కాల్వ గట్టును జేసీబీతో తవ్వి టిప్పర్లలో తరలిస్తున్న గ్రావెల్
ఏలూరు ఏజెన్సీలో రెచ్చిపోతున్న జనసేన నేతలు
పట్టించుకోని అధికారులు
బుట్టాయగూడెం: ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో జనసేన నేతలు రెచ్చిపోతున్నారు. ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అంటూ మన్యంలోని కొండలు, గుట్టల్ని తవ్వేస్తూ.. గ్రావెల్, మట్టిని మైదాన ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. టిప్పర్ రూ.5 వేల చొప్పున విక్రయాలు జరుపుతున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా జేసీబీలతో తవ్వి టిప్పర్లలో తరలిస్తున్నారు. వీరి చర్యల వల్ల ఏజెన్సీలోని కొండలు, గుట్టలు కరిగిపోతున్నాయి. చివరకు పంట కాలువ గట్లు, పరిసర ప్రాంతాలను కూడా వదలటం లేదు.
మట్టి, గ్రావెల్ తవ్వకాలు జరుపుతూ పగలు, రాత్రి టిప్పర్లలో తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల సహకారంతోనే తవ్వకాలు సాగుతున్నాయా అని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. బుట్టాయగూడెం మండలం నూతిరామన్నపాలెం సమీపంలోని కొండను నిబంధనలకు విరుద్ధంగా ఇటీవల జేసీబీతో తవ్వి తరలించారు. తాజాగా సోమవారం బుట్టాయగూడెం శివారు బూసరాజుపల్లి సమీపంలోని చింతలపూడి ఎత్తిపోతల పథకం కాలువ గట్టును జేసీబీతో తవ్వి గ్రావెల్, మట్టిని తరలించడం ప్రారంభించారు.
స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఇరిగేషన్ ఏఈ అక్కడికి చేరుకుని తవ్వకాలను అడ్డుకున్నారు. అక్రమంగా మట్టి తవ్వకాలపై తహసీల్దార్ కార్యాలయానికి, పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఇరిగేషన్ డీఈ ఎం.నాగరాజు తెలిపారు. అయినా అక్రమ తవ్వకాలు చేస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలని గిరిజన సంఘాల నేతలు అంటున్నారు.


