
సాక్షి, అమరావతి: తిరుమలలో డిక్లరేషన్ వివాదానికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పలువురు మంత్రులు, టీటీడీ చైర్మన్, ఈవోలపై దాఖలైన కో వారెంటో పిటిషన్ విచారణ నుంచి న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి తప్పుకున్నారు. ఈ కేసులో టీటీడీ తరఫున సీనియర్ న్యాయవాది వైవీ రవిప్రసాద్ (గతంలో శేషసాయితో కలిసి ఒకే ఆఫీసులో పనిచేశారు) హాజరవుతున్న నేపథ్యంలో తాను ఈ కేసును వినబోనని న్యాయమూర్తి స్పష్టంచేశారు. ఈ కేసును మరో న్యాయమూర్తికి బదిలీ చేసే విషయంలో నిర్ణయం తీసుకునేందుకు వీలుగా కేసు ఫైళ్లను ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని రిజిస్ట్రీని జస్టిస్ శేషసాయి ఆదేశించారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు తిరుమల వెళ్లిన సీఎం జగన్ డిక్లరేషన్ ఇవ్వకపోవడం చట్ట విరుద్ధమని.. ఏ అధికారంతో వైఎస్ జగన్, కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, వైవీ సుబ్బారెడ్డి, అనిల్‌కుమార్ సింఘాల్‌లు వారి వారి పదవుల్లో కొనసాగుతున్నారో వివరణ కోరాలంటూ గుంటూరు జిల్లా వైకుంఠపురానికి చెందిన రైతు ఆలోకం సుధాకర్‌బాబు హైకోర్టులో కో వారెంటో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం మంగళవారం జస్టిస్ శేషసాయి ముందు విచారణకు వచ్చింది. అయితే, న్యాయమూర్తి ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటూ ఉత్తర్వులు జారీచేశారు.