
కేసును నీరు గార్చేందుకే సిట్ ఏర్పాటు
వాస్తవాల సమాధి కోసమే గతంలోనూ ‘సిట్’లు
చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే సీబీఐ దర్యాప్తు కోరాలి
రాష్ట్రంలో యథేచ్ఛగా నకిలీ మద్యం తయారీ
పరిశ్రమల మాదిరిగా ఉత్పత్తి చేస్తున్న టీడీపీ నేతలు
పెదబాబు, చినబాబు కనుసన్నల్లోనే ఈ దందా
‘సిట్’ అనేది చంద్రబాబు జేబులో ఉండే టీమ్
అలాంటప్పుడు ఈ కేసులో వారేం నిగ్గు తేలుస్తారు?
మాజీ మంత్రులు నారాయణస్వామి, కాకాణి
సాక్షి, అమరావతి: నకిలీ మద్యం తయారు చేసి రాష్ట్రమంతటా యథేచ్ఛగా సరఫరా చేస్తున్న టీడీపీ నేతలు పూర్తి ఆధారాలతో పట్టుబడినా... ఇప్పటివరకు నోరు మెదపని సీఎం చంద్రబాబు హఠాత్తుగా ఈ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్‌సీపీ నేతలు, మాజీ మంత్రులు కె.నారాయణస్వామి, కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆక్షేపించారు.
ఆదివారం మాజీ మంత్రులిద్దరూ సంయుక్త ప్రకటన చేస్తూ.. కేవలం నిజాలను సమాధి చేయడానికి, కేసును నీరుగార్చడం కోసమే సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని వారు స్పష్టం చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి చంద్రబాబు వేసిన ‘సిట్’లన్నీ కేవలం కక్షసాధింపు కోసం లేదా వాస్తవాలు బయటకు రాకుండా చేయడం కోసమేనని వారు గుర్తు చేశారు. ఆ ప్రకటనలో నారాయణస్వామి, కాకాణి ఏమని పేర్కొన్నారంటే..
పరిశ్రమల మాదిరిగా..
‘రాష్ట్రంలో ఇంత విచ్చలవిడిగా.. పరిశ్రమల్లా యంత్రాలు పెట్టి నకిలీ మద్యం తయారు చేస్తున్న టీడీపీ నేతలు దాన్ని రాష్ట్రమంతా సరఫరా చేస్తూ పక్కా ఆధారాలతో పట్టుబడ్డారు. నకిలీ మద్యానికి ఇప్పటికే పలువురు బలయ్యారు. అందుకే నకిలీ మద్యంపై నిజాలు నిగ్గు తేల్చేందుకు సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. మరి దానికి సీఎం చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు? నిజానికి ‘సిట్’ అనేది చంద్రబాబు జేబులోని సంస్థ. మేం డిమాండ్ చేస్తున్నట్టుగా సీబీఐ దర్యాప్తు కోరకుండా, సిట్ ఏర్పాటు చేయడమంటే.. తాము తప్పు చేశామని చంద్రబాబు అంగీకరించినట్లే కదా?రాష్ట్రంలో ఇప్పుడు నకిలీ మద్యం అనేది ఏదో ఒకచోట మాత్రమే బయటపడటం లేదు.
దాన్ని పక్కాగా వ్యవస్థీకృతంగా లిక్కర్ మాఫియా నడుపుతోంది. ఆ మాఫియాలో ఉన్న వారంతా టీడీపీ నాయకులే. నిజానికి పెదబాబు, చినబాబు కనుసన్నల్లోనే నకిలీ మద్యం దందా కొనసాగుతోంది. తన హయాంలో అంత యథేచ్ఛగా నడుస్తున్న ఆ రాకెట్‌పై తానే సిట్ వేయడం హాస్యాస్పదం. నిజానికి ములకలచెరువు ఘటన తర్వాత రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క వైన్‌షాపుపై కూడా ఎక్సైజ్ అధికారులు దాడి చేయలేదు. పరి్మట్ రూమ్‌లు, బెల్టు షాప్‌లను కనీసం తనిఖీ చేయలేదు. అంటే ఏ స్థాయిలో ఈ నకిలీ మద్యం మాఫియా నడుపుతున్నారో స్పష్టమైంది. ఇంత జరిగినా ఇప్పుడు కూడా గత మా ప్రభుత్వంపైనే చంద్రబాబు బురద చల్లుతున్నారు. చంద్రబాబు ఇప్పుడు చెబుతున్న క్యూఆర్ కోడ్, స్కానింగ్ వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు అమలు చేశారు. అప్పుడు ప్రభుత్వమే వైన్‌షాపులు నడపడం వల్ల ఎక్కడా అక్రమాలకు తావు లేకుండా పోయింది.
కానీ, చంద్రబాబు సీఎం అయ్యాక గత ప్రభుత్వ మద్యం విధానాలన్నింటినీ రద్దు చేసి మద్యం షాపులన్నిటినీ ప్రైవేటుపరం చేశారు. వాటన్నింటినీ తన మాఫియా ముఠా చేతుల్లో పెట్టారు. తమ పార్టీ వారికే మద్యం షాపులు కట్టబెట్టి, వాటికి పర్మిట్ రూమ్‌ల ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. చివరకు బెల్టు షాపులను కూడా మద్యం మాఫియా చేతుల్లో పెట్టారు. అంటే నకిలీ మద్యం వాళ్లే తయారు చేస్తారు. వాళ్ల మద్యం షాపులు, బెల్టుషాపులకు తరలించి అమ్మేస్తారు. ఇదే స్పష్టంగా జరుగుతోంది. ఇప్పుడు ఈ నకిలీ మద్యం దందా ఆధారాలతో సహా బట్టబయలు కావడంతో ప్రజల ముందు దోషిగా నిలబడిన సీఎం చంద్రబాబు కేసు డైవర్షన్ కోసం ఈ సిట్ డ్రామాకు తెరలేపారు.
ఈ దందాలో ఆయనకు ఏ మాత్రం ప్రమేయం లేకపోతే.. కేసుపై కొంతైనా చిత్తశుద్ధి ఉంటే మా పార్టీ డిమాండ్ చేస్తున్నట్టు నకిలీ మద్యంపై సిట్‌తో కాకుండా సీబీఐతో దర్యాప్తు చేయించాలి. అలా తన నిర్దోషిత్వాన్ని, చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. అలాగే రాష్ట్రవ్యాప్తంగా అన్ని వైన్‌షాపుల్లో వెంటనే తనిఖీలు చేయాలి. ఏది అసలు మద్యమో.. ఏది నకిలీదో, కల్తీదో తేల్చాలి. ఈ వ్యవహారం వెనుక ఉన్న టీడీపీ నేతలను అరెస్ట్ చేయాలి. ఎక్సైజ్ శాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి. జయచంద్రారెడ్డితో ఒప్పందం కుదుర్చుకుని నకిలీ మద్యం దందా నడిపించిన కిలారు రాజేష్ ద్వారా ముడుపులు అందుకున్న లోకేశ్‌పైనా సీబీఐ విచారణకు ఆదేశించాలి. అప్పుడే ప్రజలకు చంద్రబాబుపై నమ్మకం ఏర్పడుతుంది’ అని మాజీ మంత్రులు కె.నారాయణస్వామి, కాకాణి గోవర్థన్‌రెడ్డి తేల్చి చెప్పారు.