ఏప్రిల్‌ 18న నింగిలోకి జీఐశాట్‌–1

ISRO satellite launch schedule of GISAT-1 on April 18 - Sakshi

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన జియో ఇమేజింగ్‌ శాటిలైట్‌ (జీఐశాట్‌–1) ప్రయోగం మరోసారి వాయిదా పడింది. గత ఏడాది నుంచి పలుమార్లు వాయిదాలు పడుతూ వస్తున్న ఈ శాటిలైట్‌ ప్రయోగాన్ని ఆదివారం (28వ తేదీ) నిర్వహించాల్సి ఉంది. అయితే మరోమారు వాయిదా వేసుకుని, ఏప్రిల్‌ 18న నిర్వహిస్తామని బెంగళూరులోని అంతరిక్ష కేంద్రం ప్రధాన కార్యాలయం నుంచి అధికారికంగా ప్రకటించారు. ఉపగ్రహంలో చిన్నపాటి సాంకేతిక లోపం ఏర్పడిన కారణంగా వాయిదా వేశామని పేర్కొన్నారు.

అనేక సార్లు వాయిదా..
షార్‌ ప్రణాళిక ప్రకారం ఈ ఉపగ్రహ ప్రయోగం 2020 జనవరి 15న నిర్వహించాల్సి ఉండగా, సాంకేతిక పరమైన కారణాలతో 2020 ఫిబ్రవరి 10కి వాయిదా వేశారు. సాంకేతిక లోపాలను సరిచేసే క్రమంలో ఫిబ్రవరి 25కు, తర్వాత మార్చి 5కు ప్రయోగాన్ని రెండు సార్లు వాయిదా వేశారు. 2020 మార్చి 5న కౌంట్‌డౌన్‌ ప్రక్రియను కూడా ప్రారంభించిన తరువాత ప్రయోగాన్ని నిలిపివేసి, వాయిదా వేశారు. ఆ తర్వాత కరోనా లాక్‌డౌన్‌ కారణంగా సుదీర్ఘకాలం వాయిదా పడింది. తిరిగి ఈ ఏడాదిలో రెండో ప్రయోగంగా దీనిని చేపట్టగా మళ్లీ వాయిదా పడటం విశేషం.

ఇస్రో చరిత్రలో ఇదో నూతన అధ్యాయం 
జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–10 (జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–2) రాకెట్‌ ద్వారా 2,100 కిలోల బరువు కలిగిన సరికొత్త రిమోట్‌ సెన్సింగ్‌ శాటిలైట్‌ (దూర పరిశీలనా ఉపగ్రహం) ‘జీఐశాట్‌–1’ను భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని జియో ఆర్బిట్‌ (భూస్థిర కక్ష్య)లోకి ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటివరకు రిమోట్‌ సెన్సింగ్‌ శాటిలైట్స్‌ను భూమికి 506 నుంచి 830 కిలో మీటర్లు ఎత్తులో వున్న సన్‌ సింక్రనస్‌ ఆర్బిట్‌ (సూర్యానువర్తన ధ్రువ కక్ష్య)లోకి మాత్రమే పంపించేవారు. మొట్ట మొదటిసారిగా జీఐశాట్‌–1ను భూస్థిర కక్ష్యలోకి పంపిస్తుండటం విశేషం. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top