తనిఖీలకు ముందే ఓ సబ్ రిజిస్ట్రార్ కు ఫోన్
హెడ్ కానిస్టేబుల్ నుంచి ఫోన్ వెళ్లినట్టు గుర్తింపు
విజయవాడకు హెచ్‌సీ బదిలీ
సబ్ రిజిస్ట్రార్ కు, కానిస్టేబుల్ మధ్య ఆర్థిక లావాదేవీలపై విచారణ
సీనియర్ అసిస్టెంట్ వద్ద పాత డాక్యుమెంట్ నంబర్ల చిట్టీ లభ్యం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)లో ‘లీకు వీరుల’ వ్యవహారం మరోసారి కలకలం సృష్టిస్తోంది. గతంలో ఏకంగా ఎనిమిది మంది ఏసీబీ సిబ్బందిపై బదిలీ వేటు పడినా.. తనిఖీలకు సంబంధించిన కీలక సమాచారాన్ని బయటకు చేరవేస్తున్న తీరు ఆగడం లేదని తాజా ఘటనతో స్పష్టమైంది. ఇటీవల ఏసీబీ తనిఖీలు నిర్వహించిన సందర్భంగా ఒక సబ్ రిజిస్ట్రార్నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్ కాల్ డేటాను పరిశీలించగా ఈ సంచలన విషయం వెల్లడైనట్లు తెలుస్తోంది.
ఏసీబీ తనిఖీలకు బయలుదేరిన అదే రోజు ఉదయం ఒక ఏసీబీ హెడ్ కానిస్టేబుల్ ఫోన్ నుంచి సదరు సబ్ రిజి్రస్టార్‌కు కాల్ వెళ్లినట్లు కాల్ డేటాలో స్పష్టంగా నమోదైంది. దీంతో ఆ హెడ్ కానిస్టేబుల్‌ను విజయవాడకు బదిలీ చేశారు. సబ్ రిజి్రస్టార్‌కు, హెడ్ కానిస్టేబుల్‌కు మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలపైనా ఏసీబీ ఉన్నతాధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు. ఈ తనిఖీల్లో ఆసక్తికరమైన మరో అంశం కూడా బయటపడింది.
సబ్ రిజిస్ట్రార్కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ వద్ద పాత డాక్యుమెంట్ నంబర్లు రాసి ఉన్న ఒక చిట్టీని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పాత నంబర్లను ఎందుకు నోట్ చేసుకున్నారు? పాత రిజి్రస్టేషన్లపై విచారణ పేరుతో ఎవరినైనా బెదిరించి సొమ్ము దండుకునే ఆలోచన చేశారా? అనే కోణంలో కూడా విచారణ జరుగుతున్నట్లు సమాచారం.
ఒక వైపు లీకులు ఏసీబీని వెంటాడుతున్నప్పటికీ.. ఈ వ్యవహారంపై ముక్కుసూటిగా ఉండే ఇన్‌చార్జి డీఎస్పీ ఆధ్వర్యంలో ఈ దఫా విచారణ పక్కాగా జరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తనిఖీలతో గుట్టురట్టు
ఇటీవల ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రార్ల కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ తనిఖీల సమాచారం ముందుగానే సబ్ రిజి్రస్టార్లకు చేరినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ లీకుల వెనుక ఉన్న వారిని పట్టుకునేందుకు అధికారులు ముందుగానే పక్కా వ్యూహం రచించారు. తనిఖీకి వెళ్లగానే ఏసీబీ అధికారులు సబ్ రిజి్రస్టార్లతో పాటు కార్యాలయంలోని సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బంది ఫోన్లను వెంటనే స్వాధీనం చేసుకున్నారు.
గత కొద్ది రోజులుగా ఆ ఫోన్లకు వచ్చిన కాల్స్ వివరాలను, ఏయే నంబర్ల నుంచి సంభాషణలు జరిగాయనే విషయాన్ని అధికారులు లోతుగా పరిశీలించారు. గతంలో రియల్ ఎస్టేట్ బూమ్ ఉన్న ప్రాంతంలో పని చేసి, ప్రస్తుతం నగరానికి వచ్చిన ఒక సబ్ రిజిస్ట్రార్ఫోన్‌లో ‘ఏసీబీ హెచ్‌సీ’అనే కాంటాక్ట్ నుంచి కాల్ వచ్చినట్లు గుర్తించారు. దీంతో తమ విభాగం నుంచే తనిఖీ సమాచారం లీక్ అవుతోందని ఉన్నతాధికారులు నిర్ధారించుకున్నారు.
8 మందిపై బదిలీ వేటు పడినా..?
గతంలో ఏసీబీ నుంచి ఎప్పటికప్పుడు వచ్చిన ఫిర్యాదులతో పాటు ఎవరిచ్చారనే విషయాన్ని కూడా లీకు చేసేవారనే విమర్శలున్నాయి. ఇందుకోసం ఆయా ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారుల నుంచి నెలవారీగా మామూళ్లు ముట్టేవనే ఆరోపణలూ ఉన్నాయి. అంతేకాకుండా అవినీతి నిరోధక శాఖ పేరుతో నకిలీ అధికారి ఒకరు నేరుగా ఏసీబీ కార్యాలయంలోనే తిష్టవేసి పిచ్చాపాటిగా గంటలకొద్దీ సమయం గడిపేవారనే ఫిర్యాదులు ప్రధాన కార్యాలయానికి వెళ్లాయి.
ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న 8 మందిని ఒకేసారి బదిలీ చేశారు. ఇదంతా జరిగి నెలలు గడిచిపోయాయి. కొత్త టీం వచ్చిందని, మరోసారి ఏసీబీ తన ప్రతాపాన్ని చూపుతుందని అంతా భావించారు. కానీ ఏసీబీకి లీకుల బెడద తప్పడంలేదు. తనిఖీలకు వెళ్తున్న విషయం కొద్ది మందికి ముందే లీకు అయినట్టు మరోసారి ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది.
ఏసీబీలోని ఒక హెడ్ కానిస్టేబుల్ తనిఖీలకు ముందు అదే రోజు ఉదయాన్నే ఒక సబ్ రిజి్రస్టార్‌కు ఫోన్ చేసి మరీ విషయాన్ని లీకు చేసినట్టు ఆధారాలతో సహా బయటపడింది. ఈ నేపథ్యంలో.. ఉన్నతాధికారులు లీకులకు పాల్పడుతున్న వారి కొత్త జాబితాను సేకరించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
బయల్దేరే సమయంలోనే..
ఏసీబీ హెడ్ కానిస్టేబుల్ ఇచ్చిన సమాచారాన్ని నమ్మి తన కార్యాలయానికి వచ్చే అవకాశం లేదని భావించిన సబ్ రిజిస్ట్రార్ధీమాగా తన పనులన్నీ చక్కబెట్టుకుంటూ సీట్లోనే కూర్చున్నారు. అయితే, ఎందుకైనా మంచిదని భావించి, కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు.
సీటు నుంచి లేచిన తక్షణమే ఏసీబీ అధికారులు ఆఫీసులోకి ప్రవేశించి తనిఖీలు ప్రారంభించినట్లు సమాచారం. వారు లోపలికి రాగానే మొదట ఆ సబ్ రిజిస్ట్రార్ఫోన్‌ను స్వాధీనం చేసుకోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సదరు సబ్ రిజి్రస్టార్‌కూ, సమాచారం లీక్ చేసిన ఏసీబీ హెడ్ కానిస్టేబుల్‌కూ మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీల వివరాలను ఉన్నతాధికారులు లోతుగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
మొత్తంగా, అవినీతికి పాల్పడిన అధికారులతో పాటు, సొంత శాఖలోని సమాచారం లీకువీరులపై ఏకకాలంలో కఠిన చర్యలు తీసుకోవడానికి ఏసీబీ ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోంది.


