విషం పెట్టి ఆ గుర్రాలను చంపేశారు!   

Karnataka Farmers Kill Horses for Destroying Crops - Sakshi

పత్తికొండ (కర్నూలు): పంటలు నాశనం చేస్తున్నాయని కర్ణాటక ప్రాంత రైతులు గుర్రాలకు విషం పెట్టి చంపేసినట్లు తేలింది. మండల పరిధిలోని పందికోన అటవీ ప్రాంతంలో ఏడు గుర్రాల కళేబరాలు బుధవారం వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఈ మేరకు పోలీసులు దూదేకొండ గ్రామానికి చెందిన మల్లికార్జునను అదుపులోకి తీసుకుని కర్ణాటక పోలీసు స్టేషన్, ఆ గ్రామసర్పంచ్‌ను విచారించగా వాస్తవాలు వెలుగు చూశాయి. సీఐ ఆదినారాయణరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.  సంఘటన స్థలం పరిశీలన మేరకు కళేబరాలను ట్రాక్టర్‌ ద్వారా తీసుకొచ్చి పడేసినట్లుగా తెలిసిందన్నారు. ఈకోణంలో దూదేకొండ మల్లికార్జునను విచారించాం.

రాయచూరు జిల్లాలోని కంపిలి కొట్టాలలో గత కొన్ని నెలల కింద పొలాల్లో పడి గుర్రాలు తమ పంటలను పాడుచేస్తుండటంతో అక్కడి ప్రాంత రైతులు గుర్రాలకు విషాహారాన్ని ఇచ్చినట్లు తెలిసింది. దూదేకొండకు చెందిన మల్లికార్జున తరచూ ఆ ప్రాంతం నుంచి తీసుకొచ్చిన గుర్రాలను స్వామి గుర్రాలుగా దర్గాలకు ఇస్తుంటారు. ఆ విషయం తెలియని దూదేకొండ వాసి గుర్రాలను ఎప్పటిలాగానే వాహనంలో ఇక్కడికి తీసుకొస్తుండగా మార్గమధ్యలో మూడు గుర్రాలు మృత్యువాత పడ్డాయి. మిగిలిన నాలుగు సైతం పత్తికొండకు చేరేలోగా మృతి చెందాయ. దీంతో వాటిని పందికోన అటవీప్రాంతానికి తెచ్చి పడేశారు. పోలీసుల దర్యాప్తులో వాస్తవాలు వెలుగుచూశాయి. పంచాయతీ సిబ్బంది సాయంతో గుర్రాలను పూడ్చిపెట్టినట్లు సీఐ తెలిపారు.   

చదవండి: (మద్యం మత్తులో యువతి కారుతో బీభత్సం.. సెకన్ల వ్యవధిలోనే)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top