‘జేఈఈ మెయిన్‌’కు వెళ్దాం ఇలా.. | JEE Main 2025 exam is scheduled to be held from January 22 to 31: AP | Sakshi
Sakshi News home page

‘జేఈఈ మెయిన్‌’కు వెళ్దాం ఇలా..

Jan 20 2025 5:14 AM | Updated on Jan 20 2025 6:26 AM

JEE Main 2025 exam is scheduled to be held from January 22 to 31: AP

ఎల్లుండి నుంచి 30 వరకు రోజుకు రెండు షిఫ్ట్‌లలో నిర్వహణ

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ సైట్‌లో అడ్మిట్‌ కార్డులు.. ప్రతి షిఫ్ట్‌కు మూడు రోజుల ముందుగా అడ్మిట్‌ కార్డులు విడుదల 

పరీక్ష సమయానికి రెండు గంటలు ముందుగా కేంద్రాలకు చేరుకోవాలి 

కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ విధానంలో ఆన్‌లైన్‌ పరీక్షలు

దేశంలోని ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు అర్హత కల్పించేందుకు ఉద్దేశించిన జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్‌–2025 మొదటి సెషన్‌ పరీక్షలు ఈ నెల 22 నుంచి 30 వరకు జరగనున్నాయి. ఈ నెల 22, 23, 24, 28, 29వ తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్ట్‌లలో పేపర్‌–1(బీఈ, బీటెక్‌) ప్రవేశ పరీక్షలు జరగనుండగా, ఈ నెల 30న మధ్యాహ్నం పేపర్‌–2 బీఆర్క్‌ పరీక్ష జరగనుంది.

  నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ) విధానంలో ఈ ఆన్‌లైన్‌ పరీక్షలను నిర్వహిస్తుంది. జేఈఈ మెయిన్‌కు దరఖాస్తు చేసిన విద్యార్థులకు ఏ ఊరిలో పరీక్ష కేంద్రం ఉందనే సమాచారంతో సిటీ ఇంటిమేషన్‌ వివరాలను సైట్‌లో ఉంచిన ఎన్‌టీఏ.. ఆయా తేదీల వారీగా జరిగే పరీక్షలకు మూడు రోజుల ముందుగా అడ్మిట్‌ కార్డులను విడుదల చేయనుంది. ఈ నెల 22, 23వ తేదీల్లో జరగనున్న పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థులకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను శనివారం విడుదల చేసింది.  – గుంటూరు ఎడ్యుకేషన్‌

2 గంటల ముందుగా పరీక్ష కేంద్రానికి..
జేఈఈ మెయిన్‌ అడ్మిట్‌ కార్డులు పొందిన విద్యార్థులు అందులో ఎన్‌టీఏ పొందుపర్చిన నియమ, నిబంధనలను క్షుణ్ణంగా చదవాలి. పరీక్ష సమయానికి రెండు గంటల ముందుగానే కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంది. 

ఉదయం పేపర్‌–1 ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్ష మొదటి షిఫ్ట్‌ ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, రెండో షిఫ్ట్‌లో మధ్యాహ్నం 3.00 గంటల నుంచి సాయంత్రం 6.00 వరకు జరగనుంది. ఉదయం పరీక్షకు 7.00 గంటలకు, మధ్యాహ్నం పరీక్షకు ఒంటి గంటకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ప్రకటించిన ఎన్‌టీఏ.. పరీక్ష సమయానికి అరగంట ముందు వరకు విద్యార్థులను అనుమతించిన తర్వాత ప్రధాన గేట్లను  మూసివేయనున్నట్లు స్పష్టం చేసింది.

పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు నీట్‌ తరహాలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్న ఎన్‌టీఏ.. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సాధారణ వ్రస్తాలను ధరించి రావాలని, కాళ్లకు బూట్లకు బదులుగా సాధారణ చెప్పులు ధరించాలని నిబంధనలు విధించింది. 

ఎన్‌టీఏ సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న అడ్మిట్‌కార్డు కింది భాగంలో ఇచ్చిన ఒక బాక్సులో కలర్‌ పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోను అతికించాల్సి ఉంది. ఆన్‌లైన్‌ దరఖాస్తు సమయంలో అప్‌లోడ్‌ చేసిన ఫొటోనే అతికించాల్సి ఉండగా.. పక్కన మరో బాక్సులో విద్యార్థి ఎడమ చేతి వేలిముద్ర వేయాలి. పక్కన ఉన్న మూడో బాక్సులో పరీక్ష కేంద్రంలోకి వెళ్లాక ఇని్వజిలేటర్‌ సమక్షంలో సంతకం చేయాలి.

విద్యార్థి తమ వెంట అడ్మిట్‌కార్డుతో పాటు అటెండెన్స్‌ షీట్‌పై అతికించేందుకు మరో పాస్‌పోర్ట్‌ సైజు ఫోటోను తెచ్చుకోవాలి. ప్రతి విద్యార్థి నుంచి బయోమెట్రిక్‌ హాజరు నమోదు చేయనున్నారు. ట్రాన్స్‌పరెంట్‌ వాటర్‌ బాటిల్‌తో పాటు బ్లూ, బ్లాక్‌ కలర్‌ బాల్‌ పాయింట్‌ పెన్ను తెచ్చుకోవాల్సి ఉంది. దరఖాస్తు సమయంలో అప్‌లోడ్‌ చేసిన ఆధార్, పాన్‌ తదితర ఒరిజినల్‌ కార్డును విధిగా తీసుకెళ్లాలి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement