
సుమారు 50 మందికి పైగా వాంతులు, విరేచనాలు
బాధితుల్లో గర్భిణులు, బాలింతలు, హృద్రోగులు
తెనాలి జేఎంజే మహిళా కళాశాలలో ఘటన
తెనాలి అర్బన్: శిక్షణ నిమిత్తం వచ్చిన కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం ఉపాధ్యాయినులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా తెనాలిలో బుధవారం రాత్రి జరిగింది. సర్వశిక్షాఅభియాన్ అధికారుల కథనం ప్రకారం..రాష్ట్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేస్తున్న ఆర్ట్స్ ఉపాధ్యాయినులు సుమారు 200 మంది శిక్షణలో భాగంగా సోమవారం ఉదయం తెనాలి జేఎంజే మహిళా కళాశాలకు చేరుకున్నారు. వీరందరికీ సర్వశిక్షాఅభియాన్ అధికారులు అదే కళాశాల ఆవరణలో వసతి ఏర్పాటుచేశారు.
వారికి ప్రతిరోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రికి భోజనం అందిస్తూ వచ్చారు. బుధవారం రాత్రి కూడా ఉపాధ్యాయినులందరూ భోజనం చేశారు. అయితే, భోజనంలో బల్లి కనిపించిందని వారు ‘సాక్షి’కి తెలిపారు. అనంతరం.. వారిలో 50 మందికి పైగా వాంతులు, విరేచనాలు అయినట్లు తెలిసింది. అస్వస్థతకు గురైన వారిలో బాలింతలు, గర్భిణులు, హార్టు పేషెంట్లు ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అధికారులు ట్యాబ్‌లెట్లు ఇచ్చి సరిపుచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
కానీ, వారిలో 10 మందికి వాంతులు, విరేచనాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రత్యేక అంబులెన్స్‌లో వైద్యశాలకు తరలించారు. దీనిపై సర్వశిక్షాఅభియాన్ రాష్ట్ర అధికారి రవీంద్రారెడ్డిని ‘సాక్షి’ సంప్రదించగా ఉపాధ్యాయినులు స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. వారికి మెరుగైన వైద్యం అందిచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.