సీట్ల సంఖ్య మారింది..

Intermediate Education Commissionerate Comments On Inter Colleges - Sakshi

ఇంటర్‌ కాలేజీలపై అసత్య కథనాలు

‘ఈనాడు’ కథనాలను ఖండించిన బోర్డు

తగినంత మంది సిబ్బంది, సీట్లున్నాయి

విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని వినతి

సాక్షి, అమరావతి: ‘బదిలీలు చేశారు.. నియామకాలు ఏవీ?’ అంటూ ఈనాడు దినపత్రికలో సోమవారం ప్రచురితమైన కథనం అసంబద్ధంగా, కుట్రపూరితంగా ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని ఇంటర్మీడియెట్‌ విద్య కమిషనరేట్‌ పేర్కొంది. ఈ కథనాన్ని ఖండిస్తూ కమిషనర్‌ వి.రామకృష్ణ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో తగినంత మంది అధ్యాపకులున్నారు. కొత్తగా మంజూరైన 84 జూనియర్‌ కళాశాలల్లో బోధన, బోధనేతర సిబ్బందిని నియమించాం. కృష్ణా జిల్లా పాయకాపురం, రాధానగర్, గుంటూరు జిల్లాలోని బాపట్ల, అచ్చంపేట, శ్రీకాకుళం జిల్లా రాజాం, ఎల్‌ఎన్‌.పేట, జి.సిగడాం, కొయ్యం, తూర్పుగోదావరి జిల్లా  గంగవరం పామర్రు, నెల్లూరు జిల్లా టివి గూడూరు, వెంగమాంబ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోని  అధ్యాపకులను పూర్తిగా బదిలీ చేశామనేది అవాస్తవం. విద్యార్థుల చేరిక మేరకు అతిథి అధ్యాపకుల ద్వారా ఖాళీలు భర్తీ చేయడానికి, ప్రిన్సిపాళ్ల ద్వారా నియామకాలను జరపడానికి ఉత్తర్వులు ఇచ్చాం. సుమారు 237 మంది రెగ్యులర్‌ జూనియర్‌ లెక్చరర్లను ఏపీపీఎస్సీ ద్వారా ప్రభుత్వం అతి త్వరలో నియమించనుంది. ఇంటర్వ్యూలు కూడా పూర్తయ్యాయి. అన్ని కళాశాలల్లో తరగతుల నిర్వహణకు ఇబ్బంది లేదు. ఈనాడు, ఇతర దినపత్రికలలో ప్రచురితమైన వార్తలను ఖండిస్తున్నాం. తల్లిదండ్రులు వాస్తవాలు తెలుసుకొని తమ పిల్లలను ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు పంపాలని కోరుతున్నాం’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 

అడ్మిషన్లలో గందరగోళం ఏమీ లేదు
ఇంటర్మీడియెట్‌ అడ్మిషన్లపై వచ్చిన కథనాలను కూడా రామకృష్ణ మరో ప్రకటనలో ఖండించారు. ‘ఇంటర్‌ అడ్మిషన్ల ప్రక్రియలో ఎటువంటి గందరగోళం లేదు. ఆన్‌లైన్‌ అడ్మిషన్ల గురించి చాలా ముందుగా మార్చిలోనే అన్ని కళాశాలలకు సర్క్యులర్‌ ఇచ్చాం. అడ్మిషన్ల ప్రక్రియ కంటే  ముందుగానే బోర్డు వెబ్‌సైట్‌లో విధివిధానాలను విద్యార్థులందరికి అందుబాటులో ఉంచాం. కొన్ని ప్రైవేటు కళాశాలలు ఇన్‌టేక్‌ వివరాలు  నమోదు చేయనందున వాటి పేర్లు ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. అలాంటి కళాశాలల వివరాలను కూడా బోర్డు మంజూరు చేసిన గ్రూపులు, సెక్షన్ల  ప్రకారం ఆన్‌లైన్‌లో ఉంచుతున్నాం.

కోవిడ్‌–19 కారణంగా ఫైర్‌ ఎన్‌వోసీ లేని కళాశాలలకు కూడా 60 రోజుల గడువుతో అనుమతి మంజూరు చేస్తున్నాం.  వ్యాపార భవన సముదాయాలలో, రేకుల షెడ్లలోని  కళాశాలలకు కూడా 2020–2021 విద్యా సంవత్సరానికి అనుమతి ఇచ్చాం. మొత్తం 7,42,780 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎటువంటి సీట్ల కొరత లేదు. 10వ తరగతి పాసైన ప్రతి ఒక్కరికి సీటు లభిస్తుంది. ఆన్‌లైన్‌ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగింపు, సీట్ల సంఖ్య కోర్టు ఉత్తర్వులకు లోబడి వుంటుంది . దీని గురించి విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top