996లో వెళ్లి 2008లో వచ్చాను. 18 ఏళ్ల పాటు కారు డ్రైవర్‌తో పాటు ఇతర పనులు కూడా చేశాను. 2008లో ఇండియాకు వచ్చి  2009లో  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరాను. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పార్టీలో ఉన్నాను. మా గ్రామంలో ప్రతి ఇంటి నుంచి గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన వారే ఉన్నారు.  
 – బొలెరో బాషా, వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి, ఖాదర్‌పల్లె  

గల్ఫ్‌ దేశాలతోనే మా గ్రామం అభివృద్ధి 
1962 లో  ఖాదర్‌ అనే వ్యక్తి వ్యవసాయ కూలీగా వలస వచ్చి గ్రామాన్ని ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచి క్రమేపి పెరిగిన గ్రామంలో అందరూ వ్యవసాయ పనులు చేసుకుని జీవించే వారే. బతికేందుకు ఇబ్బందులు పడేవారు. అప్పట్లో 30 ఏళ్ల  పాటు సర్పంచ్‌గా ఉన్న ఖాసీం పీరా గ్రామాభివృద్ధి కోసం పాటు పడ్డాడు. మహమ్మద్‌ దౌలా అనే వ్యక్తి తీసుకున్న నిర్ణయంతో 1972 నుంచి గ్రామంలోని ప్రజలు ఒక్కొక్కరుగా గల్ఫ్‌ దేశాల బాట పట్టారు.  
 – వడ్ల జైనుల్లా, గ్రామ సర్పంచ్‌ 
షమీష్‌ భాను భర్త, ఖాదర్‌పల్లె 

మరిన్ని వార్తలు :

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top