బుల్లి ఉపగ్రహాలతో.. తుర్రుమనేలా

ISRO is now focusing on small satellites - Sakshi

ఎస్‌ఎస్‌ఎల్‌వీకి ఇస్రో రూపకల్పన

మార్చిలో ప్రయోగించేందుకు సన్నద్ధం

ఏడాదిలోనే 6,000 చిన్న ఉపగ్రహాలను ప్రయోగించే దిశగా చర్యలు

విద్యార్థులనూ ప్రోత్సహించేందుకు కృషి

సూళ్లూరుపేట: అతి తక్కువ వ్యయంతో ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపిస్తూ ప్రపంచ దేశాలను ఆకర్షించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఇప్పుడు చిన్నచిన్న ఉపగ్రహాలపై దృష్టి పెట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా స్మాల్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌(ఎస్‌ఎస్‌ఎల్‌వీ)ను కూడా తయారు చేసింది.

ఈ ఏడాది మార్చి నెలలోనే దీనిని ప్రయోగించేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది చివరి నాటికి ఎస్‌ఎస్‌ఎల్‌వీ రాకెట్ల ద్వారా వంద కిలోల నుంచి 500 కిలోల బరువు కలిగిన 6,000 ఉపగ్రహాలను ప్రయోగించాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. మార్చి నెలలో ఎస్‌ఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నట్లు సమాచారం. ఆ ఫలితానికి అనుగుణంగా మార్చి 25న పూర్తిస్థాయి ప్రయోగం చేపట్టనున్నారు. 

34 మీటర్ల ఎత్తు.. రెండు మీటర్ల వ్యాసార్థం..
ఇప్పటిదాకా ఇస్రో ఎస్‌ఎల్‌వీ, ఏఎస్‌ఎల్‌వీ, పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3 అనే ఐదు రకాల రాకెట్ల ద్వారా ఉపగ్రహాలను రోదసీలోకి పంపిస్తోంది. తాజాగా వీటి సరసన ఎస్‌ఎస్‌ఎల్‌వీ చేరబోతోంది. దీన్ని నాలుగు దశల్లో ప్రయోగించే విధంగా డిజైన్‌ చేశారు. 34 మీటర్ల ఎత్తు, రెండు మీటర్ల వ్యాసార్థం కలిగి ఉంటుంది.

ప్రయోగ సమయంలో 120 టన్నుల బరువు ఉండే ఈ రాకెట్‌ను.. 500 కిలోల బరువు కలిగిన ఉపగ్రహాలను భూమికి అతి దగ్గరగా వున్న లియో ఆర్బిట్‌లో ప్రవేశపెట్టే విధంగా డిజైన్‌ చేశారు. ఈ రాకెట్‌ను వర్టికల్‌ పొజిషన్‌లో పెట్టి ప్రయోగించనున్నారు. ఎస్‌ఎస్‌ఎల్‌వీ రాకెట్‌లోని మొదటి, రెండు, మూడు దశలను ఘన ఇంధనంతో ప్రయోగించే విధంగా డిజైన్‌ చేశారు. ఇందులో ద్రవ ఇంధనం దశ ఉండదు. వెలాసిటీ టైమింగ్‌ మాడ్యూల్‌ అనే దశను కొత్తగా అమర్చారు. ఆ దశలోనే ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెడతారు.

విద్యార్థులనూ ప్రోత్సహించే విధంగా..
ఇప్పటికే దేశంలోని పలు యూనివర్సిటీలకు చెందిన ఆస్ట్రోనాట్, ఐఐటీ విద్యార్థులు చిన్నచిన్న ఉపగ్రహాలను తయారు చేస్తున్నారు. వీరిని మరింతగా ప్రోత్సహించేందుకు ఎస్‌ఎస్‌ఎల్‌వీ ఎంతగానో దోహదపడనుంది. ఇస్రో కూడా భవిష్యత్‌ శాస్త్రవేత్తలు తయారు కావాలనే లక్ష్యంతో విద్యార్థులను భాగస్వాములను చేస్తోంది. ఇందులో భాగంగానే దేశ, విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు సాంకేతిక విజ్ఞానం, తగిన ప్రోత్సాహకం అందిస్తోంది. చిన్న తరహా ఉపగ్రహాలను తయారు చేసుకుని ముందుకొస్తే.. ఇస్రో ఉచితంగా ప్రయోగించేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు ప్రత్యేకంగా రూపొందించిన ఆనంద్‌–01 అనే ఉపగ్రహాన్ని మార్చిలో ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top